ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
గంగా వసువుల సమయము (సం. 1-91-1)
వ. ‘మఱి పాండవ ధార్తరాష్ట్ర సంభవంబును సవిస్తరంబుగా వినవలతుం జెప్పు’ మనిన వానికి వైశంపాయనుం డి ట్లని చెప్పెఁ; దొల్లి యిక్ష్వాకువంశంబున మహాభిషుం డనువాఁడు పుట్టి మహాధర్మశీలుండై యశ్వమేధసహస్రంబును రాజసూయశతంబునుం జేసి యింద్రాదిదేవతలం దనిపి, దేవలోకంబునకుం జని యందు దేవర్షిగణంబులతోఁ బితామహుంగొల్చుచున్న యవసరంబున గంగానది దివ్యస్త్రీరూపధారిణి యయి బ్రహ్మసభకు వచ్చిన. 122
తే. ఊరుమూల మేర్పడఁగ నయ్యువిద వలువు | దొలఁగె ననిలంబుచేత విధూత మగుచు;
నమరు లెల్లఁ జరాఙ్ముఖు లైరి; దాని | సాభిలాషుఁ డై చూచె మహాభిషుండు.
123
ఆ. దాని నెఱిఁగి కమలయోని వానికిఁ గర | మల్గి మర్త్యయోనియందుఁ బుట్టు
మనుచు శాపమిచ్చె; నొనరంగ వాఁడును | గరము భీతిఁ గరయుగంబు మొగిచి.
124
వ. ‘మర్త్యలోకంబున రాజర్షివరులలోనఁ బుణ్యచరిత్రుండు ప్రతీపుండ కావున వానికిఁ బుత్త్రుండ నై జన్మించెద; నొరులయందు జనింపనోప’ నని కమలభవుననుమతంబు వడసె, గంగయు నమ్మహాభిషుని మహానుభావంబును రూపసౌందర్యంబులును దనయందుల యభిలాషయు నెఱింగి తానును మనోజబాణబాధిత యయి వానిన తలంచుచు మర్త్యలోకంబునకు వచ్చునది యెదుర. 125
క. అనిమిషలోక వియోగం | బున దుఃఖితు లయి వసిష్ఠమునివరు శాపం
బున వచ్చువారి వసువుల | నెనమండ్రం గాంచి గంగ యెంతయుఁ బ్రీతిన్‌.
126
క. ‘ద్యుతి దఱిగి నిజనియోగ | చ్యుతిఁ బొందను మీకు నొండుచోటికి నరుగం
గత మేమి’? యనిన విని య | య్యతివకు సురనదికి నిట్టు లని రవ్వసువుల్‌.
127
వ. ‘ఏము వసిష్ఠమునివరు శాపంబునం జేసి మర్త్యలోకంబునం దెయ్యేనియు నొక్కపుణ్యవతి యైన స్త్రీయందు జన్మింపంబోయెద’ మని దుఃఖించి, తమ శాపప్రకారంబు గంగాదేవికి నెఱింగించి, ‘యే మొండుచోట జన్మింపనోపము; నీయంద పుట్టెదము; మఱి మహాభిషుండు ప్రతీపునకు శంతనుం డై పుట్టెడుఁగావున వానికి నీకును సమాగమం బగు; మాజన్మంబునకు నిమిత్తం బాతండ యగు’ ననిన విని గంగ సంతసిల్లి యి ట్లనియె. 128
క. ‘నా కభిమతంబు నిట్టిద; | మీకును నుపకార మగు; సమీహిత బుద్ధిం
జేకొని చేసెద మీర ల | శోకస్థితి నుండుఁ’ డనుచు సురనది కరుణన్‌.
129
వ. వసువులకు మనఃప్రియంబుగాఁబలికిన విని, వారును గంగ యనుగ్రహంబు వడసి ‘నీవు మాకు నుపకారంబు సేయనోపుదేని నేము నీకుం గ్రమక్రమంబునం బుట్టునప్పుడ మమ్ము నీళ్ళ వైచుచు మర్త్యలోకంబున నుండకుండునట్లుగాఁ జేయునది; మాకు వసిష్ఠ మహాముని యనుజ్ఞయు నిట్టిద’ యనిన గంగయు ‘నట్ల చేయుదు; మఱి మీరెల్ల స్వర్గతులైన నా కొక్కకొడుకు దీర్ఘాయుష్మంతుండై యుండెడు విధం బె‘ట్లనిన దానికి వసువు లి ట్లనిరి. 130
క. మాయం దొక్కొక్కళ్ళతు | రీయాంశముఁ దాల్చి శుభచరిత్రుం డై దీ
ర్ఘాయుష్యుం డష్టమ వసు | వాయతభుజుఁ డుండు నీకు నాత్మోద్భవుఁ డై.
131
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )