ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
తన పుత్త్రునకు భార్య వగు మని ప్రతీపుఁడు గంగ కుపదేశించుట (సం. 1-92-1)
వ. అని యిట్లు గంగా వసువు లొండొరులు సమయంబు సేసికొని చని; రంత నిక్కడ. 132
క. వీరుఁడు ప్రతీపుఁ డఖిల | క్ష్మారాజ్య, సుఖములఁ దనిసి మానుగ గంగా
తీరమునఁ దపము సేయుచు | భారతకులుఁ డుండె ధర్మపరుఁడై నిష్ఠన్‌.
133
వ. ఇట్లు యమ నియమవ్రత పరాయణుండై యున్నవానికిం బ్రత్యక్షం బై యొక్కనాఁడు. 134
ఉ. గంగ నిజాంగదీప్తు లెసఁగం జనుదెంచి లతాంగి సంగతో
త్తుంగ పయోధర ద్వితయ తోయరుహానన చారునేత్ర ది
వ్యాంగన యై ప్రతీపవసుధాధిపు శాలవిశాల దక్షిణో
త్సంగమునందు మన్మథవశంబున నుండెఁ గరంబు లీలతోన్‌.
135
వ. ప్రతీపుండును దానింజూచి యచ్చెరువంది ‘నీవెందులదాన? విట్లేలనాకుఱువెక్కి?’ తనిన నది యి ట్లనియె. 136
ఆ. ఏను జహ్నుకన్య నింద్రసమాన! నీ | సద్గుణావళులకు సంతసిల్లి
భానుతేజ! నీకు భార్యగా వచ్చితి | నిష్టమునఁ బరిగ్రహింపు నన్ను.
137
చ. అనినఁ బ్రతీపుఁ డిట్లనియె; ‘నంబురుహానన యగ్నిసాక్షికం
బునఁ బరిణీత యైన సతిఁ బొల్పుగ నొక్కతఁగాని యన్యలన్‌
మనముననేనియుం దలఁప; మానిని! యిట్టి జితాత్ము నన్ను ని
ట్లని పలుకంగ నీ కగునె? యన్యులఁ బల్కినయట్ల బేల వై.
138
వ. ‘మఱి యదియునుంగాక స్త్రీభాగం బయిన డాపలికుఱువెక్కక పురుషభాగంబై పుత్త్రారోహణ యోగ్యం బైన నావలపలికుఱు వెక్కితిగావున నాపుత్త్రునకు భార్య వగు’ మనిన నదియునట్ల చేయుదునని యదృశ్యయయ్యె; నంతం బ్రతీపుఁడును బుత్త్రార్థియై సకలతీర్థంబులయందు సునందాదేవియుం దాను వేదవిహితవ్రతంబులు సలుపుచుఁ బెద్దకాలంబు దపంబు సేసిన. 139
ఆ. అధికపుణ్యమూర్తు లైన యయ్యిరువుర | కమరనిభుఁడు కౌరవాన్వయంబు
వెలుఁగుచుండఁ బుట్టె వీరాగ్రగణ్యుండు | సంతతార్థదాయి శంతనుండు.
140
వ. ఇ ట్లుదయించి పెరిఁగి సంప్రాప్త యౌవనుం డైన కొడుకుం జూచి ప్రతీపుండు తనకు నక్షయపుణ్యలోకంబులు గలిగె నని సంతసించి, సకలరాజ్యభారధౌరేయుఁగా నభిషిక్తుం జేసి కొడుకున కి ట్లనియె. 141
మధ్యాక్కర. తనుమధ్య దా నొక్కకన్య సురనదీతటమున నన్నుఁ
గనిన నక్కన్యకఁ జూచి ‘నీ విట్టి కమనీయ రూప,
వొనర నా సుతునకు భార్య వగు మన్న నొడఁబడి యియ్య
కొనియెఁ; గావున దానిఁ దగ వివాహ మగుము నెయ్యమునను.’
142
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )