ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
గంగా శంతనుల సమయము (సం. 1-92-26)
వ. మఱి యక్కోమలి కులగోత్రనామంబు లడుగక దానియిష్టంబు సలుపు మని కొడుకుం బంచి ప్రతీపుఁడు తపోవనంబునకుం జనియె; నిట శంతనుండు రాజ్యంబు సేయుచు నొక్కనాఁడు మహాధనుర్ధరుండై మృగయావినోదంబులఁ దగిలి యొక్కరుండును వనమ్ములోఁ గ్రుమ్మరువాఁ డనిలాలోలకల్లోలమాలాస్ఫాలన సముచ్చల జ్జలకణాసార శిశిరశిశిరం బగుచున్న గంగాపులినతలంబున. 143
క. తరళాయతలోచన న | త్యురుకుచఁ దేజోభిరామ నుత్తమదివ్యాం
బర మాల్య మణిమయాలం | కరణోజ్జ్వలవేష నొక్కకన్యకఁ గనియెన్‌.
144
చ. కని ‘వనకన్యయో దనుజకన్యకయో భుజగేంద్రకన్యయో
యనిమిషకన్యయో యిది వియచ్చరకన్యకయో యపూర్వ మీ
వనమున కిట్టు లేకతమ వచ్చునె మానవకన్య’ యంచు న
య్యనఘుఁడు దానిఁ జిత్తమున నాదట వోవక చూచెఁబ్రీతితోన్‌.
145
వ. అదియు నమ్మహీపతి రూపయౌవనసౌందర్యవిలాసంబుల కోటువడి మహానురాగంబున వానిన చూచుచున్నంత. 146
క. ఇరువురు నొండొరువులఁ గడు | సురుచిరముగఁ జూచు వాఁడిచూడ్కులు దనకున్‌
శరములుగాఁ గొని యేసెను | మరుఁ డయ్యిరువుర మనోభిమానచ్యుతిగన్‌.
147
వ. శంతనుండు దానిం జూచి ‘నీవెందులదాన‘ విట్లేల యేకతంబ యున్నదాన’ వని యడుగ నోడి మిన్నకయున్న నాతండు తనయందు దృఢానురాగుం డగుట యెఱింగి యది యి ట్లనియె. 148
క. భూనాథ! నీకు భార్యం | గా నన్నుఁ బరిగ్రహింపఁ గడుకొని యిష్టం
బేని సమయంబు సేయుము | మానుగ నా కిష్టమయినమార్గముఁ బ్రీతిన్‌.
149
వ. అది యెట్లంటేని -‘యే నెద్ది సేసినను దానికి నొడంబడి వారింపకుండను, నన్ను నప్రియంబులు పలుకక యుండను వలయు; నట్లైన నీకు భార్య నై యభిమతసుఖంబు లొనరింతు; నటుగాక నీ వెప్పుడేని నన్ను నప్రియంబులు వలుకు దప్పుడ నిన్నుఁ బాసిపోదు’ ననిన శంతనుండు నొడంబడి దానిం బరిగ్రహించె; గంగయు మనుష్యస్త్రీరూపధారిణియై వాని కిష్టోపభోగంబులు సలుపుచుండె; నంత. 150
సీ. వరుణుఁ డాదిగఁగల వసువులు దోడ్తోడఁ | బుట్టుచు నున్న నప్పొలఁతి వారి
నల్లన పుట్టిన యప్పుడ కొనిపోయి | నిర్దయ యై గంగనీరిలోన
వైచిన, నెఱిఁగి య వ్వసుమతీనాథుండు | ‘తనయుల ని ట్లేల దయయు లేక
గంగలో వైచెదు’? కడు నధర్మం బేల | చేసెదు’ నా నోడుఁ; జెలువ దన్నుఁ
 
ఆ. బాసిపోవు ననియుఁ బలుకక యెప్పటి | యట్ల నెమ్మి నుండు; నంతఁ బుట్టెఁ
దనయుఁ డష్టముండు దల్లిదండ్రుల కతి | ప్రీతియును ముదంబుఁ బెరుఁగుచుండ.
151
వ. అక్కొడుకుం జూచి పుత్త్రమోహంబునఁ జంపనీనోపక శంతనుండు గంగ కి ట్లనియె. 152
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )