ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
గంగ శంతనునకు వసువుల వృత్తాంతమును దెలుపుట (సం. 1-29-49)
క. పడయంగ రాని కొడుకులఁ | గడుఁ బలువురఁ బడసి పుత్త్రఘాతినివై; తీ
కొడుకు నుదయార్కతేజుని | విడువఁగ నే నోప ననుచు వేడుకతోడన్‌.
153
వ. దాని నప్రియంబులు వలికి వారించిన, నదియుం దొల్లి చేసిన సమయంబు దలంచిఁ ‘నీతోడిసంగతి నాకు నింతియ; యేను బుణ్యజలప్రవాహపవిత్రఁ ద్రిభువనపావని యనంబరఁగిన గంగఁజుమ్మీ! వసువులు వసిష్ఠుశాపంబున వసుమతిం బుట్టుచుండి యే మొండుచోట జన్మింపనోపము; నీయంద పుట్టెదము; మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మమ్ము ముక్తులం జేయు మని నన్నుం బ్రార్థించిన దేవహితార్థంబు మనుష్యస్త్రీరూపంబు దాల్చి నీవలన వసువులం బుట్టించితి; దీన నీకుం బుణ్యలోకంబు లక్షయంబు లగు; మఱియు నియ్యష్టమపుత్త్రుండు వసువులం దొక్కొక్కళ్ళ చతుర్థాంశంబులు దాల్చి సకలధర్మమూర్తి యయి పుట్టినవాఁడు; లోకహితార్థంబుగా మర్త్యంబునం బెద్దకాలం బుండు ‘ననిన గంగకు శంతనుండి ట్లనియె. 154
క. వసువు లనువా రపేత | వ్యసనులు, దేవతలు, లోకవంద్యులు; వారిన్‌
వసుమతిఁ బుట్టఁగ శాపము | వసిష్ఠముని యేల యిచ్చె వారిజనేత్రా!
155
వ. ‘మఱి వసువులు పుట్టుచు స్వర్గంబునకుం జనుటయు, నీయష్టమవసువు మర్త్యంబునం బెద్దకాలం బునికియు నేమి కారణం?’ బని యడిగిన వానికి గంగ యి ట్లనియె. 156
చ. అతులతపంబునన్‌ వరుణుఁ డన్మునిచే బహుపుణ్యకర్మసు
స్థితిఁ బ్రభవింపగాఁ బడిన దివ్యమునీంద్రుఁ డశేషలోక పూ
జితుఁడు వసిష్ఠుఁ డాశ్రమముఁ జేసి తపం బొనరించె బ్రహ్మస
మ్మితుఁ డురురత్నరాజిత సుమేరు మహీధర కందరంబునన్‌.
157
వ. మఱియు దక్షప్రజాపతి పుత్త్రియయిన సురభికిం గశ్యపునకుం బుట్టిన నందిని దనకు హోమధేను వయి కోరిన వస్తువులు గురియుచుండఁదపంబు సేయుచున్న వసిష్ఠునాశ్రమంబునకు వసువు లెనమండ్రును భార్యాసహితు లై క్రీడార్థంబు వచ్చి, వసిష్ఠుహోమధేనువుం జూచి, దాని శీలంబునకు విస్మయం బందుచున్నచో నం దష్టమవసుభార్య పతి కి ట్లనియె. 158
ఆ. దీనిపాలు ద్రావి మానవుల్‌ పదియువే | లేండ్లు జరయు రుజయు నెఱుఁగ కమర
భావమున సుఖంబు జీవింతు రటె!; దీని | నేలఁగనిన వాఁడ యెందుఁ బెద్ద.
159
వ. ‘మర్త్యలోకంబున నుశీనరపతికూఁతురు జితవతి యను కోమలి నా ప్రియసఖి; యే నెప్పుడు దానికిఁ బ్రియంబు గోరుచుండుదు; నిమ్మొదవు నమ్ముదితకిచ్చిపుత్త’ మనినఁబ్రణయిని వచనంబుల కనుగుణంబుగాఁ బ్రభాసుండు నిజభ్రాతృచోదితుం డయి వసిష్ఠుహోమధేనువుం బట్టికొనిపోయిన, నమ్మునియు దనహోమధేనువుం గానక వనంబెల్లఁ గలయరోసి, తన యోగదృష్టిం జూచి వసువులు గొనిపోక యెఱింగి. 160
ఆ. ‘మనుజయోనిఁ బుట్టుఁ’ డని వారి కప్పుడు | కోప మడర మునియు శాప మిచ్చె;
భయము వొంది వివశు లయి వచ్చి వారును | వినయ మొనర నిట్టు లనిరి మునికి.
161
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )