ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
గంగ దేవవ్రతునిం దెచ్చి శంతనున కిచ్చుట (సం. 1-94-11)
వ. ‘నీవు ధర్మమూర్తివి; మాచేసిన యజ్ఞానంబు సహించి మర్త్యంబునం బెద్దకాలం బుండకుండ మా కనుగ్రహింపవలయు’ నని ప్రార్థించిన నమ్ముని ప్రసన్నుం డయి ‘మీకోరినయట్ల యగు; నష్టముం డయిన యీప్రభాసుండుపెద్దయునపరాధంబుఁజేసెఁగావున వీఁడు మర్త్యలోకంబునం బెద్దకాలంబుండు; ననపత్యుండు నగు’ ననియె నని గంగాదేవి తనస్వరూపంబుఁ జూపి, వసూత్పత్తియు స్వర్గగమన నిమిత్తంబును గాంగేయ జన్మస్థితియునుం జెప్పి, ‘దేవవ్రతుం డయిన యిక్కుమారుండు పెరుఁగునంతకు నాయొద్దన యుండు’నని శంతను నొడంబఱిచి కొడుకుం దోడ్కొని యరిగిన; విస్మయం బంది శంతనుండు దానితోడి యిష్టోపభోగంబులం బెద్దకాలంబు సనిన నల్పకాలంబుకా వగచుచు హస్తిపురంబునకు వచ్చి. 162
మ. తన కాజ్ఞావశవర్తు లై మహిసమస్తక్షత్త్రవంశేశు లె
ల్లను భక్తిం బనిసేయుచుండఁగ విశాలం బైన సత్కీర్తి ది
గ్వనితా మౌక్తిక దామలీల వెలుఁగన్‌ వారాశిపర్యంత భూ
జనరక్షాపరుఁ డయ్యె శంతనుఁడు రాజద్రాజధర్మస్థితిన్‌.
163
వ. ఇట్లు లోకంబెల్లఁ దనధర్మమార్గంబ పొగడుచుండ సుఖంబుండి యాతం డొక్కనాఁడు మృగయావ్యాజంబున గంగాసమీపంబునం జనువాఁడు దన్నుంబాసి తనుత్వంబుఁ దాల్చినట్లు గడునల్పప్రవాహం బైయున్నదానిం గంగానదిం జూచి యిది యేమినిమిత్తంబో యనుచుం గొండొకనేల యరిగి. 164
తరలము. కనియె ముందట నమ్మహీపతి గాంగసైకత భూములం
బనుగొనన్‌ ధను వభ్యసించుచు బానసంహతి సేతుగా
ఘనముగా నమరాపగౌఘముఁ గట్టియున్న కుమారు న
త్యనఘు నాత్మసమాను నాత్మజు నాపగేయు మహాయశున్‌.
165
వ. కని పుట్టిననాఁడ చూచినవాఁడు గావున నప్పు డెఱుంగనేరక విస్మయాకులిత చిత్తుం డయి యుండెఁ; గుమారుండు నాతనిం జూచి తండ్రిగా నెఱుంగనేరకయు నిసర్గస్నేహమోహితుం డై యుండె; నంత, 166
తే. దివ్యభూషణాలంకృతదేహుఁ డైన | కొడుకు వలపలిచేయూఁది కోమలాంగి
దివ్యనది ప్రీతితోఁ జనుదెంచి పతికిఁ | జూపి ‘భూనాథ! వీఁడు నీ సూనుఁ’ డనియె.
167
వ. మఱియును. 168
సీ. సాంగంబు లగుచుండ సకలవేదంబులు | సదివె వసిష్ఠుతో; సకలధర్మ
శాస్త్రాది బహువిధశాస్త్రముల్‌ శుక్రబృ | హస్పతుల్‌ నేర్చినయట్ల నేర్చెఁ
బరమాస్త్రవిద్య నప్పరశురాముం డెంత | దక్షుఁ డంతియ కడుదక్షుఁ డయ్యె;
నాత్మవిజ్ఞానంబునందు సనత్కుమా | రాదుల యట్టిఁడ యనఘమూర్తి
 
ఆ. నొప్పుగొనుము వీని; నుర్వీశ!’ యని సుతు | నిచ్చి గంగ సనిన, నెఱిఁగి తనయు
నెమ్మిఁ దోడుకొనుచు నిధి గన్నపేదయ | పోలె సంతసిల్లి భూవిభుండు.
169
వ. తన పురంబునకు వచ్చి సకలరాజన్య ప్రధాన సమక్షంబున గాంగేయునకు యౌవరాజ్యాభిషేకంబు సేసి, కొడుకుతోడి వినోదంబులం దగిలి నాలుగువత్సరంబు లనన్యవ్యాపారుండై యుండి, యొక్కనాఁడు యమునాతీరంబున వేఁటలాడుచుఁ గ్రుమ్మరువాఁ డపూర్వసురభిగంధం బాఘ్రాణించి దానివచ్చిన వల నారయుచు నరిగి యమునాతీరంబున. 170
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )