ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
శంతనుఁడు సత్యవతిని భార్యగాఁగోరి ప్రతిహత మనోరథుఁ డగుట (సం. 1-94-41)
క. కనకావదాతకోమల | తనులతఁ దనుమధ్యఁ గమలదళనేత్రను యో
జనగంధి నవనినాథుఁడు | గనియెను సురకన్యవోని కన్నియ నంతన్‌.
171
ఉ. దాని శరీరసౌరభము, దాని విలోల విలోకనంబులున్‌,
దాని మనోహరాకృతియు, దాని శుచిస్మిత వక్త్రకాంతియున్‌,
దాని విలాసముం గడుముదంబునఁ జూచి మనోజబాణసం
తానహతాత్ముఁ డై నృపతి దానికి ని ట్లనియెం బ్రియంబునన్‌.
172
ఉ. ‘ఎందులదాన? వేకతమ యియ్యమునానది నోడ నడ్పుచున్‌
సుందరి! నీకు నున్కి యిది చూడఁగఁ దా నుచితంబె?’ నావుడున్‌
మందమనోజ్ఞహాసముఖమండల మెత్తి మృగాక్షి చూచి సం
క్రందనసన్నిభున్‌ నృపతిఁ గన్యక యి ట్లని పల్కెఁ బ్రీతితోన్‌.
173
వ. ‘ఏను దాశరాజుకూఁతురఁ; దండ్రి నియోగంబున నిక్కార్యంబు ధర్మార్థంబు సేయుచుందు’ ననిన దాని యభినవ రూపసౌందర్యంబులు దొల్లియు విని యెఱింగినవాఁ డై యక్కోమలిం గామించి దాశరాజుకడకుం జని తనయభిప్రాయం బెఱింగించిన, నతండును సంతసిల్లి శంతను నత్యంతభక్తిం బూజించి యి ట్లనియె. 174
తే. పుట్టినప్పుడ కన్యకఁ బోలునట్టి | వరుస కిచ్చుట యిది లోకవర్తనంబు;
వసుమతీనాథ! నీయట్టి వరున కిచ్చి | ధన్యులము గామె యిక్కన్యఁ దద్ద పేర్మి.
175
వ. ‘అయినను నా డెందంబునం గలదానిం జెప్పెద; నిక్కన్యక నీకు ధర్మపత్నిగాఁ జేయునట్టి యిష్టంబు గలదేని నావేఁడిన దాని ని’మ్మనిన శంతనుండు ‘దాని నీనగునేని యిచ్చెదఁ; గానినాఁడీనేర; నది యేమి సెప్పు’ మనిన దాశరా జి ట్లనియె. 176
మధ్యాక్కర. ‘భూపాల! నీకు నిక్కోమలివలనఁ బుట్టిన సుతుఁడు
నీ పరోక్షంబున రాజు గావలె; నెమ్మి ని ట్లీఁగ
నోపుదే?’ యనిన శంతనుఁడు గాంగేయు యువరాజుఁ దలఁచి
‘యీపల్కు దక్కఁగ నొండు వేఁడుమ యిచ్చెద’ ననిన.
177
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )