ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
గాంగేయుఁడు బ్రహ్మచర్యవ్రతంబుఁ బూని భీష్ముం డగుట (సం. 1-94-54)
వ. ‘నా కొండెద్దియు నిష్టంబు లే’ దనిన విని, యద్దాశరాజుచేతం బ్రతిహత మనోరథుం డయి, క్రమ్మఱి నిజపురంబునకు వచ్చి, శంతనుండు చింతాక్రాంతుం డయి సత్యవతిన తలంచుచు, నివృత్తకార్యాంతరుం డయియున్న; నొక్కనాఁడు గాంగేయుండు తండ్రిపాలికి వచ్చి యి ట్లనియె. 178
చ. భవదభిరక్షితక్షితికి బాధ యొనర్పఁగ నోపునట్టి శా
త్రవనివహంబు లేదు; వసుధాప్రజకెల్ల ననంతసంతతో
త్సవముల; రాజులెల్ల ననిశంబు విధేయుల నీకు; నిట్లు మా
నవవృషభేంద్ర! యేలొకొ మనఃపరితాపముఁ బొందియుండఁగన్‌.
179
వ. అనిన విని పెద్దయుంబ్రొద్దు చింతించి శంతనుండు గొడుకున కి ట్లనియె. 180
క. వినవయ్య! యేకపుత్త్రుఁడు | ననపత్యుఁడు నొక్కరూప యని ధర్మువులన్‌
విని, నీకుఁ దోడు పుత్త్రుల | ననఘా! పడయంగ నిష్టమయినది నాకున్‌.
181
క. జనవినుత! యగ్నిహోత్రం | బును సంతానమును వేదములు నెడతెగఁగాఁ
జన దుత్తమవంశజులకు | ననిరి మహాధర్మనిపుణు లైన మునీంద్రుల్‌.
182
క. నీవస్త్ర శస్త్ర విద్యా | కోవిదుఁడవు; రణములందుఁ గ్రూరుఁడ; వరివి
ద్రావణ సాహసికుండవు | గావున నీయునికి నమ్మఁగా నేర నెదన్‌.
183
వ. ‘బహుపుత్త్రార్థంబు యత్నంబు సేయవలయు; వివాహం బయ్యెద’ ననిన విని గాంగేయుండు వృద్ధామాత్యపురోహితసుహృజ్జనంబులతోవిచారించి, యోజనగంధి రాజు చిత్తంబునం గలుగుట యెఱింగి, యనేక రాజన్యసమన్వితుం డయి దాశరాజుకడకుం జని’ మారాజునకు సత్యవతిని దేవింగా నిచ్చునది’ యని యడిగిన; నాతండును దేవవ్రతుం బూజించి, ‘నీవు ధర్మశీలుండ, వర్థానర్థవిదుండవు, సకలకార్య సమర్థుండవు. గుర్వర్థంబు కన్యార్థివై వచ్చితివి కావునం గృతార్థుండ నైతి; నెవ్వనియేని వీర్యంబున నిక్కన్య యుద్భవిల్లె నట్టి యుపరిచరుం డను రాజర్షి ‘యీ సత్యవతి నొరుల కీవలవదు; శంతనునక యిచ్చునది’ యనుటంజేసి తొల్లి యసితుం డయిన దేవలుండు కన్యార్థి యయి వచ్చి ప్రత్యాఖ్యాతుం డయ్యె; నిట్టి సంబంధ మెవ్వరికిఁ బడయనగు?’ 184
క. విను మైనను సాపత్న్యం | బను దోషము కలదు దీన; నదియును నీచే
తన సంపాద్యము; నీ వలి | గిన నడ్డమె పురహరాజకేశవు లయినన్‌.
185
వ. ‘ఆ దోషం బెట్లు పరిహృతంబగు నట్లుగా నీచిత్తంబునం దలంచి వివాహంబు సేయు’ మనిన గాంగేయుం డి ట్లనియె. 186
చ. వినుఁడు ప్రసిద్ధులైన పృథివీపతు లిందఱు నే గురుప్రయో
జనమునఁ జేసితిన్‌ సమయసంస్థితి; యీలలితాంగి కుద్భవిం
చిన తనయుండ రాజ్యమును జేయఁగ నర్హుఁడు; వాఁడ మాకు నె
ల్లను బతి; వాఁడ కౌరవకులస్థితికారుఁ డుదారసంపదన్‌.
187
వ. అని సభాసదులకెల్ల రోమహర్షణంబుగా సత్యవ్రతుండయిన దేవవ్రతుండు పలికిన వెండియు దాశరా జిట్లనియె. 188
క. ‘నీ వఖిల ధర్మవిదుఁడవు | గావున నీ కిట్ల చేయఁగా దొరకొనియెన్‌;
భావిభవత్సుతు లిట్టిరె? | నీవిహితస్థితియు సలుపనేర్తురె?’ యనినన్‌.
189
క. ధృతిఁ బూని బ్రహ్మచర్య | వ్రత మున్నతిఁ దాల్చితిని ధ్రువంబుగ; ననప
త్యత యైనను లోకము లా | యతిఁ బెక్కులు గలవు నాకు ననుభావ్యము లై.
190
వ. అని యిట్లు సత్యవతిని దనతండ్రికి వివాహంబు సేయుపొంటె నిజరాజ్యపరిత్యాగంబును బ్రహ్మచర్య వ్రత పరిగ్రహణంబును జేసిన దేవవ్రతు సత్యవ్రతంబునకు గురుకార్యధురంధరత్వంబునకు మెచ్చి దేవర్షి గణంబులు నాతనిపయిం బుష్పవృష్టిఁ గురిసి భీష్ముం డని పొగడిరి. దాశరాజును గరంబు సంతసిల్లి శంతనునకు సత్యవతి నిచ్చె నంత. 191
మ. ఇనతేజుం డతిభక్తిఁ గాంచనరథం బెక్కించి యక్కన్యఁ దో
డ్కొని తెచ్చెం దనతల్లి సత్యవతినిన్‌ క్షోణీజనుల్‌ దన్ను బో
రనఁ గీర్తింపఁగ శంతనుం డతిమనోరాగంబునం బొంద శాం
తనవుం డాతతకీర్తి హస్తిపురికిం దత్కౌతుకారంభుఁ డై.
192
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )