ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
చిత్రాంగదా విచిత్రవీర్యుల వృత్తాంతము (సం. 1-95-1)
వ. శంతనుండును బరమానురాగంబున సత్యవతిని వివాహంబై, యతిమానుషం బయిన యాభీష్ము సత్యవ్రతంబునకు సంతసిల్లి, యాతనికి స్వచ్ఛందమరణంబుగా వరం బిచ్చి, సత్యవతియందుఁ జిత్రాంగద విచిత్రవీర్యులన నిద్దరు కొడుకులం బడసి, వారలు సంప్రాప్తయౌవనులు గాకుండఁ బరలోకగతుం డైనఁ, దండ్రికి భీష్ముండు పరలోకక్రియలు నిర్వర్తించి, చిత్రాంగదు రాజ్యాభిషిక్తుం జేసిన; నాతండును నతివ్యాలోలుండై గర్వంబున నెవ్వరి నుఱక సురదనుజ మనుజ గంధర్వాదుల నాక్షేపించుచున్న వాని కలిగి చిత్రాంగదుం డను గంధర్వపతి యుద్ధార్థియయి వచ్చినం గురుక్షేత్రంబునందు. 193
క. నరగంధర్వాధిపు ల | య్యిరువురు చిత్రాంగదులు సహింపక యని నొం
డొరుఁ దాఁకి వీఁకఁ బొడిచిరి | హిరణ్వతీ తీరమున నహీనబలాఢ్యుల్‌.
194
క. వదలక మాయాయుద్ధా | తిదక్షుఁ డయి వంచనోన్నతిన్‌ గంధర్వుం
డుదితరవితేజుఁ జిత్రాం | గదుఁ జంపె విచిత్ర పత్త్రకార్ముకహస్తున్‌.
195
వ. ఇట్లు చిత్రాంగదుండు గంధర్వనిహతుం డయినఁ, దత్పరోక్షంబున భీష్ముండు విచిత్రవీర్యుం గౌరవరాజ్యంబున కభిషిక్తుం జేసిన. 196
క. వసునిభుఁడు పైతృకం బగు | వసుధా రాజ్యంబు భీష్మువచనమున గత
వ్యసనుఁడయి తాల్చెఁ దేజం | బెసగంగ విచిత్రవీర్యుఁ డిద్ధయశుం డై.
197
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )