ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు కాశీరాజుకూఁతుల స్వయంవరమున కరుగుట (సం. 1-96-4)
వ. అట్టి విచిత్రవీర్యు నారూఢయౌవనుం జూచి భీష్ముండు వివాహయత్నపరుం డయి తన చారులవలనం గాశీరాజు కూఁతుల స్వయంవరోత్సవంబు విని ధనుర్ధరుం డయి రథం బెక్కి యొక్కరుండును వారణాసీపురంబునకుం జని యందు స్వయంవరంబునకు మూఁగిన రాజలోకం బెల్ల వెఱచి వెఱుఁగుపడి చూచుచుండ నక్కన్యకలఁ దనరథం బెక్కించికొని యెల్లవారలు విన ని ట్లనియె. 198
క. నాయనుజునకు వివాహము | సేయఁగఁ గన్యాత్రయంబుఁ జేకొని బలిమిం
బోయెద నడ్డం బగు వా | రాయతభుజశక్తి నడ్డమగుఁ డాజిమొనన్‌.
199
వ. ‘బ్రాహ్మంబు మొదలుగాఁగల యెనిమిది వివాహములయందు క్షత్త్రియులకుఁ గాంధర్వ రాక్షసంబు లుత్తమంబులు; స్వయంవరంబున జయించి వివాహం బగుట యంతకంటె నత్యుత్తమంబు గావున నిమ్మూఁగినరాజలోకంబు నెల్ల నోడించి యిక్కన్యలం డోడ్కొని నాచనుట యిది ధర్మంబ’ యని కాశీరాజునకుం జెప్పి వీడ్కొని భీష్ముండు వచ్చునప్పుడు. 200
మ. నరనాగాశ్వవరూథయూథములతో నానావనీనాథు లు
ద్ధురు లై యొక్కట నొండొరుం జఱచి యుత్తుంగానిలోద్ధూత సా
గరసంక్షోభసమంబుగాఁ గలఁగి వీఁకన్‌ వీరులై తాఁకి యే
సిరి దేవవ్రతుపై నభోవలయ మచ్ఛిద్రంబుగా నమ్ములన్‌.
201
క. వారల నందఱ రౌద్రా | కారుం డై కసిమసంగి గాంగేయుఁడు దు
ర్వార పటుబాణనిహతిని | వీరాహవరంగమునకు విముఖులఁ జేసెన్‌.
202
క. నెఱి నుఱక వైరి వీరుల | నెఱఁకుల దూఱంగ నేయు నృపపుంగవు నం
పఱ కోర్వక పిఱు సని రని | వెఱచి విషణ్ణు లయి సకలవిషయాధిపతుల్‌.
203
వ. ఇట్లు నిఖిలక్షత్త్రియక్షయార్థం బలిగిన పరశురాముండునుంబోలెఁ గడు నలిగి, పరశురామశిష్యుం డా క్షత్త్రవర్గంబునెల్లఁ దన శరధారావర్షంబున ముంచి యోడించి యేకవీరుం డయి వచ్చువాని పిఱుంద సమరసన్నద్ధుం డయి సాల్వుండు సనుదెంచి. 204
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )