ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
సాల్వుఁడు భీష్మునితో యుద్ధంబు సేయుట (సం. 1-96-27)
ఉ. ‘ఈవసుధాధినాథుల జయించిన యట్టిద కాదు; చక్కనై
పోవక నిల్వు నా కెదిరిపోర మదీయధనుర్విముక్త నా
నావిధ మార్గణోగ్ర గహనంబున దిగ్‌భ్రమఁబొంద కెమ్మెయిం
బోవఁగఁ బోలు నీకనుచుఁ బూరుకులోత్తముఁ దాఁకె వీఁకతోన్‌.
205
వ. భీష్ముండును దనరథంబు నివర్తింపించి సంవర్తసమయ సమవర్తియుంబోలె నతిరౌద్రాకారుండయి నిలిచిన. 206
చ. ‘అనిలజవంబునం బఱచు నమ్మదనాగ మెదిర్చి క్రమ్మఱిం
చిన పరికాఁడ పోలెఁ గురుసింహవరూథము నిట్లు గ్రమ్మఱిం
చునె యితఁ’ డంచునుం దగిలి చూపఱు సాల్వమహీశు విక్రమం
బొనరఁగ నల్గడం బొగడుచుండిరి విస్మయసక్తచిత్తు లై.
207
వ. అంత. 208
క. ధృతిమెయి శతసంఖ్యయు దశ | శతసంఖ్యయు శతసహస్రసంఖ్యయును శతా
యుత సంఖ్యయుఁగా దేవ | వ్రతుమీఁదను సాల్వుఁ డేసె వాఁడిశరంబుల్‌.
209
క. ఘనభుజుఁ డన్నియు నడుమన | తునియఁగ వడి నేసి, వానితురగచయస్యం
దన సూతుల నొక్కొక య | మ్మునఁ ద్రెళ్ళఁగ నేసె భరతముఖ్యుఁడు పోరన్‌.
210
క. రథమును రథ్యంబులు సా | రథియును వృథ యైన భగ్నరథుఁ డై భాగీ
రథికొడుకుచేత విమనో | రథుఁ డై సాల్వుండు నిజపురంబున కరిగెన్‌.
211
వ. ఇట్లు సకలరాజలోకంబు నెల్ల నశ్రమంబున నోడించి సాల్వరాజు మందల విడిచి పరాక్రమలబ్ధ లయిన కాశీరాజదుహితలనంబాంబికాంబాలికలందోడ్కొని వచ్చి భీష్ముండు విచిత్రవీర్యునకు వివాహంబుసేయనున్న నందుఁ బెద్దయది యైన యంబ యిట్లనియె. 212
ఆ. పరఁగ నన్ను సాల్వపతి వరియించినఁ | దండ్రిచేతఁ బూర్వదత్త నైతి
నమ్మహీశునకు; నయంబున నెయ్యది | ధర్ము వెఱిఁగి దానిఁ దలఁపు మిపుడు.
213
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )