ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
విచిత్రవీర్యుని వివాహము, మరణము (సం. 1-96-52)
వ. అనిన విని భీష్ముండు ధర్మవిదు లయిన బ్రాహ్మణుల యనుమతంబున దాని సాల్వరాజున కిచ్చిపుచ్చి,
మహోత్సవంబున నయ్యిరువురు కన్యకల విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన
214
ఉ. లాలిత రూపయౌవన విలాస విభాసిను లైన యంబికాం
బాలికలన్‌ వివాహ మయి భారతవంశకరుండు గామ లీ
లాలలితానుభోగరసలాలసుఁ డై నిజరాజ్యభార చిం
తాలసుఁ డయ్యెఁ; గామికి నయంబున నొండు దలంపఁబోలునే!
215
వ. ఇట్లు సకలవ్యాపారరహితుం డై కాశీరాజదుహితల నయ్యిరువుర నతిప్రణయగౌరవంబునం దగిలి. 216
సీ. అమలసుధారమ్య హర్మ్యతలంబుల | నవకుసుమామోద నందనములఁ
గృతకాద్రి కందర క్రీడాగృహాంగణ | వివిధరత్నోపలవేదికలను
గలహంస కలనాదకమనీయ కమలినీ | దీర్ఘికాసైకతతీరములను
రమియించుచును గామరాగాధికాసక్తిఁ | జేసి శోషించి విచిత్రవీర్యుఁ
 
ఆ. డమరపురికిఁ జనిన, నతనికిఁ బరలోక | విధుల శాస్త్రదృష్టి వెలయఁ జేసి
నాపగాతనూజుఁ డఖిలబాంధవులయు | బ్రాహ్మణులయుఁదోడ భానునిభుఁడు.
217
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )