ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
సత్యవతి భీష్ముని వివాహమాడు మని కోరుట (సం. 1-97-4)
వ. మఱియు నత్యంతశోకార్ణవంబున మునింగిన తల్లిని మఱదండ్రను నాశ్వాసించి, యరాజకం బయిన రాజ్యం బకలంకంబుగాఁబ్రతిపాలించుచున్న కొడుకు నఖిలధర్మవిదు గాంగేయుం జూచి సత్యవతి యి ట్లనియె. 218
క. శంతను సంతానంబును | సంతతకీర్తియును బిండసత్కృతియును న
త్యంత మహీభారమును బ | రంతప! నీయంద చిరతరం బై నిలిచెన్‌.
219
చ. జననుత సర్వధర్మములు సర్వజగత్పరివర్తనక్రమం
బును మఱి సర్వవంశములుఁ బుట్టిన మార్గము నీవ నిక్కువం
బనఘ! యెఱుంగు; దున్నతగుణాఢ్యుఁడవున్‌ భరతాన్వయావలం
బనుఁడవు నీవ; నిన్నొకఁడు పంచెదఁ జేయుము మత్ప్రియంబుగన్‌.
220
క. ఇక్కురువంశంబున వీ | వొక్కరుఁడవ యున్నవాఁడ; వుర్వీరాజ్యం
బెక్కటి సేకొని తేజము | దిక్కుల వెలిఁగింపు సంతతియుఁ బడయు మొగిన్‌.
221
క. ‘నిరతంబు బ్రహ్మమొదలుగ | వరుసన యెడతెగక యిట్లు వచ్చిన వంశం
బురుభుజ! నీ వుండఁగ నీ | తరమున విచ్ఛిన్న మగుట ధర్మువె?’ యనినన్‌.
222
క. విని భీష్ముఁ డనియె ‘మీ కి | ట్లని యానతి యీయఁదగునె? యమ్మెయి నాప
ల్కిన పల్కును మఱి నా తా | ల్చిన వ్రతమును జెఱుప నంత చిఱుతనె చెపుఁడా’.
223
క. హిమకరుఁడు శైత్యమును, న | ర్యముఁడు మహాతేజమును, హుతాశనుఁ డుష్ణ
త్వము విడిచిరేని గుర్వ | ర్థము నాచేకొనిన సద్వ్రతంబు విడుతునే?
224
వ. ‘పృథివ్యాది మహాభూతంబులు గంధాదిగుణంబుల నెట్లు విడువ వట్ల యేనును గురుకార్యంబున మీశుల్కార్థంబుగా సర్వజనసమక్షంబున నాచేసిన సమయస్థితి విడువ; నది యట్లుండె; మీయానతిచ్చినట్లు నాయెఱుఁగని ధర్మువులు లేవు; శంతనుసంతానంబు శాశ్వతంబగునట్లుగ క్షత్త్రధర్మంబుసెప్పెద; నాచెప్పినదాని ధర్మార్థవిదు లయి లోకయాత్రానిపుణు లయిన పురోహితప్రముఖ నిఖిలబ్రాహ్మణవరులతో విచారించి చేయునది’ యని భీష్ముఁ డందఱు విన ని ట్లనియె. 225
చ. పితృవధజాతకోపపరిపీడితుఁ డై జమదగ్నిసూనుఁ డు
ద్ధతబలు హైహయున్‌ సమరదర్పితుఁ జంపి యశేషధారుణీ
పతుల వధించె గర్భగతబాలురు నాదిగ; నట్టిచోటఁ ద
త్సతులకుఁ దొల్లి ధర్మవిధి సంతతి నిల్పరె భూసురోత్తముల్‌.
226
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )