ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
దీర్ఘతముని వృత్తాంతము (సం. 1-98-6)
వ. మఱి యదియునుంగాక యుతథ్యుం డను మునివరుపత్ని మమత యనుదాని గర్భిణి నభ్యాగతుం డయి బృహస్పతి దేవరన్యాయంబున నభిలషించినఁ దదీయగర్భస్థుం డయిన పుత్త్రుం డెఱింగి యిది ధర్మవిరుద్ధం బని యాక్రోశించిన వానికి నలిగి బృహస్పతి ‘సర్వభూతేప్సితం బైన యిక్కార్యంబునందు నాకుఁ బ్రతికూలుండ వయితివి కావున దీర్ఘతమంబును బొందు’ మని శాపం బిచ్చిన, వాఁడును దీర్ఘతముండు నాఁ బుట్టి సకలవేదవేదాంగవిదుండయి జాత్యంధుం డయ్యును తనవిద్యాబలంబునఁ బెద్దకాలంబునకుఁ బ్రద్వేషిణి యను నొక్కబ్రాహ్మణి వివాహం బయి గౌతమాదు లయిన కొడుకులం బెక్కండ్రం బడసిన, నది లబ్ధపుత్త్రయై తన్ను మెచ్చుకున్న ‘నిట్లేల నన్ను మెచ్చ?’ వని దీర్ఘతముండు ప్రద్వేషిణి నడిగిన నది యి ట్లనియె. 227
తే. పతియు భరియించుఁ గావున భర్తయయ్యె; | భామ భరియింపఁబడుఁగాన భార్య యయ్యెఁ;
బరఁగ నవి మనయందు వీడ్వడియె నిన్ను | నేన యెల్లకాలము భరియింతుఁ గాన.
228
ఆ. ‘ఎంతకాల మయిన నిప్పాట భరియింప | నోప నింక నరుగు మొండుకడకు’
ననిన నిర్దయాత్మ లని దీర్ఘతముఁ డల్గి | సతుల కెల్ల నపుడు శాప మిచ్చె.
229
క. పతిహీన లయిన భామిను | లతిధనవతు లయ్యుఁ గులజ లయ్యును ననలం
కృత లయ్యెడు మాంగల్యర | హిత లయ్యెడుఁ గృపణవృత్తి నిదియు మొదలుగన్‌.
230
వ. అనిశాపంబిచ్చిన దీర్ఘతమునకు నలిగి ప్రద్వేషిణి ‘యిమ్ముదుకని నెటయేనియుం గొనిపొం’ డని తనకొడుకులం బంచిన, వారును నయ్యౌతథ్యు నతివృద్ధు జాత్యంధు నింధనంబులతో బంధించి మోహాంధులయి గంగలో విడిచిన, నమ్మునియునుబ్రవాహవేగంబునఁబెక్కుదేశంబులుగడచి చనియె; నంత నొక్కనాఁడు బలియనురాజు గంగాభిషేకార్థంబు వచ్చినవాఁ డయ్యింధన బంధనంబున నుండియు నుదాత్తానుదాత్త స్వరిత ప్రచయస్వరభేదంబు లేర్పడ సలక్షణంబుగా వేదంబులం జదువుచుఁ, దరంగ ఘట్టనంబునం దనయున్నదరిం జేరవచ్చినవానిఁ దీరంబుఁ జేర్చి, యింధనబంధనంబులు విడిచి, మహర్షి మామతేయుంగా నెఱిఁగి, తన్నెఱింగించుకొని నమస్కారంబు సేసి యి ట్లనియె. 231
క. ఎందుండి వచ్చి తిందుల | కెందుల కేఁగుదు మహామునీశ్వర! విద్వ
ద్వందిత! నాపుణ్యంబునఁ | జెందితి ని న్నిష్టఫలముఁ జెందిన పాటన్‌.
232
వ. ‘ఏనపుత్త్రకుండనై యెవ్విధంబునను సంతానంబు వడయనేరకున్నవాఁడ; నాకు సంతానదానంబు దయసేయు’ మని యతనిం బూజించి తనపురంబునకుం దోడ్కొని చని, ఋతుమతి యై యున్న తనదేవి సుదేష్ణ యనుదాని సమర్పించిన, నదియును. 233
ఆ. పుట్టుఁ జీకు వృద్ధుఁ బూతిగంధానను | వేదజడునిఁ బొంద వెలఁది రోసి,
తన్నపోనిదానిఁ దన్విఁ గోమలిఁ దన | దాదికూఁతుఁ బంచెఁ దపసికడకు.
234
వ. ఆ దీర్ఘతముండును దానివలనఁ గాక్షీవదాదుల నేకాదశపుత్త్రులం బుట్టించిన బలియును సంతసిల్లి ‘వీరలు నాపుత్త్రకులే?’ యనిన నమ్ముని వాని కి ట్లనియె. 235
క. వీరలు నీకులపుత్త్రులు | గారు; భవద్దేవి దాదిగాదిలిసుతకున్‌
భూరిభుజ! యుద్భవించిన | వారు మహాధర్మపరు లవారితసత్త్వుల్‌.
236
వ. అనిన నబ్బలి సంతానార్థి గావున వెండియు నమ్మునిం బ్రార్థించి తత్ప్రసాదంబు వడసి సుదేష్ణ నియోగించిన దీర్ఘతముండును దానియంగంబులెల్ల నంటిచూచి ‘వంశకరుండును మహాసత్త్వుండును నయ్యెడు కొడుకు నీకుం బుట్టు’ నని యనుగ్రహించిన, దానికి నంగరాజను రాజర్షి పుట్టె; నివ్విధంబున నుత్తమ క్షత్త్రియక్షేత్త్రంబులందు ధర్మమార్గంబున బ్రాహ్మణులవలనం బుట్టివంశకరు లయిన క్షత్త్రియు లనేకులు గలరు. 237
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )