ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
సత్యవతి భీష్ముని యనుమతంబున వ్యాసుని సోదరక్షేత్రములయందు సంతానమును బడయు మని నియోగించుట (సం. 1-99-1)
క. కావున నియతాత్ము జగ | త్పావను ధర్మస్వరూపు బ్రాహ్మణుఁ బడయం
గావలయు; వాఁడు సంతతిఁ | గావించు విచిత్రవీర్యకక్షేత్రములన్‌.
238
వ. అనిన భీష్ముపలుకులకు సంతోషించి సత్యవతి దొల్లి దనకన్యయైయున్నకాలంబునఁ బరాశరుండు దన్నుఁ గామించుటయు, నమ్మునివరంబునఁ దనకన్యాత్వంబు దూషితంబు గాకునికియుఁ, దత్ప్రసాదంబునం జేసి యమునాద్వీపంబునఁ గృష్ణద్వైపాయనుండు గానీనుం డయి సద్యోగర్భంబునఁ బుట్టి పనిగలయప్పుడ తన్నుఁ దలంచునది యని చెప్పితపోవనంబునకుం జనుటయును భీష్మునకుంజెప్పి, ‘నిజతపోదహన దగ్ధపాపేంధనుం డయిన కృష్ణద్వైపాయనుం డఖిలధర్మమూర్తి నిత్యసత్యవచనుండు నా నియోగంబున నీ యనుమతంబున భవద్భ్రాతృక్షేత్రంబులయందు సంతానంబు వడయు’ ననిన, నమ్మహర్షి కీర్తనంబు విని భీష్ముండు కరకమలంబులు మొగిచి వ్యాసభట్టారకుఁ డున్న దిక్కునకు మ్రొక్కి ‘తొల్లి జగంబు లుత్పాదించిన యాదిమబ్రహ్మకుం గల సామర్థ్యంబు గల వేదవ్యాసుం డిక్కురువంశంబుఁబ్రతిష్ఠించునది యెల్లవారికి నభిమతంబ’ యనిన, సత్యవతి కురువంశోద్వహనార్థంబు పారాశర్యుం దలంచుడు నాక్షణంబ. 239
ఉ. నీలగిరీంద్ర శృంగమున నిర్మల మైన సువర్ణవల్లరీ
జాలమువోని పింగళవిశాలజటాచయ మొప్పఁగా వచ
శ్శ్రీలలితుండు వచ్చి నిలిచెన్‌ హరినీలవినీల విగ్రహా
రాళరుచుల్‌ వెలుంగఁగఁ బరాశరసూనుఁడు తల్లిముందటన్‌.
240
వ. సత్యవతియును బెద్దకాలంబునకు వచ్చిన యాప్రథమపుత్త్రు నతిహర్షంబునం గౌఁగిలించుకొని యవిరళపయోధారల నానందబాష్పధారలం జేసి యభిషేకించుచున్న, నమ్మునివరుండును దల్లి బాష్పజలంబులు దుడిచి యభివాదనంబు సేసి పురోహితపురస్సరభూసురవరులతో విధిపూర్వకంబుగా భీష్ముండు సేసిన యర్ఘ్యాదిపూజలు సేకొని సుఖాసీనుం డై యున్న, నమ్మహామునిఁ గుశలం బడిగి సత్యవతి యి ట్లనియె. 241
క. జనకునకును స్వామిత్వము | తనయోద్దేశమునఁ గలిమి తథ్యమ; యది య
జ్జననికిఁ గలుగున కావునఁ | జనుఁ బనిఁ బంపంగ నిన్ను జననుత! నాకున్‌,
242
చ. అనుపమరాజ్యసంపదకు నర్హుఁడు వంశము విస్తరింపనో
పినసుచరిత్రుఁ డీసుతుఁడు భీష్ముఁడు; దొల్లియుఁ దండ్రికిం బ్రియం
బనఘుఁడు సేయుచుండి నిఖిలావనిరాజ్యనివర్తనంబునుం
దనరఁగ బ్రహ్మచర్యమును దాల్చె జగద్విదితప్రతిజ్ఞుఁ డై.
243
క. ఈయన్వయవిచ్ఛేదము | నీ యెఱుఁగని యదియె సన్మునిస్తుత! జగముల్‌
నీయంద నిలిచినవి గా | వే యిక్కాలత్రయప్రవృత్తులతోడన్‌.
244
క. ధృతి నీయనుజుం డై వి | శ్రుతుఁ డైన విచిత్రవీర్యు సుక్షేత్రములన్‌
సుతులం బడయుము కుల మవి | రతసంతతి నెగడ దేవరన్యాయమునన్‌.
245
క. నీ కారణమున వంశ మ | నాకుల మై నిలుచుటయుఁ దదాప్తులుఁ బ్రజలున్‌
శోకభయంబులు విడుతురు, | నాకును భీష్మునకుఁ గడు మనఃప్రియ మెసఁగున్‌.
246
క. అని సత్యవతి నియోగిం | చిన వేదవ్యాసుఁ ‘డట్ల చేయుదు; నిది యెం
దును గల ధర్మువ; యెప్పుడు | వినఁబడు నానాపురాణ వివిధశ్రుతులన్‌.
247
వ. ‘ఇక్కాశీరాజ దుహితలయందు ధర్మస్థితిం బుత్త్రోత్పత్తిఁగావించెద; వీరలు నా చెప్పిన వ్రతం బొకసంవత్సరంబు సేసి శుద్ధాత్మ లగుదురేని సత్పుత్త్రులు పుట్టుదు’ రనిన సత్యవతి యి ట్లనియె. 248
క. ప్రకటముగ వంశవిస్తా | రకు లగు పుత్త్రకులఁ జెచ్చెరం బడయుదు; రరా
జక మయిన ధారుణీప్రజ | కొక నిమిషం బయినఁ బ్రకృతి నుండఁగ లావే.
249
చ. అవని యరాజకం బయిన యప్పుడ భూప్రజయందు సర్వధ
ర్మువులుఁ దొలంగు, దేవమునిముఖ్యులు వాయుదు, రోలి వృష్టిలే
దవు, మఱి యర్ఘువుల్‌ దఱుఁగు నందురు గావునఁ గాలయాపనం
బవితథవాక్య! చేయక నయంబున రాజ్యము నిల్పు మిత్తఱిన్‌.
250
క. దయ నీచే నుత్పాదితు | లయినసుతులు ద మ్మెఱుంగునంతకు భీష్ముం
డయ నయశాలి సమర్థుం | డయి చేకొని రాజ్యభార మారయుచుండున్‌.
251
వ. అని సత్యవతి కృష్ణద్వైపాయను నియోగించి ఋతుమతియు శుచిస్నాతయు నై యున్న యంబికకడకుం జని ‘క్షేత్రజుం డైనవాఁడు సుపుత్త్రుండు గావున ధర్మ్యం బైన విధానంబున నీవు రాజ్యధురంధరుం డయిన కొడుకుం బడసి భరతవంశంబు నిలుపు; మెల్లధర్మంబులకంటెఁ గులంబు నిలుపుటయు మిక్కిలి ధర్మంబు; నేఁటిరాత్రి నీకడకు దేవరుండు వచ్చుం; దదాగమనంబుఁ బ్రతీక్షించి యుండునది’ యని కోడలి నొడంబఱిచి యనేకసహస్రమహీసురులను దేవతలను ఋషులను నిష్టభోజనంబులం దనిపియున్న నారాత్రియందు. 252
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )