ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
ధృతరాష్ట్ర పాండురాజ విదురుల జననము (సం. 1-100-4)
క. ‘తివిరి సుతజన్మ మెన్నం | డవునొకొ దేవరుని వలన?’ ననుచును నవప
ల్లవకోమలాంగి యంబిక | ధవళేక్షణ విమలశయనతలమున నున్నన్‌.
253
మధ్యాక్కర. అవసరజ్ఞుం డయి వ్యాసుఁ డేతెంచె నంత నత్తపసి
కవిలగడ్డంబును గవిలజడలును గవిలకన్నులును
దవినయన్నువ నల్ల నైన దీర్ఘపుందనువును జూచి
యువిద గన్నుంగవ మొగిచి తెఱవక యుండె భయమున.
254
వ. కృష్ణద్వైపాయనుండును దానికింబుత్త్రదానంబు సేసి ‘యాయంబికయందు బలపరాక్రమవంతుం డయిన కొడుకు పుట్టు; వాఁడు మాతృదోషంబున నంధుం డగు’ ననిన విని విషణ్ణచిత్త యయి సత్యవతి వెండియుం గృష్ణద్వైపాయనుంబ్రార్థించి’ యింకనంబాలికయం దొక్కకొడుకుంబడయు’ మని నియోగించిన నెప్పటియట్ల యమ్మునివరుండు నంబాలిక కడకుం జనిన, నదియుం దనవేషంబునకు వెఱచి వెల్లనైయున్న నక్కోమలికిం బుత్త్రదానంబుసేసి’ యీయంబాలికయందు మహాబలపరాక్రమగుణవంతుండు వంశకరుండు నగుపుత్త్రుండు పుట్టు; వాఁడును మాతృదోషంబునఁ బాండుదేహుం డగు’ నని చెప్పి యరిగిన. 255
క. బలవ న్మదనాగాయుత | బలయుతుఁడు సుతుండు పుట్టెఁ బ్రజ్ఞాచక్షుం
డలఘుఁడు ధృతరాష్ట్రుం డా | లలనకు నంబికకుఁ గురుకులప్రవరుం డై.
256
క. అంబాలికకును గుణర | త్నాంబుధి పాండుర విరాజితాంగుఁడు ప్రభవిం
చెం బాండురాజు గురువం | శంబు ప్రతిష్ఠింప ధర్మసర్వజ్ఞుం డై.
257
వ. ఇట్లు క్రమంబునం బుట్టిన ధృతరాష్ట్ర పాండుకుమారులకు బ్రాహ్మణసమేతుం డై భీష్ముండు జాతకర్మాదిక్రియ లొనరించినంత. నాంబికేయు జాత్యంధుం జూచి దుఃఖిత యయి సత్యవతి వెండియుఁ బారాశర్యుం దలంచుడు, నాక్షణంబ యమ్మునివరుండు వచ్చి పని యేమి యని యన్న ‘నీయంబికకుఁ బ్రథమపుత్త్రుం డంధుం డయ్యె; నింక నొక్కకొడుకు రూపవంతుం బడయు’ మనిన, ‘నియతతాత్మ యగునేని సుపుత్త్రుండు పుట్టు’ననవుడు, సత్యవతి తొల్లింటియట్ల కోడలి నియోగించిన, నక్కోమలి యమ్మునివరు వికృతవేషరూప గంధంబుల కోపక రోసి, తనదాసి ననేక భూషణాలంకృతం జేసి తనశయనతలంబున నుండం బంచిన, వ్యాసభట్టారకుండు వచ్చి దాని చేసిన యిష్టోపభోగంబులం దుష్టుండై దానికిం బుత్త్రదానంబు సేసిన. 258
ఆ. చండకోపుఁ డయిన మాండవ్యమునివరు | శాపమున జముండు సంభవిల్లె
విదురుఁ డనఁగ ధర్మవిదుఁడు పారాశర్యు | వీర్యమునను భువి నవార్యబలుఁడు.
259
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 260
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )