ఇతిహాసములు భారతము ఆదిపర్వము - చతుర్థాశ్వాసము
మాండవ్యోపాఖ్యానము (సం. 1-101-1)
ఆ. సకలజీవరాశి సుకృత దుష్కృత ఫల | మెఱిఁగి నడుపుచున్న యట్టి ధర్ముఁ
డొంద శూద్రయోనియందు మాండవ్యుచే | శప్తుఁడై యదేల సంభవించె?
261
వ. అని యడిగిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పె; మాండవ్యుం డను బ్రహ్మర్షి దొల్లి మహీవలయంబునం గల తీర్థంబు లెల్ల నేకచారి యయి సేవించి యొక్క నగరంబున నెడ గలుగు నడవిలో నాశ్రమంబు గావించి తద్ద్వారవృక్షమూలంబున నూర్ధ్వబాహుం డయి మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న నన్నగరంబు రాజు నర్థంబు మ్రుచ్చిలికొని మ్రుచ్చు లారెకులచేత ననుధావ్యమాను లై మాండవ్యుసమీపంబునం బాఱి యయ్యాశ్రమంబులో డాఁగిన, వారి వెనుదగిలి వచ్చిన యారెకు లమ్మునిం గని ‘రాజధనాపహారు లయిన చోరులు నీయొద్దన పాఱిరెటవోయి రెఱుంగుదేని చెప్పు’ మనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి యయ్యాశ్రమంబులోఁ జొచ్చి వెదకి ధనంబుతోడ నామ్రుచ్చులం బట్టికొని. 262
ఆ. తాన చోరులకును దాపికాఁడై వేష | ధారి మిన్నకేని తపముసేయు
చున్నయట్టు పలుకకున్నవాఁడని యెగ్గు | లాడి యారెకులు నయంబు లేక.
263
వ. మాండవ్యు నామ్రుచ్చులతోన కట్టికొని వచ్చి రాజునకుంజూపి ధనంబొప్పించిన, రాజు నామ్రుచ్చులం జంపించి తపోవేషంబుననున్న మ్రుచ్చని యమ్మాండవ్యునిఁ బురంబువెలుపల శూలప్రోతుం జేయించిన. 264
క. మునివరుఁ డట్లుండియుఁ దన | మనమున నతిశాంతుఁ డయి సమత్వమునఁ దప
మ్మొనరించె ననశనుం డ | య్యును బహుకాలంబు ప్రాణయుక్తుం డగుచున్‌.
265
వ. ఇట్లు శరీరదుఃఖంబుదలంపక తపంబుసేయుచున్న యమ్ముని తపంబు పేర్మికి మెచ్చి మహామునులు పక్షులయి రాత్రివచ్చి ‘మునీంద్రా! యిట్టి మహాతపస్వి వైన నీ కిట్టి దుఃఖంబు గావించిన వా రెవ్వ’ రని యడిగిన వారికి నమ్మాండవ్యుం డి ట్లనియె. 266
తే. ఎఱిఁగి యెఱిఁగి నన్నడుగంగ నేల దీని; | సుఖము దుఃఖంబుఁ బ్రాప్తించుచోట నరుఁడు
దగిలి తనకర్మవశమునఁ దనరుఁ దాన | కర్తగా కన్యులకు నేమి కారణంబు?
267
వ. అని యమ్మహామునులతో మాండవ్యుండు పలికిన పలుకు లన్నగర రక్షకులు విని వచ్చి రాజున కెఱింగించిన, రాజునుం బఱతెంచి శూలప్రోతుం డయి యున్న మాండవ్యునకు నమస్కరించి ‘నా చేసిన యజ్ఞానంబు సహించి నాకుం బ్రసాదింపవలయు’ నని శూలంబువలన నమ్మునింబాచుచోనది పుచ్చరాకున్న, దానిమొదలు మెత్తన తునిమించినఁ దత్కంఠపార్శ్వంబునందు శూలశేషం బంతర్గతం బై యుండె; దానం జేసి యాముని యాణిమాండవ్యుండునాఁబరఁగుచునమ్మహాముని ఘోరతపంబుసేసి యెల్లలోకంబులు గమించి యొక్కనాఁడు యమునిపురంబునకుం జని ధర్మరాజున కి ట్లనియె. 268
క. దండధర! యిట్టి దారుణ | దండమునకు నేమిదుష్కృతముఁ జేసితి? ను
గ్రుండ వయి తగనిదండము | దండింపఁగ బ్రాహ్మణుండఁ దగునే నన్నున్‌?
269
వ. అనిన మాండవ్యునకు ధర్మరా జి ట్లనియె. 270
క. సొలయక తూనిఁగలం గొ | ఱ్ఱులఁ బెట్టితి నీవు నీచిఱుతకాలము త
త్ఫల మిప్పు డనుభవించితి; | తొలఁగునె హింసాపరులకు దుఃఖప్రాప్తుల్‌.
271
వ. అనిన విని మాండవ్యుం డలిగి ‘జన్మంబు మొదలుగాఁబదునాలుగువత్సరంబులు దాఁటునంతకుఁబురుషుండు బాలుండు; వాఁడెద్ది సేసినఁ బాపంబుం బెద్ద పొరయండు; వానికి నొరు లెగ్గుసేసినఁ బాతకు లగుదు; రిది నాచేసిన మర్యాద; నీవిట్టి ధర్మంబు దలంపక బాల్యంబున నల్పదోషంబుఁజేసిన నాకు బ్రాహ్మణోచితంబుగాని క్రూరదండంబు గావించినవాఁడవు మర్త్యలోకంబున శూద్రయోనిం బుట్టు‘మని శాపం బిచ్చుటంజేసి వాఁడు విదురుం డై పుట్టె. 272
క. అని మాండవ్యాఖ్యానము | జనమేజయునకు నుదారచరితునకుఁ బ్రియం
బునఁ జెప్పెను వైశంపా | యనుఁ డవితథపుణ్యవచనుఁడని కడుభక్తిన్‌.
273
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )