ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
ధృతరాష్ట్రపాండుకుమారులు పెరుఁగుట (సం. 1-102-1)
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె: నట్లు ధృతరాష్ట్రపాండువిదురులు భీష్మాభిరక్షితులై పెరుఁగుచు, నుపనయనానంతరంబున నధ్యయనం బొనరించి రాజవిద్యలయందు జితశ్రము లై యున్నంత. 2
సీ. అమరాపగాసుతు ననుశాసనంబునఁ| గౌరవ రాజ్యంబు గడు వెలింగెఁ,
గురుభూము లుత్తరకురువులకంటెను | నధికలక్ష్మీయుక్తి నతిశయిల్లె,
ధర్మాభిసంరక్షితం బైన భూప్రజ | కెంతయు నభివృద్ధి యెసఁగుచుండె,
వలసినయప్పుడు వానలు గురియుట | సస్యసమృద్ధి ప్రశస్త మయ్యెఁ,
 
ఆ. బాలు సేఁపెఁ బుష్పఫలభరితంబు లై | తరువనంబు లొప్పె, ధర్మకర్మ
నిరతిఁ జేసి కరము నెమ్మితో నన్యోన్య | హితముఁ జేయుచుండి రెల్ల జనులు
3
మ. అమలాచారపవిత్రభూసురవరేణ్యాగార పుణ్యప్రదే
శములం దధ్యయనారవంబు విధివత్స్వాహాస్వధాస్వస్తిశ
బ్దములున్‌ మంగళతూర్యఘోషములు నుద్యత్కౌతుకాశీర్నినా
దములున్‌ రమ్యతరంబు లయ్యె ధరణిం దద్రాజ్యసంవృద్ధితోన్‌.
4
వ. ఇట్లు బ్రహ్మోత్తరంబుగాఁ బ్రజాభివృద్ధియు సస్యసమృద్ధియు నగుచుండ, నాంబికేయు ధృతరాష్ట్రు రాజ్యాభిషిక్తుం జేసి, భీష్ముండు దనకు విల్లును విదురుబుద్ధియును సహాయంబులుగా రాజ్యంబు రక్షించుచున్నంత. 5
ఉ. ఆయము గర్వమున్‌ విడిచి యన్యపతుల్‌ పనిసేయ నిట్లు గాం
గేయభుజాబలంబున నికృత్తవిరోధిసమాజుఁ డై కుమా
రాయితశక్తిశాలి ధృతరాష్ట్రుఁడు రాజ్యము సేయుచుండె న
త్యాయతకీర్తితోఁ దనకు హస్తిపురం బది రాజధానిగన్‌.
6
వ. ఇట్లు రాజ్యంబు సేయుచు నారూఢ యౌవనుం డైన యా ధృతరాష్ట్రునకు వివాహంబు సేయ సమకట్టి, భీష్ముండు గాంధారపతి యయిన సుబులుకూఁతు గాంధారి యనుదాని, నతిశయ రూపలావణ్య శీలాభిజాత్య సమన్వితఁగా బ్రాహ్మణులవలన విని విదురున కి ట్లనియె. 7
క. ఈ వంశము విచ్ఛేదము | గావచ్చినఁ గులము నిలుపఁగా సత్యవతీ
దేవి వచనమున సంతతి | గావించెను వ్యాసుఁ డను జగత్కర్త దయన్‌.
8
క. ఈ కులము వివర్ధింపఁగ | నా కభిమత; మేను వింటి నలినేక్షణ దా
నేకశత సుతులఁ బడయఁగ | నా కన్యక వరము వడసె నటె హరుచేతన్‌.
9
వ. ‘కావున ధృతరాష్ట్రునకు గాంధారిని వివాహంబు సేయుదము; గాంధారపతి మనతోడి సంబంధమునకుం దగు’ నని నిశ్చయించి సుబలు పాలికిఁ దగుముదుసళ్ళం బంచిన, సుబలుండును సుముఖుం డై ‘కురుకులవిస్తారకుం డయిన ధృతరాష్ట్రుండ యిక్కన్యకకు నర్హుండు గావున నా రాజునకు గాంధారి నిచ్చితి’ ననిన, వాని బంధుజనంబు లెల్లఁ దమలో ని ట్లనిరి. 10
తే. అంగములలోన మే లుత్తమాంగ, మందు | నుత్తమంబులు గన్నుల యుర్విజనుల,
కట్టి కన్నులు లే వను నదియకాక | యుత్తముఁడు గాఁడె సద్గుణయుక్తి నతఁడు.
11
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )