ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహంబు సేసికొనుట (సం. 1-103-10)
వ. అనిన వారిపలుకులు విని గాంధారి ధృతరాష్ట్రునకుఁ బితృవచనదత్తఁగాఁ దన్ను నిశ్చయించి, ‘నాకుఁ బతి యిమ్మహీపతియ కాని యొరుల నొల్ల’ నని యప్పరమపతివ్రత పరపురుషదర్శనంబు పరిహరించి, పతి కను గుణంబుగా నేత్రపట్టంబునఁ దన నేత్రంబులు గట్టికొని యుండె; నంత నక్కన్యం దోడ్కొని దాని సహోదరుం డయిన శకుని మహావిభూతితో హస్తిపురంబునకు వచ్చిన, ధృతరాష్ట్రుండును బరమోత్సవంబున గాంధారిని వివాహంబై దానితోఁ బుట్టిన కన్యకల సత్యవ్రతయు సత్యసేనయు సుదేష్ణయు సంహితయుఁ దేజశ్శ్రవయు సుశ్రవయు నికృతియు శుభయు శంభువయు దశార్ణయు నను పదుండ్ర నొక్కలగ్నంబున వివాహం బయి మఱియును. 12
క. కులమును రూపము శీలముఁ | గల కన్యలఁ దెచ్చి తెచ్చి గాంగేయుం డీ
నలఘుఁడు ధృతరాష్ట్రుఁడు కుల | తిలకుండు పరిగ్రహించె దేవీశతమున్‌.
13
వ. అంత. 14
సీ. వేదంబులందుఁ బ్రవీణుఁడై మఱి సర్వ | శాస్త్రంబులందుఁ గౌశలము మెఱసి
యసికుంత కార్ముకాద్యాయుధ విద్యల | యందు జితశ్రముఁ డై తురంగ
సింధురారోహణశిక్షల దక్షుఁడై | నీతిప్రయోగముల్‌ నెఱయ నేర్చి
యతిమనోహర నవయౌవనారూఢుఁడై | కఱలేని హిమరశ్మికాంతి దాల్చి
 
ఆ. పెరుఁగుచున్న కొడుకుఁ బృథువక్షు నాయత | బాహు దీర్ఘదేహుఁ బాండుఁ జూచి
వీనివలనఁ గులము వెలుఁగు నంచును నెడ | జాహ్నవీసుతుండు సంతసిల్లి.
15
వ. ఇ క్కుమారున కెందు వివాహంబు సేయుద మని విదురుతో విచారించుచుండె; నంతఁ దొల్లి. 16
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )