ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
కుంతిచరిత్రము (సం. 1-104-1)
సీ. యాదవకులవిభుఁ డగు శూరుఁ డను నాతఁ | డాత్మతనూజలయందుఁ బెద్ద
దాని నంబుజముఖి ధవళాక్షి వసుదేవు | చెలియలిఁ బృథ యను చెలువఁ బ్రీతిఁ
దనమేనయత్తనందనుఁ డపుత్త్రకుఁ డైన | యా కుంతిభోజున కర్థితోడఁ
గూఁతుఁగా నిచ్చినఁ గోమలి యాతని | యింటఁ దా నుండి యనేక విప్ర
 
తే. వరుల కతిథిజనులకు నవారితముగఁ | దండ్రి పనుపున నిష్టాన్నదాన మొనరఁ
జేయుచున్న దుర్వాసుఁ డన్‌ సిద్ధమౌని | వచ్చె నతిథి యై భోజనవాంఛఁ జేసి.
17
వ. కుంతియు న మ్మునివరు కోరిన యాహారంబు వెట్టిన సంతుష్టుం డై యమ్మునివరుం డి ట్లనియె; ‘నీమంత్రంబున నీ వే వేల్పుల నారాధించి తవ్వేల్పులు నీకోరినయట్టి పుత్త్రకుల నిత్తు’ రని యాపద్ధర్మంబుగా నొక్కదివ్యమంత్రంబుఁబ్రసాదించి చనిన, నమ్మంత్రశక్తి యెఱుంగ వేఁడి కుంతి యొక్కనాఁ డేకాంతంబ గంగకుం జని యవగాహనంబు సేసి. 18
క. అ మ్మంత్రముఁ దనదగు హృద | యమ్మున నక్కన్య నిలిపి యాదిత్యున క
ర్ఘ్యమ్మెత్తి ‘ నాకు నిమ్ము ప్రి | యమ్మున నీ యట్టి పుత్త్రు నంబుజమిత్త్రా! ’
19
క. అని కేలు మొగిచి నిలిచిన | వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనం
బున నుండి కమలమిత్త్రుఁడు | తన తీవ్రకరత్వ ముడిగి తరుణద్యుతితోన్‌.
20
వ. అ క్కన్యకయు నట్టి తేజోరూపంబు సూచి విస్మయంబునను భయంబునను గడు సంభ్రమించి నడునడ నడుంగుచున్నదాని ‘నోడకుండు’ మని సూర్యుండు ప్రసన్నుండై ‘నీకోరినవరం బీ వచ్చితి’ ననిన గొంతియు లజ్జావనతవదనయై’ యొక్కబ్రహ్మవిదుండు నాకుం గరుణించి యిమ్మంత్రం బుపదేశించిన దానిశక్తి నెఱుంగ వేఁడి యజ్ఞానంబున నిన్నుం ద్రిలోకైకదీపకుం ద్రిపురుషమూర్తిఁ ద్రివేదమయు రావించిన యీయపరాధంబు నాకు సహింపవలయు.’ 21
ఆ. ‘ఎఱుకలేమిఁ జేసి యింతు లెప్పుడు నప | రాధయుతలు సాపరాధ లయిన
వారిఁ గరుణ నెల్లవారును రక్షింతు’ | రనుచు సూర్యునకు లతాంగి మ్రొక్కె.
22
వ. సూర్యుండును ‘నీకు దుర్వాసుం డిచ్చిన వరంబును మంత్రంబుశక్తియు నెఱుంగుదు; మదీయదర్శనంబు వృథగాదు; నీ యభిమతంబు సేయుదు’ ననిన గొంతి యి ట్లనియె. 23
ఆ. ఏను మంత్రశక్తి యెఱుఁగక కోరితిఁ | గన్య కిదియు కోరఁగాదు నాక;
నాకు గర్భమయిన నాతలిదండ్రులుఁ | జుట్టములును నన్నుఁ జూచి నగరె?
24
వ. అనిన విని సూర్యుండు దానికిఁ గరుణించి ‘నీకు సద్యోగర్భంబునఁ బుత్త్రుఁ డుద్భవిల్లు; నీకన్యాత్వంబును దూషితంబుగా’ దని వరం బిచ్చినఁ, దత్‌క్షణంబ యక్కన్యకకు నంశుమంతునంశంబునఁ గానీనుం డై. 25
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )