ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
కర్ణుఁడు జనియించి సూతగృహంబు సేరుట (సం. 1-104-10)
చ. సలలిత మైన పుట్టుఁగవచంబు నిసర్గజ మైన కుండలం
బుల యుగళంబు నొప్పఁగ సుపుత్త్రుఁడు కర్ణుఁడు పుట్టె సూర్యమం
డలమొకొ భూతలంబున బెడంగయి దీప్తిసహస్రకంబుతో
వెలుఁగెడు నా నిజద్యుతి సవిస్తరలీల వెలుంగుచుండఁగన్‌.
26
వ. అంత నాదిత్యుం డాకాశంబున కరిగినఁ, గొడుకుం జూచి కుంతి దద్దయు విస్మయం బంది యెద్దియుం జేయునది నేరక. 27
తరువోజ. ఏల యమ్ముని నాకు నిచ్చె నిమ్మంత్ర? మిమ్మంత్రశక్తి యే నెఱుఁగంగ వేఁడి
యేల పుత్త్రకుఁ గోరి యెంతయు భక్తి నినుఁ దలంచితిఁ బ్రీతి? నినుఁడును నాకు
నేల సద్యోగర్భమిచ్చెఁ? గుమారుఁ డేల యప్పుడ యుదయించె? నిం కెట్టు
లీ లోకపరివాద మే నుడిగింతు? నింతకు నింతయు నెఱుఁగరె జనులు!
28
వసంతతిలకము. ‘ఈ బాలు నెత్తుకొని యింటికిఁ జన్న, నన్నున్‌
నా బంధు లందఱు మనంబున నేమనా? రె
ట్లీ బాలసూర్యనిభు నిట్టుల డించి పోవం
గా బుద్ధిపుట్టు?’ నని కన్య మనంబులోనన్‌.
29
వ. వందురి వగచుచున్న దాని పుణ్యంబున నాదిత్యప్రేరితం బయి యనర్ఘరత్నవసుభరితంబయిన యొక్కమంజస నదీప్రవాహవేగంబునం దనయొద్దకు వచ్చిన, దానిలోఁ జెచ్చెరఁ దనకొడుకుం బెట్టి, కుంతి నిజగృహంబునకు వచ్చె; నంత. 30
ఆ. ఘనభుజుండు రాధ యను దానిపతి యొక్క | సూతుఁ డరుగుదెంచి చూచి రత్న
పుంజభరిత మయిన మంజసలో నున్న | కొడుకు దానితోన కొనుచు వచ్చి.
31
క. తన భార్యకు రాధకు ని | చ్చిన నదియును గరము సంతసిల్లి కుమారుం
గని చన్నులు సేఁపి ముదం | బునఁ బెనిచెను సుహృదు లెట్టిపుణ్యమొ యనఁగన్‌.
32
వ. ఇట్లు వసునివహంబుతో వచ్చుటంజేసి వసుషేణుం డను నామంబునం బరగి కర్ణుండు రాధేయుం డై సూతగృహంబునం బెరుఁగుచుండె; నంత నిట. 33
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )