ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
పాండురాజు వివాహ మై దిగ్విజయము సేయుట (సం. 1-105-1)
సీ. యదుకులవిమలపయఃపయోనిధిసుధా | కరరేఖఁ, గమనీయకాంతినిలయ,
ననవరతాన్నదానాభితర్పితముని | విప్రజనాశీఃపవిత్రమూర్తి,
వినయాభిమానవివేకసౌజన్యాది | సదమలగుణరత్నజన్మభూమిఁ,
బరమపతివ్రతాభరణాభిశోభితఁ | దామరసేక్షణఁ, దాల్మియందుఁ
 
ఆ. బృథివిఁ బోనిదానిఁ బృథయను కన్యక | నధికవీరుఁ డై స్వయంవరమునఁ
బడసి పరనరేంద్రపరిభావి పాండు భూ | వరుఁడు పేర్మితో వివాహ మయ్యె.
34
వ. మఱియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి యనుదాని మహోత్సవంబున వివాహంబై పాండురాజు భరతకులరత్నాలంకారుం డై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చక యపారచతురంగబలసమన్వితుం డై. 35
మ. ధ్వజినీ పాత భరంబునం దలరఁగా, ధాత్రీధరాహీంద్ర మూ
ర్ధజరత్నప్రకరంబు లున్నతగజేంద్రస్యందనప్రోల్లస
ద్ధ్వజ వాతాహతిఁ దూలఁగా జలదబృందం బీక్రియన్‌ సర్వది
గ్విజయార్థం బరిగెం గురుప్రభుఁడు దోర్వీర్యప్రకాశార్థి యై.
36
క. అతులప్రతాపలీలా | యుతుఁ డై ప్రాగ్దక్షిణాపరోత్తర దిగ్భూ
పతుల నిజశాసన వశీ | కృతులం గావించెఁ దనదుకీర్తి వెలుంగన్‌.
37
మహాస్రగ్ధర. అతిరౌద్రాకారకీలాయతదవదహనోగ్రాగ్ర సేనానిపీడా
హతు లై నానావిధోపాయనములు గొని సౌహార్దవాంఛన్‌ జయశ్రీ
శ్రితబాహుం గానఁగా వచ్చిరి సకలజగత్సేవ్యమానున్‌ మహేంద్ర
ప్రతిముం గౌరవ్యవంశప్రభు నఖిలమహీపాలు రాంబాలికేయున్‌.
38
చ. లలిత హయ ద్విపంబుల విలాసినులన్‌ మణిరౌప్య కాంచనా
వలుల నజావిగోమహిష వర్గములన్‌ బహుభూషణంబులన్‌
బలువిడిఁ గప్పముల్‌ ధరణిపాలురచేఁ గొని నూఱువేల్‌గజం
బులఁ బెఱికించి తెచ్చెఁ గురుముఖ్యుఁ డకుప్యధనమ్ము లిమ్ముగన్‌.
39
క. శరనిధిపరివృత విశ్వం | భరఁ గల భూపతులు పాండుపతికృతమునఁ గిం
కరు లై ప్రతిసమకల్పిత | కరు లై రది మొదలుగాఁగఁ గౌరవ్యులకున్‌.
40
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )