ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
పాండురాజు సత్కృత్యములు (సం. 1-106-1)
వ. ఇట్లు పాండురాజు దిగ్విజయంబు సేసి తదుపార్జితంబు లైన యపరిమితధనంబులఁ దెచ్చి ధృతరాష్ట్రుననుమతంబున భీష్మునకు సత్యవతికిం దమతల్లు లైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు నిచ్చి, వారివలన ననేకాశీఃప్రశంసలు వడసి సుఖం బున్నంత. 41
చ. వినుతయశుండు పాండునృపవీరుఁడు దిగ్విజయంబు సేసి పెం
పునఁ గొనివచ్చి యిచ్చిన యపూర్వ మహా ధనరాశి పేర్మి వా
రని విభవంబుతోడ ధృతరాష్ట్రుఁడు సేసె శతాశ్వమేధముల్‌
దనిసన భూసురేశులకు దక్షిణ లిచ్చి యథోచితంబుగన్‌.
42
వ. మఱియు నప్పాండురాజు వినయవిధేయత్వంబున ధృతరాష్ట్రునకు, నభిమతకార్యకరణంబున బాంధవులకు, ననుకూలత్వంబున సుహృజ్జనులకుఁ, బరిశ్రమజ్ఞానంబున విద్వాంసులకుఁ, గారుణ్యదానంబున ననాథులకు, నభయంకరత్వంబున మహీప్రజలకు సంతోషంబు సేయుచు. 43
క. ‘మండిత గుణ సంపద నధి | కుం డగుచున్‌ బూరు భరత కురు పతులకుఁ దు
ల్యుం డయి వంశకరుం డగుఁ | బాండుమహీశుఁ’ డని బుధసభలు దనుఁ బొగడన్‌.
44
క. నానాద్రవ్య నిరంతర | దానముల ననూనయజ్ఞదక్షిణలను ధా
త్రీనాథుఁడు బ్రాహ్మణులను | శ్రీనిలయులఁ జేయుచుండె శిష్టప్రియుఁ డై.
45
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )