ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
వేటకుఁ బోయిన పాండురాజునకు శాపంబు గలుగుట (సం. 1-109-5)
వ. మఱియు ననేకవినోదంబులను ననవరతకామానురూపవిషయసుఖానుభవంబులనుం బ్రొద్దు పుచ్చుచు నాతండు మృగయావ్యసనంబునం దగిలి. 46
ఉ. వాసవసన్నిభుండు హిమవన్నగదక్షిణపార్శ్వభూములన్‌
శ్రీసతిఁ బోని కుంతియును జెల్వగు మాద్రియుఁ దోడ రాఁగ బా
ణాసన బాణ భాసిత మహాభుజుఁడై విహరించుచుండె ని
చ్ఛాసదృశంబుగా గజవశాద్వయమధ్య గజేంద్ర లీలతోన్‌.
47
వ. మఱియుఁ దనకు ధృతరాష్ట్రుం డిష్టాన్నపాన మాల్యానులేపన భూషణాదులు నిత్యంబునుం బుత్తెంచుచుండ నిట్లు వనవాసవ్యాసంగంబున నుండి, యొక్కనాఁడు పెక్కుమృగంబుల నెగిచి యొక్కటి నేనియు నేయంగానక కినిసి యొక్కయెడ. 48
క. మనసిజరాగంబునఁ బెనఁ | గిన యిఱ్ఱిని లేడిఁ జూచి కృతహస్తుఁడు పె
ల్చన యే నమ్ముల నారెం | టిని ద్రెళ్ళఁగ నేసెఁ గడుఁ గఠినహృదయుం డై.
49
వ. ఇ ట్లేసి యబ్బాణంబులు పుచ్చికొనియున్న యప్పాండురాజుం జూచి యమ్మృగమిథునంబునం దల్పావశిష్టజీవం బై పడియున్న మృగంబు మనుష్యవచనంబుల ని ట్లనియె. 50
తరలము. హరిపరాక్రమ! యేను గిందముఁ డన్మునిన్‌, మృగముల్‌ నిరం
తరము నిట్లు రమింపఁగాఁ గని తద్రతం బెడఁ గోరి సుం
దర మృగాకృతి నేను భార్యయు దారుణాటవిఁ గామ భో
గరతి నుండితి మిష్టచారిమృగవ్రజంబుల పొత్తునన్‌.
51
వ. మృగముల మై యున్న మమ్ము వధియించిన దీన నీకు పాతకంబు లేదు; వేటలాడుటయు, మృగంబులఁ జంపుటయు రాజులకు ధర్మంబ; యయినను. 52
తే. పఱవనోపక యున్న, మైమఱచి పెంటిఁ | బెనఁగియున్నను, బ్రసవింప మొనసియున్నఁ,
దెవులు గొనియున్న మృగములఁ దివిరి యేయ | రెఱచి యాహారముగ మను నెఱుకు లయిన.
53
చ. ఇనసమతేజు లై ధరణి నెన్నడు ధర్మపథంబు దప్పఁ ద్రొ
క్కని భరతాదిరాజుల జగన్నుతవంశమునందుఁ బుట్టి నీ
కనఘచరిత్ర | యిట్లు దగునయ్య యధర్మువు సేయ? నీ యెఱుం
గని నృపధర్మువుల్‌ గలవె? కౌరవపుంగవ! గౌరవస్థితిన్‌.
54
వ. అని తన్ను నిందించి పలికిన నామృగంబు పలుకుల కలిగి పాండురా జి ట్లనియె. 55
తే. పగఱఁ గని సైఁతురేనియు మృగకులంబు | గని సహింపరు రాజులు; మొనసి వాని
గ్రచ్చఱగఁ జంపుదురు; నమ్మి కిచ్చి చంపఁ | జనదు; మాయాబలంబునఁ జనదు చంప.
56
వ. ‘తొల్లి యగస్త్య మహామునీంద్రుండు మృగ మాంసంబున నిత్యశ్రాద్ధంబు సేయుచుండి రాజులకు మృగవధ దోషంబు లేకుండ నిర్మించె; దీని నీకు నిందింపఁదగునే?’ యనుచున్న నమ్మృగంబులు బాణఘాతక్షతవేదన సహింపనోపక ‘సర్వప్రాణులకు సాధారణం బయి యిష్టం బగు సుఖావసరంబున నున్న మమ్ము ననపరాధుల వధించితి గావున నీవునుం బ్రియాసంగమం బయిన యప్పుడ పంచత్వం బొందెడు’ మని, ‘నీ ప్రియయు నిన్ను ననుగమించు’ నని పాండురాజునకు శాపం బిచ్చి, గతప్రాణము లై పడియున్న మృగంబులం జూచి శోకించి పాండురాజు పరమ నిర్వేదనపరుం డయి. 57
క. ఎట్టి విశిష్టకులంబునఁ | బుట్టియు, సదసద్వివేకములు గల్గియు, మున్‌
గట్టిన కర్మఫలంబులు | నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్‌?
58
వ. కామవ్యామోహితుం డయి కొండుకనాఁడు మదీయజనకుండు పరలోకగతుం డైనఁ దత్‌క్షేత్రంబున ధర్మమయుం డయిన కృష్ణద్వైపాయనమునివలన నుద్భవిల్లి, ధర్మప్రవృత్తుండ నై యున్న నా కిట్టి దుర్వ్యసనంబు కర్మవశంబున సంభవించె; నింక మునివృత్తియ యుచితంబు గావున సర్వసంగంబులు విడిచి, సర్వభూతంబులయందు సమచిత్తుండనై, హింస దలంపక నిత్యంబు నొక్కొక్కవనస్పతియందు నొక్కొక్కవన్య ఫలంబు భిక్ష గొని, యసంభవం బయిననాఁ డుపవాసంబు సేసి, వృక్షమూలంబున నుండి పాంసుపరిచ్ఛన్నదేహుండ నయి. 59
సీ. ఇంద్రియార్థంబులం దింద్రియవ్యాపార | ముడిగించి; క్రియ లెల్ల విడిచి, పుణ్య
పాపబంధంబుల నోపి బంధింపంగఁ | బడక మనోవృత్తి నొడిచి, నాకు
నిది ప్రియం బప్రియం బిది నింద యిది మహా | స్తుతి యిది యనక, సంతత నితాంత
సంతోషయుతుఁడనై వంతయు భయమును | శీతాతపంబులు వాతగతియు
 
ఆ. నెఱుఁగ కివ్విధమున మఱచి, శరీరంబు | మరణజీవితముల కురువిషాద
తోషవృత్తు లుడిగి, భీషణాటవి నుండి | చేసెదను దపంబు భాసురముగ.
60
వ. అని నిశ్చయించి, గొంతిని మాద్రినిం జూచి; ‘మీర లిందుండి నవయక హస్తిపురంబునకుం జని నాతపోవృత్తి నునికి రాజునకు సత్యవతీదేవికి భీష్మునకు విదురనకుం గౌసల్యలకు వృద్ధపురోహిత బ్రాహ్మణులకుం జెప్పి యం దుండుం’ డనిన, వారలు బాష్పపూరితనయన లయి ‘యిట్టి యుగ్రతపంబు విడిచి, మమ్ము విడువనియట్టి యాశ్రమంబున నుండి తపంబు సేయు నది; యేము నిన్ను విడిచి పోవనోపము; మమ్ము విడిచితేని యిప్పుడ ప్రాణంబులు విడుతు’ మనిన వారల నిశ్చయం బెఱింగి ‘యట్లేని నాయొద్దన యుండుం; డేను వానప్రస్థాశ్రమంబున వల్కలంబులు గట్టి, రేపును మాపును మధ్యాహ్నంబునప్పుడును స్నానంబు సేసి వేల్చుచుం గందమూలఫలాశనుండనై, పితృదేవతల వాక్సలిలవన్యఫలంబులం దనుపుచుఁ, గ్రమంబున దేహమోక్షణంబు సేయుదు’ నని యప్పుడు. 61
పృథ్వీవృత్తము. అమూల్య మణి భూషణంబులు గజాశ్వ బృందంబులున్‌
సమృద్ధ ధన ధాన్యరాసులుఁ బ్రశస్తగోవర్గముం
గ్రమంబునను భూసురేశుల కగణ్యపుణ్యార్థి యై
యమర్త్యనిభుఁ డిచ్చెఁ బాండువిభుఁ డత్యుదారస్థితిన్‌.
62
వ. మఱియుం గల వస్తువు లెల్లను ధృతరాష్ట్రున కిచ్చి పుచ్చి, మమత్వాహంకారవిముక్తుండై, ధర్మపత్ను లయ్యిరువురుఁ దనయట్ల తపస్వినులై తోడరా నుత్తరాభిముఖుండై యరిగి, నాగశైలంబును జైత్రరథంబును బారిషేణంబును హిమవంతంబునుం గడచి, సురసిద్ధసేవితం బయిన గంధమాదనంబునం గొండొక కాలం బుండి, యింద్రద్యుమ్నం బను కొలనును హంసకూటంబును నతిక్రమించి. 63
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )