ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
పాండురాజు శతశృంగంబునఁ దపోవృత్తి నుండుట (సం. 1-111-1)
మ. యతిసంఘంబుల సంగతిన్‌ దురితకర్మాపేతుఁడై యేఁగి సం
తతసిద్ధామరయక్ష సేవితసముద్యచ్ఛృంగ మై యున్న యా
శతశృంగం బను పర్వతంబున శుభాచారుండు నిత్యవ్రతో
ద్యతుఁ డై ఘోరతపంబు సేసె మునిబృందం బద్భుతం బందఁగన్‌.
64
వ. ఇట్లు శతశృంగంబున నుత్తరభాగంబునందుఁ దపంబు సేయుచు బ్రహ్మఋషి సమానుండై, దివ్యవిమానంబు లెక్కివచ్చుచుం బోవుచున్న దేవగణంబులచేత సంకీర్ణం బైన స్వర్గమార్గంబున నుత్తరాభిముఖు లై యూర్థ్వలోకంబున కనాయాసంబున నరిగెడు మునిసహస్రంబుం జూచి, ‘మీర లెందులకుఁ బోయెద’రని యడిగిన నప్పాండురాజునకు వార లి ట్లనిరి. 65
క. అమవస గావున నేఁ డ | క్కమలజుఁ గొలువఁగ మహర్షిగణములు పితృసం
ఘములును బోదురు బ్రహ్మాం | డమునం గలవార లం దొడంగూడంగన్‌.
66
వ. ‘అది కారణంబుగా నేమును బ్రహ్మలోకంబునకుం బోయెద’ మనిన నమ్మునుల పిఱుంద భార్యాద్వయసహితుండై సమవిషమప్రదేశంబులం జనుచున్న య ప్పాండురాజుం జూచి ఋషు లి ట్లనిరి. 67
క. వీర లతిలలిత మృదులా | కారలు, గిరివిషమగహనగహ్వరముల రా
నేరరు గావున నిట చను | దేరక మీ రుండుఁ డివియు దేవపథంబుల్‌.
68
క. అనిన విని నరుల కక్కడఁ | జనఁబోలమి యెఱిఁగి పాండుజనపాలకుఁ డి
ట్లనియెను ‘స్వర్గద్వారం | బనపత్యులు గాన నోపరటె మును లయ్యున్‌.’
69
వ. ‘అపుత్త్రస్య గతి ర్నాస్తి’ యను వేదవచనంబుం గలదు గావున నే నపుత్త్రకుండ నేమి సేయుదు? ననిన మునులును గరుణించి యోగదృష్టి ననాగతం బెఱింగి. ‘నీ వపుత్త్రకుండవు గావు; దైవాధిష్ఠితం బైన సంతానంబు నీకు ధర్మానిలశక్రాశ్వినులవరంబున నగు; నక్షయలోకంబులుం బడయుదువు గావున సంతానార్థంబు యత్నంబుఁ సేయు’ మనిన విని పాండురా జాత్మగతంబునఁ ‘బురుషుండు పుట్టుచుండి దేవఋషి పితృమనుష్యులఋణంబులు నాలుగింటితోడం బుట్టి యథాకాలవిధుల వానివలన విముక్తుండు గావలయు; నట్లుగాని వానికిఁ బుణ్యలోకంబులు లేవు; యజ్ఞంబులంజేసి దేవతలఋణంబును, దపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యవ్రతంబులంజేసి ఋషుల ఋణంబును, శ్రాద్ధపుత్త్రలాభంబులం జేసి పితరుల ఋణంబును, నానృశంస్యంబునం జేసి మనుష్యుల ఋణంబునుం బాపవలయు; నందుఁ బితరుల ఋణంబు దక్కఁ దక్కిన మూఁడుఋణంబులవలన విముక్తుండ నయితి. 70
తే. దేహనాశంబుతోడన తీఱు నెల్ల | ఋణములును మఱి పితరులఋణము దేహ
నాశ మయినను దీఱదు నాకు నదియ | తక్కియున్నది యే నెట్లు దానిఁ బాతు.
71
వ. అని దుఃఖించి మృగశాపంబు దలంచి, తనవలన సంతానం బయ్యెడి విధంబు లేమి యెఱింగి యొక్కనాఁ డేకాంతంబ గొంతి కి ట్లనియె. 72
ఉ. దానములం దపంబుల సదక్షిణ యజ్ఞములన్‌ విహీన సం
తానుల కూర్ధ్వలోక సుపథంబు లవశ్యము గావు; లబ్ధ సం
తానుల యెందుఁ బుణ్యు; లిది తథ్యము గావున నొండు దక్కి సం
తానము నాకు నయ్యెడువిధం బొనరింపుము ధర్మసంస్థితిన్‌.
73
క. అనపత్యుఁడ నై జీవిం | చిన, మృతిఁ బొందినను నిర్విశేషంబ; యిహం
బును బరమును నఫలమ; గా | వున సంతతి వడయు ధర్మువున ధర్మసతీ!
74
వ. ‘ఔరస క్షేత్రజ దత్తక కృత్రిమ గూఢోత్ప న్నాపవిద్ధు లను నార్వురుపుత్త్రులు బంధువులు దాయాదులు నగుదురు, కానీన సహోఢక్రీత పౌనర్భవ స్వయందత్త జ్ఞాతు లను నార్వురుపుత్త్రులు బంధువు లగుదురు గాని దాయాదులు గా; రట్టి పుత్త్రులలో నౌరసున కించుకయ తక్కువగాని తక్కటి పుత్త్రులకంటె క్షేత్రజుం డుత్కృష్టుం; డందును దేవరన్యాయ జాతుం డుత్తముం డండ్రు గావున నస్మన్నియోగంబునంజేసి ధర్మమార్గంబున క్షేత్రజులం బడసిన నేనును బుత్త్రవంతుల పుణ్యలోకంబులు వడయనేర్తు; నె ట్లనినఁ; దొల్లి గేకయరా జైన శారదండాయని పుత్త్రోత్పాదనంబునం దశక్తుం డయి తనధర్మపత్ని నీచెలియలి శ్రుతసేనం బుత్రార్థంబు నియోగించిన నది బ్రాహ్మణవచనంబునం బుణ్యస్నాతయై పుంసవనహోమంబు సేయించి ఋత్విజులవలన దుర్జయాదు లయిన కొడుకుల మువ్వురం బడసెఁ; బుత్త్రలాభంబున ననంతపుణ్యఫలం బగుట నది ధర్మ్యం బయిన యాచారం’ బనిన విని కుంతి యి ట్లనియె. 75
క. భరతకులశ్రేష్ఠుఁడ వయి | పరఁగిన నీ కేము ధర్మపత్నుల మయి యిం
కొరుల మనుష్యుల నంతః | కరణంబులఁ దలఁపఁ బొందఁగా నోపుదుమే?
76
వ. ‘భవత్ప్రసాదంబున మాయందుఁ బుత్త్రోత్పత్తి యగు నె ట్లనిన; దీని కనుగుణం బయినది యొక్క పుణ్యకథఁ దొల్లి పౌరాణికులవలన నా వినిన దానిం జెప్పెదఁ జిత్తగించి విను’ మని పాండురాజునకుఁ గుంతి యి ట్లనియె. 77
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )