ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
వ్యుషితాశ్వుండను రాజు వృత్తాంతము (సం. 1-112-7)
చ. అతుల బల ప్రతాప మహిమాధికుఁ డై వ్యుషితాశ్వుఁ డన్మహీ
పతి నయధర్మతత్పురుఁడు పౌరవవంశజుఁ డశ్వమేధముల్‌
శత మొనరించుచుండి భుజశక్తి జయించె మహీశులం బ్రవ
ర్ధితుయశుఁ డై ప్రతీచ్యుల నుదీచ్యులఁ బ్రాచ్యుల దాక్షిణాత్యులన్‌.
78
క. ఆతని యజ్ఞంబునఁ బురు | హూత పురస్సర మరుద్గణోత్తము లధిక
ప్రీతిఁ జనుదెంచి హవ్యము | లాతత హస్తములఁ గొందు రగ్నిముఖమునన్‌.
79
వ. అట్టి వ్యుషితాశ్వుండు కాక్షీవతి యైన భద్ర తన భార్యయందు ననవరత కామాసక్తిం జేసి యక్ష్మ
రుజాక్రాంతుం డయి యస్తమించిన నది పుత్త్రాలాభదుఃఖిత యయి పతివియోగంబు సహింప నోపక.
80
తే. పతియులేక జీవించు నయ్యతివ కయిన | జీవనముకంటె దానికిఁ జావ లగ్గు
కాన నీతోన చనుదెంతుఁ గాని నిన్నుఁ | బాసి యిం దుండఁగా నోప వాసవాభ!
81
వ. ‘కాదేని నాకు నీ పుణ్యమూర్తిప్రతిమూర్తులైన పుత్త్రులం బ్రసాదింపు’ మని దర్భాస్తరణశాయిని యై యాశవంబుఁ గౌఁగిలించుకొని విలాపించుచున్న దానికి వాని శరీరముననుండి యొక్క దివ్యవాణి యి ట్లనియె. 82
క. విదితముగ నీకు వర మి | చ్చెద నోడకు లెమ్ము; గుణవశీకృతభువనుల్‌
సదమలచరిత్రు లాత్మజు | లుదయింతురు వగవకుండు ముదితేందుముఖీ!
83
వ. ‘ఋతుమతి వయిన యష్టమ దివసంబుననేనిం జతుర్దశ దివసంబుననేని శుచి వై శయనంబున నుండి నన్నుఁ దలంపు’ మనిన నదియుం దద్వచనానురూపంబు సేసి మువ్వురు సాల్వులును, నల్వురు మద్రులునుంగా నేడ్వురు కొడుకులం బడసె; నది గావున ‘నీవు మాయందు దైవానుగ్రహంబున నపత్యంబు వడయు’ మనినం గుంతిం జూచి పాండురాజు ధర్మ్యం బయిన యొక్క పురాణ కథఁ జెప్పెదఁ ‘దొల్లి స్త్రీలు పురుషులచేత ననావృత లయి స్వతంత్రవృత్తి నఖిలప్రాణిసాధారణం బైన ధర్మంబునం దమతమవర్ణంబులయందు ఋతుకాలంబు దప్పక నియతానియతపురుషు లయి ప్రవర్తిల్లుచున్న, నుద్దాలకుం డను నొక్కమహామునిభార్య నతిసాధ్వి నధికతపోనిధి యైన శ్వేతకేతుతల్లి ఋతుమతి యైన దాని నొక్క వృద్ధవిప్రుం డతిథి యై వచ్చి పుత్రార్థంబు గామించిన శ్వేతకేతుం డలిగి యిది ధర్మవిరుద్ధం బని యాక్రోశించి దాని సహింపనోపక. 84
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )