ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
శ్వేతకేతుఁడు స్త్రీపురుషుల విషయంబునఁ గావించిన కట్టడి (సం. 1-113-1)
సీ. ‘ఇది యాదిగా సతు లెన్నండుఁ బరపురు | షార్థినుల్‌ గాఁ జన; దన్యపురుషు
సంగమంబునఁ జేసి సకలపాతకములు నగుఁ | బరిగ్రహభూత లయిన సతుల
కిట్టిద మర్యాద యి మ్మనుష్యుల కెల్లఁ | జేసితి లోక ప్రసిద్ధి గాఁగ ’
నని ధర్మ్యమైన మర్యాద మానవులకుఁ | దద్దయు హితముగా ధర్మమూర్తి
 
ఆ. యబ్జభవసమానుఁ డగు శ్వేతకేతుండు | నిలిపె; నదియు ధారుణీ జనంబు
నందు లోకపూజ్యమై ప్రవర్తిల్లుచు | నుండె శిష్ట సంప్రయుక్తిఁ జేసి.
85
వ. మఱియుఁ ద్యిర్యగ్యోనులయందును నుత్తరకురుదేశంబులయందును మొదలింటి ధర్మంబ యిప్పుడుం బ్రవర్తిల్లుచుండునట్లు మనుష్యులయందు శ్వేతకేతుండు సేసిన ధర్మస్థితికారణంబున నాఁటంగోలె. 86
క. పురుషులచే ధర్మస్థితిఁ | బరిగ్రహింపంగఁ బడిన భార్యలకు నిరం
తరము నిజపురుషభక్తియుఁ | బరపురుషవివర్జనంబుఁ బరిచిత మయ్యెన్‌.
87
తే. భర్తచేత నియోగింపఁ బడక సతికి | నెద్దియును జేయఁగాఁ దగ; దెద్ది యైన
భర్తచేత నియోగింపఁ బడిన దానిఁ | జేయకునికి దోషం బని చెప్పె మనువు.
88
వ. పతి నియోగించిన దానిం జేయని నాఁడు భార్యకుం బాతకం బని యెఱింగి కాదె తొల్లి సౌదాసుం డైన కల్మాషపాదుం డను రాజర్షిచేత నియుక్తయై వానిభార్య మదయంతి యనునది వసిష్ఠువలన నశ్మకుం డను పుత్త్రుం బడసె; నస్మజ్జన్మంబు నిట్టిద; మహాముని యయిన కృష్ణద్వైపాయనువలనఁ గురుకులవృద్ధిపొంటె నే ముద్భవిల్లితిమి; కావున నీ విన్నికారణంబులు విచారించి నా నియోగంబు సేయుము. 89
చ. అలయక ధర్మశాస్త్రములయందుఁ బురాణములందుఁ జెప్ప ను
త్పలదళనేత్ర! విందుమ యపత్యము మే లని; కావునన్‌ యశో
నిలయులఁ బుత్త్రులం బడయు నీ కొనరించెద సంగతాంగుళీ
దళవిలసన్మదీయకరతామరసద్వయయోజితాంజలిన్‌.
90
వ. అని పుత్త్రముఖావలోకనలోలత్వంబున దీనవదనుం డై దేవిం బ్రార్థించినఁ గుంతియుం బుత్రోత్పాదనోన్ముఖి యై కుంతిభోజునింటఁ దనకొండుకనాఁడు దుర్వాసునిచేతం బడసిన మంత్రంబుతెఱంగు పతి కెఱింగించి ‘యమ్మంత్రంబున కిది యవసరం బయ్యె; నేవేల్పు నారాధింతు? నాన తి’ మ్మనిన సంతసిల్లి కుంతీదేవికిం బాండురా జి ట్లనియె. 91
క. లలితాంగి! యెల్లలోకం | బులు ధర్మువునంద నిలుచుఁ; బొలుపుగ ధర్ముం
దలఁపుమ; యాతఁడ మఱి వే | ల్పులలోపలఁ బెద్ద ధర్మమున సత్యమునన్‌.
92
వ. అని నియోగించినఁ, గుంతియుం బతికిఁ బ్రదక్షిణంబుఁ జేసి సమాహితచిత్త యై మహాముని యిచ్చిన మంత్రంబు విధివంతంబుఁ జేసి ధర్ముని నారాధించిన, నా ధర్ముండును యోగమూర్తి ధరుం డై వచ్చి, వరం బిచ్చినం, గుంతియుఁ దత్ప్రసాదంబున గర్భంబు దాల్చి, సంవత్సరంబు పరిపూర్ణం బైన. 93
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )