ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
గాంధారి యుదరతాడనంబు గావించుకొనుట (సం. 1-107-8)
వ. ఇట్లు పుత్త్రోదయంబునఁ బరమహర్ష సంపూర్ణ హృదయుం డై పాండురాజు కుంతీ మాద్రీ సహితుండై శతశృంగంబున నుండునంత, నట ముందఱ ధృతరాష్ట్రువలనన్‌ గాంధారి కృష్ణద్వైపాయనువరంబున గర్భంబు దాల్చి, యొక్క సంవత్సరంబు నిండినఁ బ్రసూతి కాకున్నం బదరుచుఁ బుత్త్రలాభలాలస యయి యున్న యది యప్పు డయ్యుధిష్ఠిరు జన్మంబు విని మనస్తాపంబున నుదరతాడనంబుఁ జేసికొనిన, గర్భపాతం బగుడును. 98
క. దాని నెఱింగి పరాశర | సూనుఁడు చనుదెంచి సుబలసుతఁ జూచి ‘మనో
హీన వయి గర్భపాతము | గా నిట్టులు సేయు టిదియుఁ గర్తవ్యం బే.’
99
క. ఇమ్మాంసపేశి నేకశ | త మ్ముదయింతురు సుతులు ముదమ్మున; నిది త
థ్య; మ్మింక నైన నతియ | త్నమ్మున రక్షింపు దీని నా వచనమునన్‌.
100
వ. అని గాంధారిం బదరి తొల్లివేదంబులు విభాగించిన మహానుభావుం డమ్మాంసపేశి నేకోత్తరశతఖండంబులుగా విభాగించి, ‘వీని వేఱు వేఱ ఘృత కుండలంబులం బెట్టి, శీతలజలంబులం దడుపుచు నుండునది; యిందు నూర్వురు గొడుకులు నొక్క కూతురుం బుట్టుదు’రని చెప్పి చనినఁ, దద్వచనప్రకారంబు చేయించి, గాంధారీ ధృతరాష్ట్రులు సంతసిల్లియున్న; నిట శతశృంగంబున. 101
చ. నిరుపమకీర్తి పాండుధరణీపతి వెండియుఁ గుంతిఁ జూచి ‘యం
బురుహదళాక్షి! యింక నొకపుత్త్త్రు నుదారచరిత్రు నుత్తమ
స్థిరజవసత్త్వు నయ్యనిలదేవుదయం జనియింపు పెంపుతోఁ;
గురుకులరక్షకుం డతఁ డగున్‌ బలవద్భుజవిక్రమోన్నతిన్‌.
102
వ. అని పనిచిన నెప్పటియట్ల కుంతీదేవి వాయుదేవు నారాధించి తత్ప్రసాదంబున గర్భంబు దాల్చి, సంవత్సరంబు సంపూర్ణం బగుడును. 103
చ. సుతుఁడు నభస్వదంశమున సుస్థిరుఁ డై యుదయించినన్‌ మహా
యతికృత జాతకర్ముఁ డగు నాతని కాతతవీర్యవిక్రమో
న్నతునకు భీమసేనుఁ డను నామముఁ దా నొనరించె దివ్యవా
క్సతి శతశృంగశైల నివసన్మునిసంఘము సంతసిల్లఁగన్‌.
104
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )