ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
దుర్యోధనాదుల జననము (సం. 1-107-24)
క. అనిలజు పుట్టిన దివసము | నన యట దుర్యోధనుండు నరనుత! ధృతరా
ష్ట్రునకున్‌ గాంధారికి న | గ్ర నందనుఁడు ఘనుఁడు పుట్టెఁ గలియంశమునన్‌.
105
శా. ఆదుర్యోధనుఁ డుద్భవిల్లుడును గ్రవ్యాదారవంబుల్‌ శివా
నాదంబుల్‌ మదఘూకఘూంకృతులు నానారాసభధ్వానముల్‌
భూదిక్కంపముగాఁ జెలంగె విగతాంభోభృన్నభోవీథియం
దాదిత్యద్యుతి మాయఁగాఁ గురిసె నుగ్రాసృఙ్మహావర్షముల్‌.
106
వ. మఱియు దుర్యోధనజన్మానంతరంబున ధృతరాష్ట్రునకు వైశ్యాపుత్త్రుం డయిన యుయుత్సుండు పుట్టె; నంత గాంధారికి నొక్కొక్కదివసంబున నొక్కొక్కరుండుగాఁ గ్రమంబున దుశ్శాసన దుస్సహ దుశ్శల జలసంధ సమ సహ విందానువింద దుర్ధర్ష సుబాహు దుష్ప్రధర్షణ దుర్మర్షణ దుర్ముఖ దుష్కర్ణ కర్ణ వివింశతి వికర్ణ శల సత్త్వ సులోచన చిత్రోపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర శరాసన దుర్మద దుర్విగాహ వివిత్సు వికటాన నోర్ణనాభ సునాభ నందోపనందక చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్విమోచనాయోబాహు మహాబాహు చిత్రాంగ చిత్రకుండల భీమవేగ భీమబల బలాకి బలవర్ధ నోగ్రాయుధ సుషేణ కుండధార మహోదర చిత్రాయుధ నిషంగి పాశి బృందారక దృఢవర్మ దృఢక్షత్త్ర సోమకీ ర్త్యనూదర దృఢసంధ జరాసంధ సద సువా గుగ్రశ్రవ ఉగ్రసేన సేనానీ దుష్పరాజ యాపరాజిత కుండశాయి విశాలాక్ష దురాధర దుర్జయ దృఢహస్త సుహస్త వాతవేగ సువర్చ ఆదిత్యకేతు బహ్వాశి నాగదత్తాగ్రయాయి కవచి క్రధన కుండి ధనుర్ధ రోగ్ర భీమరథ వీరబాహ్వ లోలు పాభయ రౌద్రకర్మ ధృడరథాశ్ర యానాధృష్య కుండభేది విరావి ప్రమథ ప్రమాథి దీర్ఘరోమ దీర్ఘబాహు వ్యూఢోరు కనకధ్వజ కుండాశి విరజసు లనంగా నూర్వురు గొడుకులు పుట్టిన. 107
తే. ఆ తనూజుల కందఱ కనుజ యై ల | తాంగి దుశ్శల యను కూఁతు రమరఁ బుట్టె;
నందు దౌహిత్రవంతుల దైన్య పుణ్య | గతియుఁ గాంతు నే నని పొంగెఁ గౌరవుండు.
108
వ. ఇట్లేకోత్తరశతపుత్త్రులం బడసి కృతార్థుండై యున్న ధృతరాష్ట్రుకడకు భీష్మవిదురాది బంధుజనంబులుఁ బురోహితప్రముఖ బ్రాహ్మణవరులును వచ్చి యొక్కనాఁ డేకాంతంబున ని ట్లనిరి. 109
క. మన దుర్యోధను జన్మం | బునఁ బెక్కులు దుర్నిమిత్తములు పుట్టె; జగ
జ్జనసంక్షయజననుం డగు | నని పలికెద రెఱుక గల మహాత్ములు వానిన్‌.
110
క. కులమునకు నఖిలలోకం | బులకు నపాయంబు సేయు పురుషాధము ని
మ్ముల దూషించి జగంబును | గులమును రక్షించు టుఱదె కువలయనాథా!
111
వ. ‘కావున నిప్పుడ దుర్యోధను దూషింతము; నీకు వెండియుఁ బుత్త్రశతంబు సంపూర్ణంబయి పెరుఁగుచున్నయది’ యనిన ధృతరా ష్ట్రుండు పుత్త్రమోహంబున నప్పలుకులు విన నొల్లకుండె; నంత నట శతశృంగంబునఁ గుంతీదేవి భీమసేను సుపుత్త్రుం బడసి, దశమదివసంబున వేల్పులకు మ్రొక్కఁ గొడుకు నెత్తుకొని దేవగృహంబునకుఁ బోవునెడ నతివిషమగహనగిరిగహ్వరంబుననుండి యొక్కపులి వెలువడి యామిషార్థి యయి పయికి లంఘించిన. 112
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )