ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
ఇంద్రప్రసాదంబునఁ గుంతి కర్జునుఁ డుదయించుట (సం. 1-114-15)
క. కొడుకుం ద్రిలోక విజయుం | బడయుదు నని ఘోర మగు తపం బొనరింపం
దొడఁగె సురరాజు నెడలో | నిడికొని యేకాగ్రబుద్ధి నేకాంతమునన్‌.
116
వ. ఇ ట్లతి నిష్ఠ నేకపాద స్థితుం డయి తపంబు సేయుచుఁ గుంతి నొక్క సంవత్సరంబు వ్రతంబు సేయం బంచియున్న నప్పాండురాజున కింద్రుండు ప్రత్యక్షం బై. 117
క. ‘పుత్త్రుఁడు నీ కుదయించు న | మిత్త్రక్షయకరుఁడు బంధుమిత్త్రాంబుజ స
న్మిత్త్రుం’ డని వర మిచ్చిన | ధాత్త్రీపతి పొంగి పృథకుఁ దా ని ట్లనియెన్‌.
118
క. ధనమున విద్యను సంతతిఁ | దనిసిన వా రెందుఁ గలరె? ధవళేక్షణ! కా
వున నా కింకను బలువురఁ | దనయులఁ బడయంగ వలయు ధర్మువు పేర్మిన్‌.
119
చ. అమరగణంబులోనఁ బరమార్థమ యింద్రుఁడు పెద్ద, సర్వలో
కములకు వల్లభుం డతఁడ కావున నయ్యమరాధిపప్రసా
దమున సుతున్‌ సురేంద్రసము ధర్మసమన్వితు నస్మదీయవం
శము వెలుఁగింపఁగాఁ బడయు సర్వజగత్పరిరక్షణక్షమున్‌.
120
వ. అని నియోగించినఁ గుంతియుఁ దొల్లిటి యట్ల దుర్వాసుం డిచ్చిన మంత్రంబున నింద్రు నారాధించినఁ, దత్ప్రసాదంబునఁ గుంతికి. 121
క. స్థిరపౌరుషుండు లోకో | త్తరుఁ డుత్తరఫల్గునీప్రథమపాదమునన్‌
సురరాజునంశమున భా | సురతేజుఁడు వంశకరుఁడు సుతుఁ డుదయించెన్‌.
122
సీ. ‘విను కార్తవీర్యుకంటెను వీరుఁ డగుట న | ర్జుననామ మీతండ యొనరఁ దాల్చు;
నీతండ యనిఁ బురుహూతాదిసురుల నో | డించి ఖాండవము దహించు బలిమి;
నీతండ నిఖిలావనీతలేశుల నోర్చి | రాజసూయము ధర్మరాజు నునుచు;
నీతండ వేల్పులచేత దివ్యాస్త్రముల్‌ | వడసి విరోధుల నొడుచుఁ గడిమి’
 
ఆ. ననుచు నవపయోదనినదగంభీర మై | నెగసె దివ్యవాణి గగనవీథిఁ,
గురిసెఁ బుష్పవృష్టి, సురదుందుభిధ్వనుల్‌ | సెలఁగె సకలభువనవలయ మద్రువ.
124
వ. మఱియు మరీచ్యాది ప్రజాపతులును, ధాత్రాది ద్వాదశాదిత్యులును, మృగవ్యాధాది రుద్రులును, ధరాది వసువులును, భరద్వాజాది మహర్షులును, భీమసేనాది గంధర్వులును, శేషాది మహానాగముఖ్యులును, వైనతేయాది ఖచరులును, మేనకాద్యప్సరసలును, నాశ్వినులును, విశ్వేదేవతలును, మఱియు స్వర్గంబున నున్నరాజులుం జను దెంచిన. 125
క. శతశృంగనగేంద్రము శత | ధృతి సర్గదినంబపోలెఁ ద్రిభువనభూత
ప్రతతిఁ బరిపూర్ణశోభా | ధృతి నింద్రతనూజుజన్మదినమున నొప్పెన్‌.
126
మాలిని. సరససురవధూలాస్యంబులున్‌ సిద్ధవిద్యా
ధరపటుపటహాతోద్యంబులుం గిన్నరీ కిం
పురుష లలితగీతంబుల్‌ మహారమ్య మయ్యెన్‌
వరముని దివిజాశీర్వాదనాదంబుతోడన్‌.
127
వ. పాండురాజును బరమోత్సవంబునం గుంతివలనఁ బురుషత్రయసమానం బయిన పుత్త్రత్రయంబు వడసి భువనత్రయరాజ్యంబు వడసినంతియ సంతసిల్లి, కుమారులతోడి వినోదంబులం దగిలి యున్నంత; మాద్రి దనయందుఁ బుత్త్రజన్మంబు వడయు నుపాయంబు లేమికి దుఃఖించి యాత్మగతంబున. 128
ఉ. కోరిన కోర్కికిం దగఁగఁ గుంతి సుతత్రయంబుఁ గాంచె; గాం
ధారియు నక్కడన్‌ సుతశతంబు ముదం బొనరంగఁ గాంచె; నేఁ
బోరచి యాఁడుఁబుట్టువునఁ బుట్టి నిరర్థకజీవ నైతి సం
సారసుఖావహం బయిన సత్సుతజన్మముఁ గానఁ బోలమిన్‌.
129
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )