ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
మాద్రికి నకులసహదేవులు పుట్టుట (సం. 1-115-1)
వ. అని వగచుచు నొక్కనాఁ డేకాంతంబునం బతియొద్ద గద్గద వచన యై తన మనోవాంఛితంబుఁ జెప్పి ‘కుంతీదేవి యనుగ్రహంబుం బడయ నగునేని కొడుకులం బడయుదు; నట్లయిన నాకును నీకును లోకంబులకును హితం బగుఁ గావున నాకుఁ బుత్త్రోత్పాదనంబు దయసేయం గుంతీదేవికి నానతి యి’ మ్మనిన మాద్రికిఁ బాండురా జి ట్లనియె. 130
క. నా వచనమున నపత్యముఁ | గావించును గుంతి నీకుఁ గడు నెయ్యముతో;
నీ వగచిన యీ యర్థమ | చూవె మనంబునఁ దలంచుచుండుదు నేనున్‌.
131
వ. అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద్రరాజపుత్త్రి దయిన మనోవాంఛితంబుఁ జెప్పి ‘సకలలోక కల్యాణ కారు లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు వడయు’ మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసిన మాద్రికి. 132
తే. కవలవారు సూర్యేందుప్రకాశతేజు లా | శ్వినులయంశములఁ బుట్టి రమరగుణులు
వారలకుఁ బ్రీతి నాకాశవాణి సేసె | నకుల సహదేవు లనియెడు నామయుగము.
133
క. ఊర్జితులు యుధిష్ఠిర భీ | మార్జున నకుల సహదేవు లన నిట్లు వివే
కార్జితయశు లుదయించిరి | నిర్జరుల వరప్రసాదనిర్మితశక్తిన్‌.
134
వ. అంత నట. 135
సీ. మృగ శాప భయమున జగతీశుఁ డప్పాండు | పతి శతశృంగపర్వతమునందుఁ
బత్నీసమేతుఁడై యత్నంబుతో ఘోర | తప మొనరించుచు విపులశక్తి
నమరవరప్రసాదమున ధర్మస్థితిఁ | గొడుకుల నేవురఁ బడసె ననియు
విని వసుదేవుండు మనమున హర్షించి | యనుజను మఱఁదిని ఘనుఁడు చూడఁ
 
తే. దనపురోహితుఁ గశ్యపుం డను మహాత్ముఁ | జీరి పుత్తెంచె నవ్విప్రుచేత భాగి
నేయు లగు కుమారులకు నమేయరత్న | భూషణావళు లిచ్చి విశేషలీల.
136
వ. అ క్కశ్యపుండును జనుదెంచి పృథామాద్రీ సహితుం డయి యున్న యప్పాండురాజుం గని వసుదేవు సందేశంబుఁ జెప్పి యక్కుమారులకు రత్నభూషణాంబరంబు లిచ్చి, క్రమంబునఁ జౌలోపనయనంబు లొనరించి, వేదాధ్యయనంబు సేయించుచున్నంత వసంతసమయం బఖిలజీవలోకానందజననం బై యేర్పడం జనుదెంచిన. 137
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )