ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
పాండురాజుమరణము (సం. 1-116-4)
వ. ఇట్లు సర్వభూతసమ్మోహనంబయిన వసంతసమయంబునం బాండురాజు మదనసమ్మోహనమార్గణబందీకృత మానసుం డై మద్రరాజపుత్త్రి దైన మనోహరాకృతియందు మనంబు నిలిపి యున్నంత; నొక్కనాఁడు కుంతీదేవి బ్రాహ్మణభోజనంబు సేయించుచుండి మాద్రీరక్షణంబునం దేమఱియున్న యవసరంబున. 140
ఉ. చారుసువర్ణహాసినవచంపకభూషయు సిందువారము
క్తా రమణీయయున్‌ వకుళదామవతంసయు నై యపూర్వ శృం
గారవిలాసలీల యెసఁగం దనముందట నున్న మాద్రి నం
భోరుహనేత్రఁ జూచి కురుపుంగవుఁ డంగజరాగమత్తుఁ డై.
141
క. కిందముశాపము డెందము | నం దలఁపక శాపభయమునన్‌ మాద్రి గడున్‌
వందురి వారింపఁగ బలి | మిం దత్సంభోగసుఖసమీహితుఁ డయ్యెన్‌.
142
వ. దానం జేసి విగతజీవుం డైన యప్పాండురాజుం గౌఁగిలించుకొని మాద్రి యఱచుచున్న, దాని యాక్రందన ధ్వని విని వెఱచి కుంతీదేవి గొడుకులుం దానునుం బఱతెంచి పతియడుగులపయిం బడి యేడ్చుచున్న నెఱింగి, శతశృంగ నివాసులగు మునులెల్లం దెరలివచ్చి చూచి శోకవిస్మయాకులితచిత్తు లయి; రంతఁ గుంతీదేవి మాద్రి కి ట్లనియె. 143
ఉ. ‘నా కెడ యిమ్ము, లెమ్ము, కురునాథుమనఃప్రియధర్మపత్ని నే
నేకత మెట్టు లుండుదు? మహీపతితోడన పోదుఁ; బుత్త్రులం
జేకొని పెన్పు; నా పసుపుఁ జేయుము’ నావుడు మాద్రి దద్దయున్‌
శోకపరీతచిత్త యగుచుం బృథ కి ట్లనియెం బ్రియంబునన్‌.
144
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )