ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
మునులు పాండవులను హస్తినాపురంబునకుం గొనివచ్చి ధృతరాష్ట్రున కొప్పగించుట (సం. 1-117-6)
వ. అని తమలో విచారించి, కుంతీదేవిని గుమారులం దోడ్కొని మునులెల్ల హస్తిపురంబునకు వచ్చి రంత. 149
చ. ‘సురల వరప్రసాదమునఁ జూవె సుపుత్త్రులఁ బాండురాజు భా
సురముగఁ గాంచెఁ; దత్సుతులఁ జూతము రం’ డని పౌరు లెల్ల నొం
డొరులకుఁ జెప్పుచుం దెరలి యొండొరులం గడవంగ వచ్చి చూ
చిరి భుజవిక్రమాధరిత సింహకిశోరులఁ బాండవేయులన్‌.
150
ఉ. ‘వీరలు దైవశక్తిఁ బ్రభవించిన వా రగు టేమి సందియం?
బీరమణీయకాంతి నుపమింపఁగ వేల్పుల కారె? యిట్టి యా
కారవిశేషసంపదఁ బ్రకాశితతేజముపేర్మిఁ జూడ సా
ధారణమర్త్యులే!’ యని ముదంబునఁ బౌరులు దమ్ముఁ జూడఁగన్‌.
151
వ. ముని సహస్ర పరివృతులయి జననీ సహితంబు పాండురాజ కుమారులు రాజమార్గంబు దఱియవచ్చి రాజమందిర ద్వారాసన్ను లగునంత, మంత్రి పురోహిత బ్రాహ్మణ నివహంబులు దుర్యోధన దుశ్శాసన ప్రముఖ ధార్తరాష్ట్రశతంబును నెదురు వచ్చి పాండవులం దోడ్కొని తెచ్చిన, భీష్మ విదుర ధృతరాష్ట్ర సత్యవత్యం బికాంబాలికలు మొదలుగా నమ్మునులకు నమస్కరించి; రంతం దమకు మ్రొక్కిన కుమారుల నతిస్నేహంబున నెత్తికొని. కుంతిని బ్రియపూర్వకంబున సంభావించి, పాండురాజవియోగదుఃఖితు లయి మహాశోకంబునం దేలుచున్న విదుర ధృతరాష్ట్రుల గాంధారీ సహితం బూరార్చి, యమ్మునులయం దొక్కవృద్ధతపస్వి ముని సహస్రానుమతంబున ని ట్లనియె. 152
ఉ. భానునిభుండు పాండుజనపాలుఁడు ఘోరతపంబు సేసి ధ
ర్మానిలవాసవాశ్వినుల దైనవరంబున శక్మిపేర్మితో
నీ నరనాథనందనుల నేవుర వంశవివృద్ధిపొంటెఁ బం
చాననసత్త్వులం బడసె నాశతశృంగమహానగంబునన్‌.
153
క. త్రిదశాధినాథసదృశుఁడు | ద్రిదశాలయమునకు మాద్రిదేవియుఁ దానున్‌
ముదమొనర నరిగె నేఁటికిఁ | బదియేడగునాఁడు దురితబంధచ్యుతుఁ డై.
154
క. కమనీయలీల నొక్కట | నమరపురంబునకుఁ జనిన యయ్యిరువుర యం
గము లివి; పితృమేధవిధి | క్రమ మొనరఁగ సంస్కరింపఁ గడఁగుఁడు వీనిన్‌.
155
వ. ‘ ఈ దేవియును బతితోడన పోవ సమకట్టినం బుత్త్రరక్షణార్థంబు మునిగణ ప్రార్థిత యై యెట్టకేనియు ధృతప్రాణ యయ్యె; నిక్కుమారులు కురుకులవిస్తారకులు, దేవమూర్తులు. యుధిష్ఠిరభీమార్జున నకులసహదేవు లనంగా దేవాధిష్ఠితనామంబులు దాల్చి, బ్రహ్మర్షి ప్రణీతోపనయను లై శ్రుతాధ్యయన సంపన్ను లగుచుఁ బెరుఁగుచున్నవారు వీరలం జేకొని కురువృద్ధులు ధర్మబుద్ధి రక్షించునది’ యని చెప్పి సిద్ధచారణగణంబులతో నమ్మహామును లంతర్ధానంబు సేసి; రంత వ్యాస భీష్మ ధృతరాష్ట్రుల యనుమతంబున. 156
సీ. వెలయంగఁ బితృమేధవిధి విచక్షణశీల | సద్భూసురోపదేశక్రమమున
నధికవిభూతితో నతిపవిత్రదే | శమున నయ్యంగముల్‌ సంస్కరించి,
పుణ్యస్వధామృతంబుల నొప్పఁగా | శ్రాద్ధవిధి యొనరించి, సద్విప్రతతికి
నగ్రహారములు దివ్యాంబరాభరణ శ | య్యాసనచ్ఛత్త్రగవాశ్వకరుల
 
ఆ. నిచ్చి, సర్వజనుల కెల్లను భోజన | దాన మొనరఁ జేసి, ధర్మవిదుఁడు
విదురుఁ డట్లు పాండువిభునకుఁ జేయించె | నన్యలోకహితంబు లైన విధులు.
157
వ. అంతఁ గృష్ణద్వైపాయనుండు వారి కందఱకు దుఃఖోపశమనంబుసేసి, యొక్కనాఁడు సత్యవతికి నేకాంతంబున ని ట్లనియె. 158
క. మతిఁ దలఁపఁగ సంసారం | బతి చంచల మెండమావులట్టుల సంప
త్ప్రతతు లతిక్షణికంబులు; | గతకాలము మేలు వచ్చుకాలముకంటెన్‌.
159
క. క్రూరులు విలుప్త ధర్మా | చారులు ధృతరాష్ట్రసుతు లసద్‌వృత్తులు ని
ష్కారణవైరులు వీరల | కారణమున నెగ్గు పుట్టుఁ గౌరవ్యులకున్‌.
160
వ. ‘దాని ధృతరాష్ట్రుండు తాన యనుభవించుంగాని మీ రీ దారుణంబుఁ జూడక వీరి విడిచి తపోవనంబున కరుగుం’ డని చెప్పి చనిన సత్యవతియుఁ బారాశర్యునుపదేశంబు భీష్మవిదురుల కెఱింగించి కోడండ్ర నంబికాంబాలికలం దోడ్కొని వనంబునకుం జని, తానును వారు నతిఘోరతపంబు సేసి కొండొక కాలమునకు శరీరంబులు విడిచి పుణ్యగతికిం బోయి; రిట ధృతరాష్ట్రుండును. 161
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )