ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
కురుపాండుకుమారుల బాలక్రీడలు (సం. 1-119-13)
క. తన సుతులు పాండు సుతు లని | మనమున భేదింప కతిసమంజసభావం
బున నొక్క రూపకాఁ జే | కొని యుండెం బాండురాజుకొడుకులఁ బ్రీతిన్‌.
162
క. ధృతరాష్ట్రునెయ్యమున సం | తతవర్ధితు లగుచుఁ బాండుతనయులు వినయా
న్వితులు కుమారక్రీడా | రతు లయి యొడఁగూడి ధార్తరాష్ట్రులతోడన్‌.
163
క. గిఱుపునెడ నేయునెడ వడిఁ | బఱచునెడం బెనఁగునెడ నపార బలంబుల్‌
మెఱయునెడ భీమునకు నం | దొఱుఁ గీడ్పడఁ దొడఁగి రుద్ధతులు రాజసుతుల్‌.
164
క. వదలక పెనఁగి పదుండ్రం | బదియేవుర నొక్కపెట్ట పట్టి ధరిత్రి
జెదరఁ బడవైచి పవనజుఁ | డదయుండయి వీఁపు లొలియ నందఱ నీడ్చున్‌.
165
సీ. కూడి జలక్రీడ లాడుచోఁ గడఁగి యా | ధృతరాష్ట్రతనయుల నతులశక్తి
లెక్కించియుఁ బదుండ్ర నొక్కొక్క భుజమున | నెక్కించుకొని, వారి యుక్కడంగఁ
గ్రంచఱ నీరిలో ముంచుచు నెత్తుచుఁ | గారించి తీరంబు చేరఁ బెట్టుఁ;
గోరి ఫలార్థు లై వారల యెక్కిన | మ్రాఁకుల మొదళుల వీఁకఁ బట్టి
 
ఆ. వడిఁ గదల్చుఁ బండ్లు దడఁబడువారల | తోన ధరణిమీఁదఁ దొరఁగుచుండ;
నిట్టిపాట గాడ్పుపట్టిచే దుశ్శాస | నాదు లెల్ల బాధితాత్ము లైరి.
166
వ. దాని సహింపనోపక యొక్కనాఁడు దుర్యోధనుండు శకుని దుశ్శాసనాదులతో విచారించి యి ట్లనియె. 167
పృథ్వీవృత్తము. ఉపాంశువధఁ జేసి మధ్యము మదోద్ధతుం జంపి ని
స్సపత్నముగ ధర్మనందను నశక్తు బంధించి యే
నపాండవముగా సముద్రవలయాఖిలక్షోణి మ
త్కృపాణపటుశక్తి నత్యధికకీర్తి నై యేలెదన్‌.
168
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )