ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
దుర్యోధనుఁడు భీమునిఁ జంపింపఁ దివురుట (సం. 1-119-28)
వ. అని పాపబుద్ధియందుఁ గృతనిశ్చయుం డై దుర్యోధనుండు భీష్మ విదురు లెఱుంగకుండ భీమున కపాయంబు సేయ సమకట్టి, యంతరం బన్వేషించుచున్నంత నొక్కనాఁడు జలక్రీడావసరంబున. 169
ఉ. వేడుక నొక్కరుండు శతవీరకుమారులతోడఁ జల్లుఁ బో
రాడి జయించి యందఱ, ననంతపరిశ్రమపారవశ్యముం
గూడి ప్రమాణకోటి ననఘుండు సమీరణనందనుండు మే
యాడక నిద్రవోయె శిశిరానిలముల్‌ పయి వీచుచుండఁగన్‌.
170
క. ఆ పవనజు నతిఘనలతి | కాపాశావలుల నంటఁ గట్టించి మహా
కోపమున గంగమడువునఁ | ద్రోపించె సుయోధనుండు దురితకరుం డై.
171
క. అనిలసుతుం డంతన మే | ల్కని నీల్గుడు నతని వజ్రఘనకాయముఁ బొం
దినలతికాపాశము లె | ల్లను ద్రెస్సె మృణాళనాళలతికలపోలెన్‌.
172
ఆ. కర్మబంధనములు గ్రక్కునఁ బాయుడుఁ | బుణ్యగతికి నెగయు పురుషు నట్లు
బంధనంబు లెల్లఁ బాయుడు భీముండు | నీరిలోననుండి నెగయుదెంచె.
173
వ. మఱియు నొక్కనాఁడు. 174
క. జనపతి పనుపఁగ సారథి | ఘనవిషకృష్ణోరగములఁ గఱపించె శ్రమం
బున నిద్రితుఁ డైన ప్రభం | జనసుతుసర్వాంగమర్మసంధుల నెల్లన్‌.
175
క. అవిరళవిషఫణిదంష్ట్రలు | పవనజువజ్రమయతనువుపయితోలును నో
పవ భేదింపఁగఁ; బాప | వ్యవసాయులచెయ్వు లర్థవంతము లగునే?
176
చ. అలఘుబలుండు భీముఁడును నంతన మేల్కని యవ్విషోరగం
బులఁ జరణంబులం జమరి, ముక్కన వాతను నెత్తు రొల్కగాఁ
దలరఁగ సారథిం జఱచెఁ దా నపహస్తమునన్‌, వసుంధరా
తలమునఁ ద్రెళ్ళె సారథియుఁ దత్‌క్షణమాత్రన ముక్తజీవుఁ డై.
177
క. మఱియును నొకనాఁ డెవ్వరు | నెఱుఁగక యుండంగఁ గౌరవేంద్రుఁడు ధర్మం
బెఱుఁగక విష మన్నముతో | గుఱుకొని పెట్టించె గాడ్పుకొడుకున కలుకన్‌.
178
క. సముఁ డై యుయుత్సుఁ డయ్య | న్నము దుష్టం బగుటఁ జెప్పినను గుడిచె విషా
న్నము నాఁకటిపెలుచను; నది | యమృతాన్నం బయ్యె జీర్ణ మై మారుతికిన్‌.
179
వ. ఇట్లు దుర్యోధనుండు భీమునకుఁ దనచేసిన యెగ్గు లెల్లను గృతఘ్నునకుం జేసిన లగ్గులునుంబోలె నిష ల్ఫంబు లైన సిగ్గువడి, వెండియుఁ బాండవుల కెల్ల నపాయంబు సేయ నుపాయంబుఁ జింతించుచుండె; నంత భీష్మ నియోగంబున. 180
క. విలువిద్యఁ గఱచుచుండిరి | బలయుతులు కుమారకులు కృపద్రోణాచా
ర్యులతోడఁ గలసి యొక్కట | నలఘుపరాక్రమసమేతు లధికస్పర్ధన్‌.
181
వ. అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 182
తే. కృపుఁడు ద్రోణుండు ననఁగ సత్కీర్తులైన | వారిజన్మప్రకారంబు, వారు వచ్చి
కౌరవులకెల్ల గురు లైన కారణంబు | విప్రముఖ్య! నా కెఱుఁగంగ విస్తరింపు.
183
వ. అని యడిగిన వైశంపాయనుం డి ట్లనియె. 184
సీ. విన వయ్య! గౌతముం డనఁ బ్రసిద్ధుం డైన | మునికి శరద్వంతుఁ డను మహాత్ముఁ
డురుతరతేజుఁ డై శరసమూహంబుతో | నుదయించి, వేదముల్‌ చదువ నొల్ల
కతిఘోరతపమున నుతభూసురోత్తముల్‌ | వేదముల్‌ చదువున ట్లాదరమున
సర్వాస్త్రవిదుఁడు ధనుర్వేద మొప్పఁగఁ | బడసి, మహానిష్ఠఁ గడఁగి తపము
 
ఆ. సేయుచున్న దివిజనాయకుఁ డతిభీతి | నెఱిఁగి, వానితపముఁ జెఱుపఁ బనిచె
జలజనయనఁ దరుణి జలపద యనియెడు | దాని; నదియు వచ్చె వానికడకు.
185
క. అమ్ముదితఁ జూచి కాముశ | రమ్ములచే విద్ధుఁ డై శరద్వంతుఁడు చి
త్త మ్మలర మదనరాగర | సమ్మునఁ ద న్నెఱుఁగకుండెఁ జంచలతనుఁ డై.
186
క. ఆ తరుణికటాక్షేక్షణ | పాతము గౌతమున కపుడు పటుబాణధనుః
పాతముతోడన రేతః | పాతము గావించె రాగపరవశుఁ డగుటన్‌.
187
వ. దాని నెఱింగి శరద్వంతుం డయ్యాశ్రమంబు విడిచి చని యొండుచోటం దపంబు సేయుచుండె; నవ్వీర్యం బొక్క శరస్తంబంబున ద్వివిధం బయి పడిన, నందొక కొడుకునుం గూఁతురుం బుట్టి; రంత శంతనుండు మృగయా వినోదార్థం బరిగిన వానిసేనాచరుం డా శరస్తంబంబున నున్న కొడుకుం గూఁతుఁ దత్సమీపంబున నున్న శరచాప కృష్ణాజినంబులుం జూచి, యివి యెయ్యేనియు నొక్కధనుర్వేదవిదుం డయిన బ్రాహ్మణునపత్యం బగు నని శంతనునకుం జూపిన, శంతనుండును వారలఁ జేకొని కృపాయత్తచిత్తుం డయి పెనుచుటం జేసి యయ్యిరువురుఁ గృపుఁడును గృపియు ననం బెరుఁగుచున్నంత. 188
క. చనుదెంచి శరద్వంతుం | డనవద్యుఁడు దనయపత్య మని వారిని శం
తనున కెఱిఁగించి కృపు న | త్యనుపము నుపనీతుఁ జేసె నధికప్రీతిన్‌.
189
శా. వేదంబుల్‌ చదివించె భూసురులతో విఖ్యాతిగా, నాత్మసం
వేదిం జేసెఁ, జతుర్విధం బగు ధనుర్వేదంబు నానాస్త్రవి
ద్యాదాక్షిణ్యముతోడఁ దాన కఱపెం, దద్విత్తముల్‌ సూచి సం
వాదుల్‌గాఁ దననందనుం గృపు శరద్వంతుండు దాంతాత్ముఁ డై.
190
వ. అట్టి కృపాచార్యు రావించి భీష్ముం డతిభక్తిం బూజించి వానితోడఁ దన మనుమల నందఱ విలువిద్య గఱవం బంచిన. 191
క. సవిశేషముగ ధనుర్వే | దవిశారదు లైరి కడు జితశ్రములై పాం
డవ ధృతరాష్ట్రాత్మజ యా | దవు లాదిగ రాజసుతులు తత్‌కృపుశిక్షన్‌.
192
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )