ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
ద్రోణాచార్యుల జన్మవృత్తాంతము (సం. 1-121-3)
వ. ‘మఱియు వారల కాచార్యుం డైన ద్రోణుజన్మంబును వానిచరిత్రంబును జెప్పెద విను’ మని జనమేజయునకు వైశంపాయనుం డి ట్లనియె. 193
క. సద్వినుతచరిత్రుండు భ | రద్వాజుం డను మునీశ్వరప్రవరుఁడు గం
గాద్వారమునఁ దపంబు జ | గద్వంద్యుఁడు సేయుచుండె గతకల్మషుఁ డై.
194
సీ. అమ్ముని యొక్కనాఁ డభిషేచనార్థంబు | గంగకుఁ జని, మున్న కరము లీల
నందు జలక్రీడ లాడుచునున్న య | ప్సరస ఘృతాచి యన్సదమలాంగి
పటుపవనాపేత పరిధాన యైన య | య్యవసరంబునఁ జూచి, యమ్మృగాక్షిఁ
గామించి యున్నఁ, దత్కామరాగంబున | యతిరేకమునఁ జేసి యాక్షణంబ
 
తే. తనకు శుక్లపాతం బైన, దానిఁ దెచ్చి | ద్రోణమున సంగ్రహించిన, ద్రోణుఁ డనఁగఁ
బుట్టె శుక్రునంశంబునఁ బుణ్యమూర్తి | ధర్మతత్త్వజ్ఞుఁ డగు భరద్వాజమునికి.
195
వ. మఱియు ననంతరంబ భరద్వాజసఖుండైన పృషతుం డను పాంచాలపతి మహాఘోరతపంబు సేయుచు నొక్కనాఁడు దనసమీపంబున వాసంతికాపచయవినోదంబున నున్న యప్సరస మేనక యను దానిం జూచి, మదనరాగంబున రేతస్స్కందం బయిన దానిం దన పాదంబునఁ బ్రచ్ఛాదించిన, నందు ద్రుపదుం డనుకొడుకు మరుదంశంబునఁ బుట్టిన, వాని భరద్వాజాశ్రమంబునఁ బెట్టి చని పృషతుండు పాంచాలదేశంబున రాజ్యంబు సేయుచుండె, ద్రుపదుండును ద్రోణునితోడ నొక్కట వేదాధ్యయనంబు సేసి విలువిద్యయుం గఱచి యా పృషతు పరోక్షంబునం బాంచాలదేశంబున కభిషిక్తుం డయ్యె; ద్రోణుండును నగ్నివేశ్యుం డను మహామునివలన ధనుర్విద్వా పారగుం డై తత్ప్రసాదంబున నాగ్నేయాస్త్రం బాదిగా ననేకదివ్యబాణంబులు వడసి, భరద్వాజు నియోగంబునఁ బుత్రలాభార్థంబు కృపుని చెలియలిఁ గృపి యనుదాని వివాహం బయి, దానియం దశ్వత్థామ యను కొడుకుం బడసి, యొక్కనాఁడు. 196
క. అనవరతము బ్రాహ్మణులకుఁ | దనియఁగ ధన మిచ్చు జామదగ్న్యుఁడు రాముం
డను జనవాదపరంపర | విని యరిగెను వానికడకు విత్తాపేక్షన్‌.
197
క. అరిగి మహేంద్రాచలమునఁ | బరమతపోవృత్తి నున్న భార్గవు లోకో
త్తరు భూరికర్మనిర్మల | చరితుని ద్రోణుండు గాంచి సద్వినయమునన్‌.
198
వ. ‘ఏను భారద్వాజుండ, ద్రోణుం డనువాఁడ; నర్థారి నై నీకడకు వచ్చితి’ ననినఁ బరశురాముం డి ట్లనియె. 199
చ. కలధన మెల్ల ముందఱ జగన్నుత | విప్రుల కిచ్చి, వార్ధిమే
ఖలనిఖిలోర్వి యంతయును గశ్యపుఁ డ న్ముని కిచ్చితిన్‌, శరం
బులును శరీరశస్త్రములుఁ బొల్పుగ నున్నవి; వీనిలోన నీ
వలసినవస్తువుల్‌ గొను ధ్రువంబుగ నిచ్చెద నీకు నావుడున్‌.
200
క. ధనములలో నత్యుత్తమ | ధనములు శస్త్రాస్త్రములు; ముదంబున వీనిం
గొని కృతకృత్యుఁడ నగుదును | జననుత! నా కొసఁగు మస్త్రస్త్రశస్త్రచయంబుల్‌.
201
వ. అని పరశురాముచేత దివ్యాస్త్రంబులు ప్రయోగరహస్యమంత్రంబులతోడం బడసి, ధనుర్విద్యయు నభ్యసించి, ధనార్థియయి తన బాలసఖుండైన ద్రుపదుపాలికిం జని ‘యేను ద్రోణుండ, నీ బాలసఖుండ, సహాధ్యాయుండ న న్నెఱుంగుదే’ యని ప్రణయపూర్వకంబుగాఁ బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపదుం డలిగి యి ట్లనియె. 202
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )