ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
ద్రోణుఁడు ద్రుపదునిచే నవమానితుఁ డగుట (సం. 1-122-2)
చ. కొలఁది యెఱుంగ కిట్టి పలుకుల్‌ పలుకం దగుఁ గాదు నా కనన్‌
బలుగుఁదనంబునం బలుకఁ బాడియె నీ సఖి నంచుఁ? బేదవి
ఫ్రులకును ధారుణీశులకుఁ బోలఁగ సఖ్యము సంభవించునే?
పలుకక వేగ పొ; మ్మకట పాఱుఁడు సంగడికాఁడె యెందునన్‌ ?
203
చ. ధనపతితో దరిద్రునకుఁ, దత్త్వవిదుం డగు వానితోడ మూ
ర్ఖునకుఁ, బ్రశాంతుతోడఁ గడుఁ గ్రూరునకున్‌, రణశూరుతోడ భీ
రునకు, వరూథితోడ నవరూథికి, సజ్జనుతోడఁ గష్టదు
ర్జునునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁగూడ నేర్చునే?
204
క. సమశీలశ్రుతయుతులకు | సమధనవంతులకు సమసుచారిత్రులకుం
దమలో సఖ్యమును వివా | హము నగుఁ గా; కగునె రెండు నసమానులకున్‌.
205
వ. ‘మఱి యట్లుంగాక రాజులకుఁ గార్యవశంబునం జేసి మిత్త్రామిత్త్ర సంబంధములు సంభవించుం గావున మా యట్టి రాజులకు మీయట్టిపేదపాఱువారలతోఁ గార్యకారణం బైన సఖ్యం బెన్నండును గానేర’ దని ద్రుపదుం డైశ్వర్యగర్వంబున మెచ్చక పలికిన విని, ద్రోణుం డవమానజనితమన్యుఘూర్ణమానమానసుం డయి యెద్దియుం జేయునది నేరక పుత్త్రకళత్రాగ్నిహోత్రశిష్యగణంబులతో హస్తిపురంబునకు వచ్చె; నంత నప్పురబహిరంగణంబున ధృతరాష్ట్రపాండునందను లందఱుఁ గందుకక్రీడాపరు లయి వేడుకతో నాడుచున్నంత నక్కాంచనకందుకం బొక్కనూతం బడిన. 206
ఆ. నీరిలోనఁ దోఁచు తారక ప్రతిబింబ | మొక్కొ యనఁగ వెలుఁగుచున్నదాని
రాచకొడుకులెల్లఁ జూచుచునుండిరి | దానిఁ బుచ్చుకొనువిధంబు లేక.
207
వ. అట్టి యవసరంబున. 208
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )