ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
ద్రోణుఁడు హస్తిపురంబునకు వచ్చుట (సం. 1-122-14)
క. నానావిధశరశరధుల | తో నున్నతచాపధరుఁడు ద్రోణుఁడు వారిం
గానఁ జనుదెంచి యంతయుఁ | దా నప్పు డెఱింగి రాజతనయుల కనియెన్‌.
209
చ. భరతకులప్రసూతులరు భాసురశస్త్రమహాస్త్ర విద్యలం
గరము ప్రసిద్ధుఁ డై పరఁగు గౌతమశిష్యుల; రిట్టి మీకు దు
ష్కరముగ నూతిలోఁ బడిన కాంచనపిండుఁ గొనంగనేర కొం
డొరుల మొగంబు చూచి నగుచుండఁగఁ జన్నె యుపాయహీనతన్‌.
210
వ. ‘దీని బాణపరంపరం జేసి పుచ్చి యిచ్చెదఁ జూడుఁ; డీ విద్య యొరు లెవ్వరు నేర’ రని ద్రోణుం డొక్కబాణం బభి మంత్రించి దృష్టి ముష్టి సౌష్ఠవంబు లొప్ప నక్కందుకంబు నాట నేసి దానిపుంఖంబు మఱియొక బాణంబున నేసి తత్పుంఖం బొండొకబాణంబున నేసి వరుసన బాణరజ్జువు గావించి దానిం దిగిచికొని యిచ్చినం జూచి రాజకుమారు లెల్ల విస్మయం బంది ద్రోణుం దోడ్కొని చని భీష్మున కంతయు నెఱింగించిన నాతండును. 211
క. ఆసన్నపలితు ననఘు శ | రాసనగురు భూరిసత్త్వు నసితకృశాంగున్‌
భూసురవరు ద్రోణు గుణో | ద్భాసితు వినినట్ల చూచి పరమప్రీతిన్‌.
212
క. ‘ఎందుండి వచ్చి తిందుల; | కెం దుండఁగ నీకు నిష్ట మెఱిఁగింపుము స
ద్వందిత!’ యని యడిగిన సా | నందుఁడు ద్రోణుండు భీష్మునకు ని ట్లనియెన్‌.
213
వ. ఏను ద్రోణుం డనువాఁడ; భరద్వాజపుత్త్రుండ నగ్నివేశ్యుండను మహామునివరునొద్ద బ్రహ్మచర్యాశ్రమంబున వేదాధ్యయ నంబు సేసి ధనుర్వేదం బభ్యసించుచున్ననాఁడు, పాంచాలపతి యైన పృషతుపుత్త్రుండు ద్రుపదుం డను వాఁడు నా కిష్టసఖుం డయి యెల్లవిద్యలు గఱచి, ‘యేను పాంచాలవిషయంబునకు రా జయిననాఁడు నా యొద్దకు వచ్చునది; నా రాజ్యభోగంబులు నీవు ననుభవింప నర్హుండ’ వని నన్నుఁ బ్రార్థించి చని, పృషతుపరోక్షంబునఁ దద్దేశంబునకు రా జయి యున్న, నేను గురునియుక్తుండ నై గౌతమిం బాణిగ్రహణంబు సేసి యిక్కుమారు నశ్వత్థామ నధికతేజస్వి నాత్మజుం బడసి, ధనంబు లేమిం గుటుంబభరణంబునం దసమర్థుండ నయి యుండియు. 214
క. పురుషవిశేష వివేకా | పరిచయు లగు ధరణిపతుల పాలికిఁ బోవం
బరులందు దుష్ప్రతిగ్రహ | భర మెదలో రోసి ధర్మపథమున నున్నన్‌.
215
క. ధనపతుల బాలురు ముదం | బున నిత్యముఁ బాలు ద్రావఁబోయిన నస్మ
త్తనయుండు వీఁడు బాల్యం | బున నేడ్చెను బాలు నాకుఁ బోయుం డనుచున్‌.
216
వ. దానిం జూచి ‘దారిద్ర్యంబునకంటెఁ గష్టం బొం డెద్దియు లేదు; దీని నా బాలసఖుండగు పాంచాలు పాలికిం బోయి పాచికొందు; నాతండు తనదేశంబున కభిషిక్తుండు గాఁ బోవుచుండి నన్ను రాఁ బనిచి పోయె’. 217
మత్తకోకిల. వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్‌
వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్‌
వేఁడినన్‌ ధన మోపఁడేనియు వీనిమాత్రకు నాలుగేన్‌
పాఁడికుఱ్ఱుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్‌.
218
వ. ‘అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెఱింగించిన, నాతండు దన రాజ్యమదంబున నన్నును దన్నును నెఱుంగక’ యేను రాజను నీవు పేదపాఱుండవు; నాకును నీకును నెక్కడి సఖ్యం?’ బలి పలికిన వానిచేత నవమానితుండ నయి వచ్చితి’ నని ద్రోణుండు దనవృత్తాంతం బంతయుఁ జెప్పిన. 219
క. విని రోయుతీఁగ గాళ్ళం | బెనఁగెం దా ననుచుఁ బొంగి భీష్ముఁడు ద్రోణున్‌
ఘనభుజు నభీష్టపూజా | ధనదానవిధానముల ముదంబునఁ దనిపెన్‌.
220
వ. మఱియును. 221
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )