ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
భీష్ముఁడు కురుపాండుకుమారులకు ద్రోణుని గురువుగా నియమించుట (సం. 1-122-40)
చ. మనుమల నెల్లఁ జూపి మతిమంతుఁడు శాంతనవుండు ‘వీరిఁ జే
కొని గురువృత్తిమైఁ గఱపు ఘోరశరాసనవిద్యలెల్లఁ; బెం
పున జమదగ్నిసూనుఁడును బోలఁడు’ ని న్నని విందు విల్లునే
ర్పున నయనైపుణంబునను భూరిపరాక్రమగర్వసంపదన్‌.
222
వ. అని కుమారుల నెల్లం జూపి ద్రోణునకు శిష్యులంగా సమర్పించిన, ద్రోణుండును వారలం జేకొని యందఱ కి ట్లనియె. 223
తే. ‘అస్త్రవిద్యలు గఱచి నా దైన యిష్ట | మొగిన తీర్పంగ నిం దెవ్వఁ డోపు’ ననినఁ
బాయ మొగమిడి కౌరవుల్‌ పలుకకుండి; | ‘రేను దీర్చెద’ నని పూనె నింద్రసుతుఁడు.
224
వ. ఇట్లు దన యిష్టంబు దీర్పం బూనిన యర్జును నాచార్యుం డతిస్నేహంబునఁ గౌఁగిలించుకొని కరంబు సంతసిల్లి కుమారుల కెల్ల విలువిద్యఁ గఱపుచున్న, నానాదేశంబులం గల రాజపుత్త్రులెల్ల వచ్చి వారితోడఁ గలసి కఱచుచుండిరి; మఱియు, సూతపుత్రుం డయిన రాధేయుండును ధనుర్విద్యాకౌశలంబున నర్జునునితోడ మచ్చరించుచు దుర్యోధనపక్షపాతి యై యుండె; నంత. 225
క. నరుఁ డస్త్రశస్త్రవిద్యా | పరిణతి నధికుఁ డయి వినయపరుఁ డయి శశ్వ
ద్గురుపూజాయత్నంబునఁ | బరఁగుచు సంప్రీతుఁ జేసె భారద్వాజున్‌.
226
వ. అ య్యర్జునుతోడి విద్యామత్సరంబునఁ జీఁకటి నాతం డేయ నేరకుండవలయు నని తలంచి యశ్వత్థామ రహస్యంబున నన్నసాధకుం బిలిచి ‘యెన్నండును నరునకు నంధకారంబునఁ గుడవం బెట్టకుమీ!’ యని పంచిన వాఁడును దద్వచనానురూపంబు సేయుచున్న నొక్కనాఁటి రాత్రియందు. 227
ఉ. వాసవనందనుండు గుడువం గుడువం బటుమారుతాహతిం
జేసి చలించి దీపశిఖ చెచ్చెరఁ బాయుడు భోజనక్రియా
భ్యాసవశంబునం గుడిచి ‘పన్నుగ నిట్టుల విద్య లెల్ల న
భ్యాసవశంబునం బడయ భారము లే దని నిశ్చితాత్ముఁ డై.
228
క. పాయక చీఁకటియందును | నేయంగా నభ్యసించు నిట్టియెడం గౌం
తేయు ధనుర్‌జ్యా ధ్వని విని | ధీయుక్తుఁడు ద్రోణుఁ డరుగుదెంచి ముదమునన్‌.
229
సీ. ఆతని యస్త్రవిద్యాభియోగమునకుఁ | బ్రియశిష్యవృత్తికిఁ బెద్ద మెచ్చి
‘యన్న! ధనుర్ధరు లన్యులు నీకంటె | నధికులు గాకుండునట్లు గాఁగఁ
గఱపుదు విలువిద్య ఘనముగా’ నని పల్కి | ద్వంద్వసంకీర్ణయుద్ధముల తెఱఁగు
రథమహీవాజివారణములపై నుండి | దృఢచిత్రసౌష్ఠవస్థితుల నేయ
 
తే. బహువిధవ్యూహభేదనోపాయములను | సంప్రయోగరహస్యాతిశయము గాఁగఁ
గఱపె నర్జునుఁ దొంటి భార్గవుఁడు వింట | నిట్టిఁ డే! యని పొగడంగ నెల్ల జనులు.
230
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )