ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
ఏకలవ్యుం డనువాఁడు ద్రోణు నారాధించి విలువిద్య గఱచుట (సం. 1-123-10)
వ. మఱియు గదాకార్ముకప్రాసాసితోమరకుంతశక్త్యాది వివిధాయుధంబులయందును గుమారుల నందఱ జితశ్రములం జేయుచున్న ద్రోణాచార్యుల మహాప్రసిద్ధి విని హిరణ్యధన్వుం డను నెఱుకురాజుకొడు కేకలవ్యుం డనువాఁడు ధనుర్విద్యాగ్రహణార్థి యయి వచ్చినవాని నిషాదపుత్త్రుం డని శిష్యుంగాఁ జేకొన కున్న, వాఁడును ద్రోణుననుజ్ఞ వడసి చని వనంబులోన. 231
తే. వినయమున ద్రోణురూపు మన్నున నమర్చి | దాని కతిభక్తితోడఁ బ్రదక్షిణంబుఁ
జేసి మ్రొక్కుచు సంతతాభ్యాసశక్తి | నస్త్రవిద్యారహస్యంబు లర్థిఁ బడసె.
232
క. ఇట పాండవకౌరవు లొ |క్కొట నందఱు గురుననుజ్ఞఁ గొని మృగయాలం
పటు లై వనమున కరిగిరి | పటుతరజవసారమేయభటనివహముతోన్‌.
233
వ. ఇ ట్లరిగి వనంబులోఁ గ్రమ్మరుచున్న నం దొక్క భటునికుక్క తోడు దప్పి పఱచి యొక్కెడ నేకతంబ యేయుచున్న నేకలవ్యుసమీపంబున మొఱింగిన, నయ్యెలుంగు విని దానిముఖంబునం దేడుబాణంబు లొక్కటఁ దొడిగి యక్కజంబుగా నతిలాఘవంబున వాఁ డేసిన, నది శరపూరితముఖం బయి కురుకుమారుల యొద్దకుం బాఱిన దానిం జూచి విస్మయం బంది య ట్లేసినవాఁ డెవ్వఁడో యని రోయుచు వచ్చువారు ముందఱ. 234
ఉ. తేజితబాణహస్తు, దృఢదీర్ఘమలీమసకృష్ణదేహుఁ, గృ
ష్ణాజినవస్త్రు నస్త్రవిషయాస్తవిషాదు నిషాదుఁ జూచి యా
రాజకుమారు లందఱుఁ బరస్పరవక్త్రవిలోకనక్రియా
వ్యాజమునం దదీక్షణనివారితు లై రతిమత్సరంబునన్‌.
235
వ. అ క్కుమారులు వానిశరలాఘవంబునకు మెచ్చి ‘నీ వెవ్వండ వెవ్వరిచేత విలువిద్యఁ గఱచి?’ తని యడిగిన వారికి నయ్యెఱు కి ట్లనియె. 236
క. వినుఁ! డే హిరణ్యధన్వుం | డను వనచరనాథుకొడుక; నాచార్యుఁడు ద్రో
ణునకున్‌ శిష్యుఁడ; నెందును | ననవద్యుఁడ; నేకలవ్యుఁ డనువాఁడ మహిన్‌.
237
వ. అనిన విని కురుకుమారు లందఱు మగుడి వచ్చి ద్రోణున కంతయుఁ జెప్పి; రంత నర్జునుం డేకాంతంబ యొక్కనాఁ డాచార్యున కి ట్లనియె. 238
క. విలువిద్య నొరులు నీ క | గ్గలముగ లేకుండ నిన్నుఁ గఱపుదు నని మున్‌
బలికితిరి; నాక కా దీ | త్రిలోకముల కధికుఁ జూచితిమి యొక యెఱుకున్‌.
239
క. నాకంటెను మీకంటెను | లోకములో నధికుఁ డతిబలుండు ధనుర్వి
ద్యాకౌశలమున; నాతఁడు | మీకుం బ్రియశిష్యుఁ డటె యమిథ్యావచనా!
240
వ. అనిన విని ద్రోణుం డదరిపడి ‘వానిం జూతము ర’మ్మని యర్జునుం దోడ్కొని, యనవరతశరాసనాభ్యాసనిరతుం డయి యున్న యేకలవ్యుకడ కేఁగిన, నెఱింగి వాఁడు నెదురు పఱతెంచి ద్రోణునకు మ్రొక్కి తన శరీరంబు సర్వస్వంబును నివేదించి, ‘యేను మీ శిష్యుండ; మి మ్మారాధించి మీ ప్రసాదంబున నివ్విలువిద్యఁ గఱచితి’ నని కరంబులు మొగిచియున్నం జూచి, ద్రోణుం ‘డట్లేని మాకు గురుదక్షిణ యి’మ్మనిన సంతసిల్లి వాఁ డిట్లనియె. 241
క. ‘ఇది దేహం; బిది యర్థం; | బిది నా పరిజనసమూహ; మిన్నిటిలో నె
య్యది మీ కిష్టము దానిన | ముద మొదవఁగ నిత్తుఁ గొనుఁ డమోఘం’ బనినన్‌.
242
క. ‘నెమ్మిని నీ దక్షిణహ | స్తమ్మున పెనువ్రేలు దునిమి దక్షిణ యి; మ్మి
ష్ట మ్మిది నా ‘కనపుడు విన | యమ్మున వాఁ డిచ్చె దాని నాచార్యునకున్‌.
243
తే. దక్షిణాంగుష్ఠ మిచ్చిన దానఁ జేసి | బాణసంధానలాఘవభంగ మయిన
నెఱుకు విలువిద్య కలిమికి హీనుఁ డయ్యెఁ | బార్థునకును మనోరుజ పాసె నంత.
244
క. ‘విలువిద్య నొరులు నీ క | గ్గలముగ లేకుండ నిన్నుఁ గఱపుదు’ నని మున్‌
బలరిపుసుతునకుఁ బలికిన | పలు కప్పుడు గురుఁడు సేసెఁ బరమార్థముగన్‌.
245
మత్తకోకిల. భూపనందను లివ్విధంబున భూరిశస్త్రమహాస్త్రవి
ద్యోపదేశపరిగ్రహస్థితి నున్న నందఱయందు వి
ద్యోపదేశము దుల్య మైనను నుత్తమోత్తముఁ డయ్యె వి
ద్యాపరిశ్రమకౌశలంబున దండితారి నరుం డిలన్‌.
246
క. అనిలాత్మజు బలమును న | ర్జును కార్ముక కౌశలంబు శూరగుణంబుల్‌
మనమున సహింపనోపక | వనరుచు ధృతరాష్ట్రసుతులు వందిరి తమలోన్‌.
247
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )