ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
ద్రోణుఁ డస్త్రవిద్యం దనశిష్యులఁ బరీక్షించుట (సం. 1-123-15)
వ. అ క్కుమారుల ధనుర్విద్యా కౌశలం బెఱుంగ వేఁడి యొక్కనాఁడు ద్రోణుండు కృత్రిమం బయిన భాసం బను పక్షి నొక్క వృక్షశాఖాగ్రంబున లక్ష్యంబుగా రచియించి, దాని నందఱకుఁ జూపి ‘మీమీ ధనువుల బాణంబులు సంధించి నా పంచిన యప్పుడ యిప్పక్షి తలఁ దెగ నేయుం; డే నొక ళ్లొకళ్ళన పంచెద’ నని ముందఱ ధర్మనందనుం బిలిచి ‘యీ వృక్షశాఖాగ్రంబున నున్న పక్షి నిమ్ముగా నీక్షించి మద్వచనానంతరంబున శరమోక్షణంబు సేయు మనిన నతండును వల్లె యని గురువచనంబు సేసి యున్న నయ్యుధిష్ఠిరునకు ద్రోణుం డి ట్లనియె. 248
తే. ‘వృక్షశాఖాగ్రమున నున్న పక్షిశిరము | దెల్లముగఁ జూచితే మహీవల్లభుండ!’
యనిన నిమ్ముగఁ జూచితి ననిన, వెండి | యును గురుఁడు ధర్మజున కిట్టు లనియెఁ బ్రీతి.
249
క. జననుత! యా మ్రానిని న | న్నును మఱి నీ భ్రాతృవరులనుం జూచితె నీ?’
వనవుడుఁ జూచితి నన్నిటి | ననఘా! వృక్షమున నున్న యవ్విహగముతోన్‌.
250
వ. అనిన విని ద్రోణుండు ధర్మజుం బదరి ‘నీ దృష్టి చెదరె; నీవు దీని నేయనోపవు పాయు’ మని యివ్విధంబున దుర్యోధనాదు లైన ధార్తరాష్ట్రులను భీమసేన నకుల సహదేవులను నానాదేశాగతు లైన రాజపుత్త్రులను గ్రమంబున నడిగిన వారలు ధర్మనందను చెప్పినట్ల చెప్పిన, నందఱ నిందించి, పురందరనందనుం బిలిచి వారి నడిగిన యట్ల యడిగిన నాచార్యునకు నర్జునుం డి ట్లనియె. 251
క. ‘పక్షిశిరంబు దిరంబుగ | నీక్షించితి; నొండు గాన నెద్దియు’ ననినన్‌
లక్షించి యేయు మని సూ | క్షే క్ష్మణు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్‌.
252
క. గురువచనానంతరమున | నరుఁ డప్పుడు శరవిమోక్షణము సేయుఁడుఁ జె
చ్చెరఁ బక్షిశిరము దెగి త | ద్ధరణీరుహశాఖనుండి ధారుణిఁ బడియెన్‌.
253
వ. ఇ ట్లశ్రమంబునఁ గృత్రిమపక్షితలఁ దెగనేసిన యర్జును నచలితదృష్టికి లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి ధనుర్వేదరహస్యంబు లుపదేశించె; నంత. 254
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )