ఇతిహాసములు భారతము ఆదిపర్వము - పంచమాశ్వాసము
అర్జునుఁడు ద్రోణుని మొసలినుండి విడిపించుట (సం. 1-123-68)
క. మానుగ రాజకుమారుల | తో నొక్కట నొక్కనాఁడు ద్రోణుఁడు గంగా
స్నానార్థ మరిగి యందు మ | హా నియమస్థుఁ డయి నీళ్ల నాడుచునున్నన్‌.
255
క. వెఱచఱవ నీరిలో నొ | క్కెఱగా నొక మొసలి చూడ్కికి నగోచర మై
పఱతెంచి కుంభసంభవు | చిఱుదొడ వడిఁ బట్టికొనియె శిష్యులు బెదరన్‌.
256
క. దాని విడిపింప ద్రోణుఁడు | దా నపుడు సమర్థుఁ డయ్యుఁ దడయక పనిచెన్‌
‘దీని విడిపింపుఁ’ డని నృప | సూనుల శరసజ్యచాపశోభితకరులన్‌.
257
శా. దానిన్‌ నేరక యందఱున్‌ వివశు లై తా రున్న నన్నీరిలోఁ
గానం గాని శరీరముం గల మహాగ్ర గ్రాహమున్‌ గోత్ర భి
త్సూనుం డేనుశరంబులన్‌ విపులతేజుం డేసి శక్తిన్‌ మహా
సేనప్రఖ్యుఁడు ద్రోణుజంఘ విడిపించెన్‌ విక్రమం బొప్పఁగన్‌.
258
వ. అ మ్మహోగ్రగ్రాహంబు పార్థబాణపంచకవిభిన్నదేహం బయి పంచత్వంబుఁ బొందినం జూచి, ద్రోణుం డర్జును ధనుః కౌశలంబునకుఁ దనయం దతిస్నేహంబునకు మెచ్చి, వీనిచే ద్రుపదుండు బంధుసహితంబు పరాజితుండగు నని తనమనంబున సంతోషించి, వానికి ననేకదివ్యబాణంబు లిచ్చె నని యర్జునుకొండుకనాఁటి పరాక్రమ గుణసంపదలు వైశంపాయనుండు జనమేజయునకుం జెప్పె నని. 259
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )