ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
కుమారాస్త్రవిద్యాసందర్శనము (సం. 1-124-1)
క. ఘోరాస్త్రశస్త్రవిద్యల | నారూఢత మిగుల నిపుణు లైరి కుమారుల్‌
మీరలు వీరల విద్యా | పారము సను టెఱుఁగవలయు భవదీయ సభన్‌.
3
వ. అనిన నట్ల చేయుదు నని ధృతరాష్ట్రుండు ‘గుమారుల విద్యాసందర్శనరంగంబు రమ్యంబుగాఁ జేయింపు’ మని విదురుం బంచిన, నతండును దాని శాస్త్రవిహిత ప్రమాణోపేత వృత్తాయామంబును, నపాకృత వృక్ష గుల్మ వల్మీకంబును, నంగీకృత పూర్వోత్తరప్లవంబును, సమీకృత నిమ్నోన్నత ప్రదేశంబును, దూరీకృత కంటక పాషాణ శల్య శకలంబును, విరజీకృత రజోధూసర స్థలంబును, విరచిత బహువిధ ప్రేక్షాగారాంచిత మణిమయమంచ ప్రపంచంబును,నానాధ్వజనవపల్లవరంభాస్తంభమాలాలంకృతద్వారతోరణంబును, బ్రతిదిశనిర్వర్తిత శాంతిక బలి విధానంబునుంగాఁ జేయించినం, బంచాంగశుద్ధదినశుభముహూర్తంబున ధృతరాష్ట్రుండు గాంధారీ పురస్కృత దేవీశతపరివృతుం డై, వివిధభూషణ భూషితానేక విలాసినీనివహంబుతోఁ జనుదెంచి, విలంబిత కదంబక స్థూలముక్తాఫలదామ రమణీయం బై, యాబద్ధమరకత వజ్రవైడూర్య పద్మరాగప్రభాప్రకర వ్యతికర విరచితా పూర్వ సురచాపచారుగౌరవం బై, యతిమనోహరం బైన శాతకుంభమయ ప్రేక్షాగారంబున నున్న. 4
తే. అందుఁ గరమొప్పి సుందరీబృంద మఖిల | రత్నరాజితకనకధరాధరేంద్ర
కందరాంతరమున నున్న సుందరామృ | తాశనాంగనాబృందంబు ననుకరించె.
5
తే. సుతులవిద్యాప్రవీణతఁ జూచువేడ్క | నెంతయును సంతసంబునఁ గుంతిదేవి
రాజసన్నిధి గాంధారరాజపుత్రి | కెలన నుండె నున్మీలితనలిననేత్ర.
6
వ. మఱియును. 7
సీ. వ్యాసపురస్కృతావనిదేవనివహంబుఁ | గృప శల్య శకుని గాంగేయ విదుర
సోమదత్తాది భాసురగురుబాంధవ | మిత్త్రవర్గంబు, నమేయ మంత్రి
సామంత మండలేశ్వరసమూహంబును | గాయక వైతాళికప్రవరులుఁ
దమతమ నియమిత స్థానంబులం దోలి | నుండిరి; బోరన నులిసె భేరు;
 
ఆ. లస్త్రదర్శనాగతాఖిల క్షత్రియ | వైశ్యశూద్రవివిధవర్ణజనుల
కలకలంబు ప్రళయకాలసంక్షోభితాం | భోనిధిస్వనంబుఁ బోలెఁ జెలఁగె.
8
వ. అట్టియవసరంబున నాచార్యుండు శుక్లాంబరాభరణమాల్యానులేపన యజ్ఞోపవీతపలితకేశశ్మశ్రు శోభిత దేహుం డై రంగమధ్యంబున నశ్వత్థామసహితుం డై, విముక్తజలదజాలవియన్మధ్యంబున నంగారకసహితుం డైన యాదిత్యుండునుంబోలె నున్న నగణ్యభూసురవరేణ్యపుణ్యాహవాచనానంతరంబున. 9
శా. ద్రోణాచార్యుపిఱుంద నొప్పి దృఢహస్తుల్‌, బద్ధగోధాంగుళీ
త్రాణుల్‌, మార్గణపూర్ణతూణులు, మహాధన్వుల్‌ కుమారుల్‌ తను
త్రాణోపేతులు రంగమధ్యమున నంతన్‌ నిల్చి రుద్యద్గుణ
శ్రేణీరమ్యులు ధర్మజప్రముఖు లై జ్యేష్ఠానుపూర్వంబుగన్‌.
10
వ. అట్లు నిలిచి, రక్తచందనదిగ్ధాంగులు రక్తమాల్యాంబరాభరణులు రక్తపతాకులు రక్తాంతలోచను లై యాచార్యు ననుమతంబున. 11
సీ. అసిచర్మకౌశలం బమరంగఁ జూపెడు | వారును, దృఢసౌష్ఠవంబు లొప్పఁ
దమతమనామాంకితము లైన శరముల | నేర్పడ లక్ష్యంబు లేయువారు,
హయ మదద్విరద రథారూఢ దక్షతఁ | బ్రకటించువారును, బ్రాసశక్తి
కుంత తోమర గదాకుశలత్వ మెఱిఁగించు | వారునుగా నిట్లు వసుధలోని
 
ఆ. రాజసుతులతోడ రమణఁ బాండవధృత | రాష్ట్రసుతులు వృద్ధరాజులొద్దఁ
దద్దయును ముదమునఁ దమతమవిద్యలు | మెఱసి రెల్లజనులు మెచ్చి పొగడ.
12
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )