ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
భీమదుర్యోధనులు తమగదాకౌశలంబు సూపుట (సం. 1-124-30)
వ. అంత ననంతబలపరాక్రము లగు భీమదుర్యోధను లుద్యద్గదాహస్తు లయి మహామత్సరంబుతో నేక శృంగసముత్తుంగశైలద్వయంబు ననుకరించుచు వశానిమిత్తక్రుద్ధగంధసింధురంబులుంబోలె నొండురులం దాఁకి సవ్యాపసవ్యచిత్రమండలమార్గంబుల గదాకౌశలంబు మెఱయునెడ. 13
మ. అవనీచక్రము పాదఘాతహతి నల్లాడంగ నత్యుగ్రభై
రవహుంకార రవంబునన్‌ వియదగారంబెల్ల భేదిల్లఁ బాం
డవకౌరవ్యగదావిఘట్టన మకాండప్రోత్థమై భావిపాం
డవకౌరవ్యరణాభిసూచన పటిష్ఠం బయ్యె ఘోరాకృతిన్‌.
14
క. ఆ రాజసుతులవిద్యా | పారగపటు చేష్టితములఁ బరువడి నగ్గాం
ధారీధృతరాష్ట్రుల కతి | ధీరుఁడు విదురుండు సెప్పి తెలుపుచునుండెన్‌.
15
వ. అంత భీమదుర్యోధనుల గదా కౌశలంబు సూచుజనులపక్షపాతజనిత పరస్పర క్రోధ వచనంబులు విని ద్రోణుండు రంగభంగభయంబున నశ్వత్థామంబంచి వారి నిద్దఱ వారించి, వారాశియుంబోలె బోరన మ్రోయుచున్న వాదిత్రశబ్దంబు లుడిపి, ‘నా ప్రియశిష్యుండయిన యర్జును ధనుర్విద్యాకౌశలంబుఁ జూడుం’ డనిన నయ్యాచార్యు వచనానంతరంబున. 16
ఉ. హారివిచిత్రహేమకవచావృతుఁ, డున్నతచాపచారుదీ
ర్ఘోరుభుజుండు, భాస్వదసితోత్పలవర్ణుఁడు, సేంద్రచాపశం
పారుచిమేఘమో యనఁగ బాండవమధ్యముఁ డొప్పి బద్ధతూ
ణీరుఁడు రంగమధ్యమున నిల్చె జనంబులు దన్నుఁ జూడఁగన్‌.
17
క. నరు నింద్రాత్మజు నింద్రా | వరజసఖున్‌ వీరుఁ బాండవప్రవరు ధను
ర్థరుఁ జూచి, చూపఱెల్లం | బరమాద్భుతచిత్తు లగుచుఁ బలికిరి తమలోన్‌.
18
తే. వీఁడె కృతహస్తుఁ డఖిలాస్త్రవిద్యలందు | వీఁడె యగ్రగణ్యుఁడు ధర్మవిదులలోన,
వీఁడె భరతవంశం బెల్ల వెలుఁగఁ గుంతి | కడుపు చల్లఁగాఁ బుట్టిన ఘనభుజుండు.
19
క. అని పలుకుజనులపలుకులు | విని గొంతి యనంతహర్షవిస్తారితలో
చన యై నందను నృపనం | దనసంఘములోనఁ జూచి తద్దయుఁ బొంగెన్‌.
20
క. చారుమనస్సమ్మదరస | పూరము వెలివేర్చునట్లు పొలఁతికి విగళ
ద్భూరిస్తనజనితపయో | ధారలు నానందబాష్పధారలు నొప్పెన్‌.
21
వ. అయ్యర్జునుస్తుతివచనంబు లొక్కట జనసంఘంబువలన నెగసి వియత్తలవిదళనం బయిన నమ్మహాధ్వని విని యదరిపడి ధృతరాష్ట్రుం ‘డిది యేమి రభసం?’ బని విదురు నడిగిన నాతం డి ట్లనియె. 22
క. భూరిభుజుం డర్జునుఁ డతి | శూరుఁడు దనయస్త్రవిద్యఁ జూపఁగ రంగ
త్ప్రారంభుఁ డయిన నతని న | వారితముగఁ బొగడుజనరవం బిది యధిపా!
23
క. అనవుడు ధృతరాష్ట్రుఁడు దన | మనమున సంతోషమంది మానుగ వీనుల్‌
గనిన ఫల మిపుడు గంటిన్‌ | వినఁ గంటినిఁ బాండుసుతుల విద్యాశక్తుల్‌.
24
క. భూరినిజద్యుతితోడఁ బృ | థారణిసంభూతపాండవాగ్నిత్రితయం
బారఁగ నస్మత్కులదురి | తోరుతరారణ్యదాహ మున్నతిఁ జేయున్‌.
25
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )