ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
అర్జునుండు తనయస్త్రవిద్యాకౌశలంబు సూపుట (సం. 1-125-18)
వ. అని పొగడుచుండ నర్జునుం డాచార్యుననుమతంబున నస్త్రలాఘవవైచిత్ర్య ప్రకాశనపరుం డయి యెల్లవారును జూచుచుండ. 26
సీ. ఆగ్నేయశరమున నతిభీకరాగ్నియు | వారుణాస్త్రమున దుర్వారజలము
ననిలబాణంబున నధికానిలంబును | మేఘాస్త్రమున మహామేఘచయముఁ
బుట్టించు మఱియును భూమిబాణంబున | భూప్రవిష్టుం డగు, భూరిఘోర
శైలబాణంబున శైలరూపము దాల్చు | వీరుఁ, డదృశ్యాస్త్రవిద్యపేర్మిఁ
 
తే. దా నదృశ్యదేహుం డగుఁ, దత్‌క్షణంబ | హ్రస్వుఁ డగు దీర్ఘుఁ డగు సూక్ష్ముఁ డగు రయంబు
తోడ రథమధ్యగతుఁ డగు ధూర్గతుండు | నగు మహీతలగతుఁ డగు నద్భుతముగ.
27
వ. మఱియుం బాఱెడుసింహవ్యాఘ్రవరాహాదిమృగంబుల ముఖంబులం దొక్కొక్కయ మ్మేసినట్ల యేనేసి యమ్ము లతిలాఘవంబున నేసియు, రజ్జుసమాలంబితం బయిన గోశృంగంబునం దేకవింశతిశరంబులు వరుసన నాట నేసియు, ని ట్లస్త్రవిద్యావైచిత్ర్యంబు మెఱసి గదాఖడ్గాదివివిధాయుధదక్షతం జూపి యర్జునుండు జనుల కాశ్చర్యంబు సేయుచున్నంతఁ, గర్ణుండును నిజవిద్యాకౌశలంబు మెఱయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్ఫాలనంబు సేసిన. 28
మ. జనులెల్లం గడుసంభ్రమింపఁగ నజస్రంబై భుజాస్ఫాలన
ధ్వని శైలప్రకరంబుపైఁ బడు మహాదంభోళిశబ్దంబొకో
యన వీతెంచినఁ బాండవుల్‌ సనిరి ద్రోణాచార్యు డాయన్‌, సుయో
ధను వేష్టించిరి తమ్ము లందఱును దద్ద్వారంబు వీక్షించుచున్‌.
29
వ. అంత. 30
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )