ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
కర్ణుఁడు ప్రవేశించి అర్జును నధిక్షేపించుట (సం. 1-126-2)
శా. సాలప్రాంశు నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్‌
బాలార్క ప్రతిమున్‌ శరాసనధరున్‌ బద్ధోగ్రనిస్త్రింశు శౌ
ర్యాలంకారు సువర్ణవర్ణు ఘనుఁ గర్ణాఖ్యున్‌ జగత్కర్ణపూ
ర్ణాలోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యులై రచ్చటన్‌.
31
వ. కర్ణుండును జనుల నందఱ నదల్చి చొత్తెంచి, రంగమధ్యంబున నిలిచి, కలయం జూచి, కృపద్రోణాచార్యులకు నమస్కరించి, సజలజలధరధ్వానగంభీరవచనంబుల నర్జును నాక్షేపించి యి ట్లనియె. 32
క. నీవ కడునేర్పుకాఁడవు | గా వలవదు; వీనిఁ గొన్ని గఱచితి మేమున్‌
నీవిద్యలెల్లఁ జూపుదు | మే వీరుల సూచి మేలుమే లని పొగడన్‌.
33
క. అనిన నినతనయుపలుకులు | జనులకు విస్మయము, సవ్యసాచికిఁ గోపం
బును సిగ్గును, మఱి దుర్యో | ధనునకుఁ బ్రీతియును జేసెఁ దత్‌క్షణమాత్రన్‌.
34
వ. అంత ద్రోణుచేత ననుజ్ఞాతుం డయి కర్ణుం డర్జునుచూపిన యస్త్రవిద్యావిశేషంబులెల్ల నశ్రమంబునఁ జూపినఁ జూచి, దుర్యోధనుండు దానుం దమ్ములును గర్ణునిం గౌఁగిలించుకొని ‘నాతో బద్ధసఖ్యుండ వయి నాకును బాంధవులకును హితంబు సేసి నారాజ్యభోగంబులను నీవును నుపయోగింపు’ మనిన ‘నట్ల చేయుదు’ నని కర్ణుం డాతనితోడి యిష్టసఖిత్వంబున కొడంబడి, ‘యిమ్మూఁగిన రాజలోకంబును నీవును జూడఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు చేయవలయు’ ననిన ధార్తరాష్ట్రమధ్యంబున నున్న యక్కర్ణుం జూచి పార్థుం డి ట్లనియె. 35
క. పిలువంగఁబడక సభలకు | బలిమిం జని పలుకు పాపభాగుల లోకం
బులకుఁ జన వేఁడి పలికెదు | పలువ! యెఱుంగవు పరాత్మపరిమాణంబుల్‌.
36
క. అనిన విని పార్థునకు ని | ట్లనియె నినాత్మజుఁడు ‘దుర్బలాశ్వాసక్షే
పనిబంధమ్ములు వలుకక | ఘననిశితాస్త్రములఁ బలుకఁ గడఁగుము నాతోన్‌’.
37
క. ఈ రంగభూమి యస్త్రవి | శారదు లగువారి కెల్ల సామాన్యముగా
కారయ వీరికిఁ జొర నగు | వీరికిఁ గా దను విచారవిషయము గలదే?
38
వ. అని గర్వించి దుర్యోధనానుమతంబునఁ బార్థుతో ద్వంద్వయుద్ధంబు సేయంబూని రణసన్నద్ధుం డయి రవితనయుండు రంగమధ్యంబున నున్నంత, నర్జునుండును నాచార్యభ్రాతృచోదితుం డై యుగాంత కాలానలుండునుంబోలెఁ బ్రతిఘటించి నిలిచిన. 39
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )