ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
కర్ణార్జునుల ద్వంద్వయుద్ధము (సం. 1-126-23)
మ. జనితామర్షణుఁ డంతఁ బార్థుపయిఁ బర్జన్యాస్త్ర మక్కర్ణుఁ డే
సె; నపారం బయి భూనభోంతరముఁ దజ్జీమూతయూథంబు గ
ప్పినఁ దద్ధ్వాంతతిరోహితాపఘనుఁ డై బీభత్సుఁ డుండెన్‌; విరో
చనుఁ డాత్మద్యుతి విస్తరించె సుతుపై సంప్రీతచేతస్కుఁ డై.
40
వ. అయ్యవసరంబున దుర్యోధనుందొట్టి ధృతరాష్ట్రనందను లందఱుఁ గర్ణువలన నుండిరి; భీష్మద్రోణకృప పాండవులు పార్థువలన నుండి రంత. 41
క. రవిసుతపార్థులఘోరా | హవమునకును వెఱచుచున్నయది కుంతి తదు
ద్భవఘనతరశరతిమిరౌ | ఘవృతాంగుఁ దనూజుఁ జూడఁ గానక వంతన్‌.
42
క. ధృతి దఱిఁగి మోహమూర్ఛా | న్విత యైనను సంభ్రమించి విదురుఁడు ప్రత్యా
గతజీవఁ జేసె నప్పుడ | యతిశీతలచందనోదకాసేకమునన్‌.
43
వ. అంత నర్జునుం డనిలబాణంబున నమ్మేఘపటలంబు పఱవనేసి యాదిత్యసమతేజుం డయి యుండె; నంత విదురదర్శితు లైన యక్కర్ణార్జునులం జూచి కుంతి సంతసిల్లె; నపుడు ధర్మవిదుం డఖిలద్వంద్వయుద్ధసమాచార నిపుణుండు కృపాచార్యుం డయ్యిద్దఱ నడుమ నిలిచి కర్ణున కి ట్లనియె. 44
చ. కురుకులజుండు పాండునకుఁ గుంతికిఁ బుత్త్రుడు, రాజధర్మబం
ధురచరితుండు; నీ వితనితోడ రణం బొనరించెదేని వి
స్తరముగ నీదువంశమును దల్లిని దండ్రిని జెప్పు,; చెప్పినన్‌
దొరయగుదేని నీ కెదిరి దోర్బలశక్తి నితండు సూపెడిన్‌.
45
వ. అనిన విని కర్ణుండు దనకులంబును దల్లిదండ్రులను జెప్ప సిగ్గుపడి తలవాంచి యున్నం జూచి దుర్యోధనుండు గృపున కి ట్లనియె. 46
క. కులముగలవాఁడు, శౌర్యము | గలవాఁడును, నధికసేన గలవాఁడును, భూ
తలమున రా జను నామము | విలసిల్లఁగఁ దాల్చు మూఁడువిధముల పేర్మిన్‌.
47
తే. రాజవరుఁ డైన పార్థుతో రాజు గాని | యీతఁ డని సేయఁగాఁ దగఁడేని వీని
నెల్లవారును జూడంగ నీక్షణంబ | రాజుఁ జేసెద నే నంగరాజ్య మిచ్చి.
48
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )