ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
దుర్యోధనుఁడు కర్ణుని నంగరాజ్యమున కభిషిక్తుం జేయుట (సం. 1-126-36)
వ. అని యప్పుడ భీష్మధృతరాష్ట్రులకుం జెప్పి వారియనుమతంబున మహామహీసురసహస్రంబునకు గోసహస్రా యుతంబు దానంబు సేసి ‘యంగరాజ్యంబునకు వీఁ డర్హుం డయ్యెడ| మను బ్రాహ్మణవచనంబు వడసి, కర్ణుం గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ, గర్ణుండును మణిమకుట కేయూర హారాది భూషణ భూషితుం డై సకలరాజచిహ్నంబుల నొప్పి పరమహర్షంబుతోడం గురుపతి కి ట్లనియె. 49
క. బృహదబ్ధిమేఖలాఖిల | మహీతలక్షత్త్రవరసమక్షమున మహా
మహిమాన్వితుఁగా నన్నును | మహీశుఁగాఁ జేసి తతిసమర్థత వెలయన్‌.
50
క. ‘దీనికి సదృశముగా మఱి | యే నేమి యొనర్తు నీకు నిష్టం?’ బనినన్‌
‘మానుగ నాతోఁ జెలిమి మ | హీనుతముగఁ జేయు; మిదియ యిష్టము నాకున్‌.’
51
వ. అనిన విని దుర్యోధనున కెంతయు సంతోషంబుగాఁ గర్ణుం డతనితోడి యిష్ట సఖిత్వంబున కొడంబడియె, నంతఁ గొడుకు రాజ్యాభిషేకోత్సవంబు సూచి హర్షపరవశుం డయి సూతుండు రథంబు డిగ్గి కర్ణునొద్దకుం బఱతెంచినఁ, గర్ణుండును బితృగౌరవంబున సంభ్రమించి వానికి వినయవినమితోత్త మాంగుండయిన. 52
తే. కడఁగి సూతుండు పుత్త్రకుఁ గౌఁగిలించి | కొని తదీయమూర్ధాఘ్రాణ మొనరఁ జేసి
యంగరాజ్యాభిషేకార్ధ్రమైన శిరముఁ | దడిపె వెండియు హర్షాశ్రుతతుల నొప్ప.
53
వ. దానిం జూచి భీముండు గర్ణుని సూతకులసంభవుంగా నెఱింగి నగుచు ని ట్లనియె. 54
క. నీదు కులమునకుఁ దగఁగఁ బ్ర | తోదము గొని రథము గడపఁ దొరఁగుము నృపధ
ర్మోదయుఁ డగు నర్జునుతోఁ | గా దనక రణంబు సేయఁగా నీ కగునే?
55
వ. మఱి యదియునుం గాక. 56
తే. ఉత్తమక్షత్త్రియప్రవరోపయోగ్య | మైన యంగరాజ్యంబు నీ కర్హ మగునె?
మంత్రపూత మై గురుయజమానభక్ష్య | మగుపురోడాశ మది గుక్క కర్హ మగునె!
57
వ. అనినం గర్ణుండు వెల్లనయి యెద్దియుం జేయునది నేరక దీర్ఘోష్ణనిశ్వాసవ్యాకులిత వదనుం డయి యాకాశంబు వలన నున్న యాదిత్యుం జూచుచు మిన్నకుండె; నంత నంతర్విలులితుం డయిన యక్కర్ణుం జూచి భ్రాతృపద్మవన మధ్యంబుననుండి దుర్యోధనమదాంధగంధసింధురంబు వెలువడి వచ్చి కడు నలిగి భీమున కి ట్లనియె. 58
క. అనిలజ! నీ కి ట్లని ప | ల్కను దలఁపను నగునె? లేడి కడుపునఁ బులి పు
ట్టునె? యిట్టి దివ్యతేజం | బున వాఁ డధమాన్వయమునఁ బుట్టునె చెపుమా!
59
సీ. శూరులజన్మంబు సురలజన్మంబును | నేఱులజన్మంబు నెఱుఁగ నగునె?
మొగిని దధీచియెమ్మునఁ బుట్టదయ్యెనే | వాసవాయుధ మైన వజ్ర మదియు;
గాంగేయుఁ డన మఱి కార్తికేయుం డన | నాగ్నేయుఁ డన రౌద్రుఁ డనఁగ శరవ
ణోద్భవుం డన గుహుం డుద్భవిల్లఁడె? శర | స్తంబజన్ముఁడు గాఁడె ధర్మవిదుఁడు
 
తే. గృపుఁడు? ఘటసంభవుఁడు గాఁడె కీర్తిపరుఁడు | వరుఁడు ద్రోణుండు? విప్రులవలనఁ బుట్ట
రైరె సత్క్షత్రియుల్‌ ఘను లవనిఁ గావఁ? | గడఁగి మీ జన్మములు నిట్ల కావె వినఁగ.
60
వ. ‘వానితోడి దేమి? దివ్యలక్షణలక్షితుండును సహజకవచకుండలమండితుండును గాని ప్రకృతిపురుషుండు గాఁడు; తన బాహుబలంబున నీ యంగరాజ్యంబునక కాదు సకలమహీరాజ్యంబునకు నర్హుం డగు’ ననుచున్నయంత నాదిత్యుం డస్తంగతుం డైన, నస్త్రసందర్శనరంగంబు వెలువడి దుర్యోధనుండు గర్ణుం దోడ్కొని కరదీపికా సహస్రంబుతో నిజమందిరంబున కరిగెఁ; బాండవులును భీష్మద్రోణవిదుర కృపాచార్యులతో నిజనివాసంబుల కరిగిరి. 61
ఆ. కుంతి యంత సహజకుండలకవచాభి | రాముఁ గర్ణుఁ జూచి రవి సమానుఁ
బ్రత్యభిజ్ఞ నెఱిఁగి ప్రథమపుత్త్ర స్నేహ | మెఱుకపడక యుండ నింతి యుండె.
62
క. వినుతధనుర్విద్యావిదు | ఘనుఁ గర్ణు సహాయుఁ బడసి కౌరవవిభుఁ డ
ర్జునువలనిభయము సెడి ఱొ | మ్మునఁ జేయిడి నిద్రవోయె ముదితాత్ముం డై.
63
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )