ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
కౌరవపాండవులు గురుదక్షిణార్థంబు ద్రుపదుం బట్టఁ జనుట (సం. 1-127-1)
వ. అంతఁ బ్రభాతం బగుటయు సమయనియమంబులు దీర్చి యాచార్యుండు శిష్యులనెల్ల రావించి ‘మీరు నాకు గురుదక్షిణ యిం’ డనిన నందఱు మ్రొక్కి యెదుర నిలిచి ‘మీ కెద్ది యిష్టంబు సెప్పుం’ డనిన విని ‘యవివేక కారణ దారుణైశ్వర్యావలిప్తుం డైన ద్రుపదు నొడిచిపట్టి తెం; డిదియ నా కిష్టం బైన గురుదక్షిణ’ యని పంచిన. 64
క. వల్లె యని రాజనందను | లెల్లను సమకట్టి, రథము లెక్కి దిశల్‌ భే
దిల్లఁగ గర్జిల్లి, నిశా | తోల్లసిత కృపాణ కార్ము కోద్యతకరు లై.
65
ఉత్సాహము. ‘ఏల దీని నెడయుఁ జేయ? నీ క్షణంబ యేఁగి పాం
చాలుఁ బట్టి తెత్త మధికశౌర్యలీల మెఱయఁగాఁ
బోలు’ ననుచుఁ బెరిఁగి రాజపుత్త్రు లెల్ల నరిగి పాం
చాలుపురము ముట్టికొని రసంఖ్య బలసమేతు లై.
66
వ. పాండవులును రథంబు లెక్కి ద్రోణుం బరివేష్టించి పిఱుంద నరిగి; రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె. 67
క. వడిగొని కౌరవు లొండొరుఁ | గడవఁగ మును చనిరి; వారిగర్వము సూడం
గడిమిని ద్రుపదాధిపుతోఁ | బొడువఁగఁ దమ కలవియగునె భుజవీర్యమునన్‌.
68
క. అతగులచే ద్రుపదుఁ డనవ | హితుఁ డై పట్టువడ నంతహీనుఁడె? శౌర్యో
న్నతుఁ డధికధనుర్విద్యా | న్వితుఁడు భవత్సఖుఁ డనంగ వినరొకొ వానిన్‌.
69
వ. అనుచుం బాంచాలుపురం బాసన్నంబు గాఁ జనుదెంచునంతకు ముందఱ చని దుర్యోధన యుయుత్సు దుశ్శాసనవికర్ణజలసంధాదు లైన ధార్తరాష్ట్రు లనేకనృపకుమారసహితు లై పాంచాలుపురం బవరోధించినఁ బాంచాలపతి యలిగి యపారచతురంగబలసమేతుం డై కౌరవులం దాఁకి. 70
క. శరనికరసహస్రంబులఁ | బరువడి నందఱను గప్పెఁ బ్రావృడ్ధారా
ధర మురుధారాజలముల | సరసిజములఁ గప్పునట్లు సంరంభమునన్‌.
71
క. కలయ నసిముసల దండం | బులు గొని కాంపిల్యనగరమున జను లెల్లన్‌
నలి రేఁగి యార్చి కౌరవ | బలసుభటులఁ బొడిచి రాజి బడలు వడంగన్‌.
72
క. ధృతరాష్ట్రకుమారకు లవ | హితు లై పాంచాలుమీఁద నేసిరి సాంద్రా
తతబాణప్రకరతిరో | హిత మై రవికిరణజాల మేర్పడకుండన్‌.
73
క. వారల శరములు నడుమన | వారించుచు నధికలాఘవంబున వారిన్‌
ఘోరశరవిద్ధమర్ములఁ | గా రణమున సోమకుండు ఘనుఁ డై యేసెన్‌.
74
క. నానావిధ మార్గణముల | నానామార్గముల నేసినం, గురువీరుల్‌
వానిం జూచి భయంపడి | నానాతనుఁగా మనంబునన్‌ వగచి రనిన్‌.
75
వ. ఇట్లు పాంచాలుబాణవృష్టికి నిలుపోపక కురుకుమారులు కుమారశరనిహత సురారికుమారులుంబోలె వెఱచఱిచి పాండవులయొద్దకుం బఱతెంచినం జూచి, యర్జునుం డాచార్యధర్మజులకు నమస్కరించి ‘మీర లింద యుండుం; డే నీక్షణంబ యప్పాంచాలుం బట్టి తెచ్చెద’ నని విజృంభించి, సంరంభంబున భీమసేనుండు దనకు సేనాగ్రచరుండుగా మాద్రేయులు రథచక్రరక్షకులుగా ద్రుపదరాజవాహినీసముద్రంబు దఱియం జొచ్చిన. 76
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )