ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
భీమార్జునులు ద్రుపదునిసేనను దునుమాడుట (సం. 1-78-40)
క. కరిఘటలఁ దాఁకి భీముఁడు | కరటికటీకుంభదంతకరముఖముల జ
ర్జరితములఁ జేసె నిష్ఠుర | తరవజ్రనిపాతపటుగదాఘాతములన్‌.
77
ఉ. దారుణమౌ వృకోదరు గదాకులిశాహతి నన్యవాహినీ
వారణసంచయం బభినవక్షతజారుణధార లొప్ప సం
చారితధాతునిర్‌ఝరవిశాలశిలోచ్చయ సంచయాభమై
వీరరణంబునం బడియె విక్షతహస్తిపవృక్షపంక్తితోన్‌.
78
చ. అనిలజుఁ డుగ్రుఁ డై ద్రుపదుహస్తిఘటావళి నశ్వసంహతిన్‌
ఘనరథకోటి భగ్నములుగా సమరంబునఁ జేసి పేదదు
ర్మనుజులఁ జంప నేల యని మానుగ గోపుఁడు గోగణంబులన్‌
గొనకొని రొప్పునట్టు లధికుం డెగిచెం బృథుదండహస్తుఁ డై.
79
స్రగ్ధర. అంతఁ గౌంతేయుఁ డత్యాయతభుజుఁడు నరుం డల్గి పాంచాలు దంతి
ధ్వాంతంబున్‌ వానివాహోత్తమతుహినతతిం దద్భటోదారతారా
సంతానంబున్‌ శరాంశూచ్చయవిభవమునన్‌ శాంతిఁ బొందించి యుద్య
ద్ధ్వాంతారాతిప్రభుం డై తనరుచు వెలిఁగెన్‌ దద్రణవ్యోమవీథిన్‌.
80
క. ఆతనిఁ జూచి సహింపక | యాతతకార్ముకుఁడు ద్రుపదుననుజుఁడు శౌర్యో
పేతుఁడు సత్యజితుం డను | నాతఁడు ధీరుఁ డయి తాఁకె నతిరభసమునన్‌.
81
క. కడఁగి ద్రుపదానుజుఁడు నె | వ్వడిఁ గవ్వడి నేసె నూఱువాఁడిశరములం
గడు నలిగి వాని నన్నియు | నడుమన తునియంగ నేసె నరుఁ డస్త్రములన్‌.
82
క. వివిధాస్త్రకోవిదుఁడు వా | సవి వానిరథంబుఁ బార్‌ష్ణిసారథుల మహిం
గువలు వడ నేసె నుగ్రా | హవమునకును వాఁడు విముఖుఁడై చెడి పఱవన్‌.
83
వ. అంత. 84
క. శరమోక్షణవేగనిరం | తరమండలితోరుచాపదండుఁ డకాండో
ద్ధురదండధరుఁడపోలెను | హరినందనుఁ దాఁకె ద్రుపదుఁ డత్యుద్ధతుఁ డై.
85
మ. పరమాస్త్రైకవిశారదుల్‌ బలయుతుల్‌ పాంచాలకౌంతేయు లొం
డొరులన్‌ మార్కొని యేయునప్పుడు తదీయోగ్రాజిరంగంబు దు
స్తర నీరంధ్ర నిశాత సాయక తమస్సంఛన్న మైనం బర
స్పరయుద్ధంబులు దక్కి యోధులు నిశాభ్రాంతాత్ము లై రచ్చటన్‌.
86
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )