ఇతిహాసములు భారతము ఆదిపర్వము - షష్ఠాశ్వాసము
అర్జునుఁడు ద్రుపదుం బట్టి కట్టి తెచ్చుట (సం. 1-128-3)
వ. అట్టి మహాద్వంద్వయుద్ధంబున విజిగీషుం డయి పాంచాలుండు పాండవమధ్యముధనుర్మధ్యంబు భగ్నంబుగా నొక్కబాణంబున నేసి యార్చిన, నలిగి వాసవసుతుం డుద్యతాసిహస్తుం డయి శైలస్థలంబుమీఁదికి లంఘించుకొదమసింగంబునుంబోలె ద్రుపదురథంబుమీఁదికి లంఘించి వానిం బట్టికొనినఁ దత్సైన్యంబు హాహాకారంబు లెసంగ మహార్ణవంబునుంబోలె మ్రోయుచుండె నంత. 87
క. ప్రక్షీణదర్పు ద్రుపదు ర | థాక్షముతోఁ గట్టి తెచ్చి యర్జునుఁడు క్రియా
దక్షుం డయి గురునకు గురు | దక్షిణగా నిచ్చి చేసెఁ దత్సమ్మదమున్‌.
88
వ. ద్రోణుండును నర్జునుచేసిన పరాక్రమంబునకుఁ బరమహృష్టహృదయుం డై ద్రుపదుం జూచి నగుచు ని ట్లనియె. 89
క. వీ రెవ్వ రయ్య? ద్రుపదమ | హారాజులె! యిట్లు కృపణు లయి పట్టువడన్‌
వీరికి వలసెనె? యహహ! మ | హారాజ్యమదాంధకార మది వాసెనొకో?
90
ఆ. ‘ఇంక నైన మమ్ము నెఱుఁగంగ నగునొక్కొ!’ | యనుచు నుల్లసంబు లాడి ద్రుపదు
విడిచిపుచ్చె గురుఁడు; విప్రులయలుకయుఁ | దృణహుతాశనంబు దీర్ఘ మగునె?
91
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - Adi parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )